శతకములు వేమన పద్యములు తృతీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. నాణెమైన చెడిప నయ మెఱింగి తిరుగు
విటుని కుస్తరించు వివర మెఱుఁగు
బానిసైనతొత్తు పాటింపరాదయా
విశ్వదాభిరామ వినర వేమ.
251
ఆ. పంద నధికుఁ జేసి బవరంబునకుఁ బంపఁ
బాఱిపోవుఁ గార్యభంగమౌను
పాఱునట్టిబంటు పనికిరాఁ డెందును
విశ్వదాభిరామ వినర వేమ.
252
ఆ. తిరుమలకును బోవఁ దుఱక దాసరి గాఁడు
కాశిబోవ లంజ గరిత గాదు
గుక్క సింహ మగునె గోదావరికిఁ బోవ
విశ్వదాభిరామ వినర వేమ.
253
ఆ. కులుకుగుబ్బఁ జూపి గొబ్బున గరిగించి
చేతికానులెల్లఁ జేరఁ దీయు
అతనుచేతికత్తు లమరికకాంతలు
విశ్వదాభిరామ వినర వేమ.
254
ఆ. అనుకూల్యముగల యంగన కలిగిన
సతికిపతికి పరమసౌఖ్య మమరు
ప్రాతికూల్యమైన పరిహరింప సుఖంబు
విశ్వదాభిరామ వినర వేమ.
255
ఆ. గొప్పపిఱుఁదు గన్న కుచకుంభములఁ గన్న
చెప్పరానిచోటి చెలువుగన్న
ముప్పిరి గొనునయ్య మొనసిన మోహంబు
విశ్వదాభిరామ వినర వేమ.
256
ఆ. కాశి కాశి యనుచుఁ గడువేడ్కతోఁ బోదు
రందుఁగల్గు దేవుఁడిందు లేఁడె
యిందు నందు గలఁడు హృదయంబు లెస్సైన
విశ్వదాభిరామ వినర వేమ.
257
ఆ. మతముదారి యగుచు మధురాధరముఁ జూచి
మగువరూపుఁ జూచి మనసు మఱచు
యోనిఁజూచి సర్వయోగముల్‌ మఱచురా
విశ్వదాభిరామ వినర వేమ.
258
ఆ. నీళ్ళ మునుఁగనేల నిధుల మెట్టఁగనేల
మొనసి వేల్పులకును మ్రొక్కనేల
కపటకల్మషములు కడుపులో నుండఁగా
విశ్వదాభిరామ వినర వేమ.
259
ఆ. కూడు చీరఁ బాసి గుళ్ళపంచలఁబడు
నట్లువ్రాసె బ్రహ్మ యతులనుదుట
తోయజాక్షు లుండ దోషంబు లంటునా
విశ్వదాభిరామ వినర వేమ.
260
ఆ. కుంటికుక్క కేల కుందేటిపరువులు
పిరికిబంటుకేల బిరుదుగొడుగు
ముసలిముండ కేల ముసిముసినవ్వులు
విశ్వదాభిరామ వినర వేమ.
261
ఆ. ఎంతభూమి దిరిగి యేపాటు పడుచున్న
నంటనీకప్రాప్తి వెంటదిరుగు
భూమిక్రొత్తదైన భోక్తలుక్రొత్తలా
విశ్వదాభిరామ వినర వేమ.
262
ఆ. పరఁగ జలకమాడి పట్టెనామముదీర్చి
నీరుకావిపంచె నెగడఁగట్టి
వారకాంతఁజూచి వ్రతమెల్ల మఱచురా
విశ్వదాభిరామ వినర వేమ.
263
ఆ. మనసు నిల్పలేని మాయావిరక్తులు
మనసుపడుదు రొక్క మగువమీదఁ
నిట్టివ్యర్థజన్మ మీ బ్రతుకేటికి
విశ్వదాభిరామ వినర వేమ.
264
ఆ. తొడలమెఱుపుసొంపు తోరంపుకుచములు
వారకొప్పుగలుగు వనితఁజూచి
విటుఁడు నిలుచుటెట్లు విరహాగ్ని కొగ్గును
విశ్వదాభిరామ వినర వేమ.
265
ఆ. కాశినీళ్ళు మోసి కాళ్లు మొగము వాచి
యెందు సుఖము లేక యెండి యెండి
చచ్చివెనుక ముక్తి సాధించఁగలరొకో
విశ్వదాభిరామ వినర వేమ.
266
ఆ. దేశదేశములను దిరిగిగాసిలినొంద
నాత్మయందు ధ్యాన మంటుకొనునె
కాసులకును దిరుగఁ గలుగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ.
267
ఆ. కచ్చమీఁద నాస కనకంబుపై నాస
లేనివాఁడు పుడమి లేనివాఁడు
కలిగెనేని యతఁడు గానంగ రాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ.
268
ఆ. వలపు తీఱువెనుక వనజాక్షి యధరంబు
ములకపంటిగిజరు ముష్టిరసము
చింతలేనివేళ జీడిసమానమౌ
విశ్వదాభిరామ వినర వేమ.
269
ఆ. చదువులెల్ల చదివి సర్వజ్ఞుఁడై యుండు
బ్రహ్మవిద్యలెల్ల పదటఁ గలిపి
యిఱుకుయోనిఁ జూచి పరమయోగము మాను
విశ్వదాభిరామ వినర వేమ.
270
క. తాము నిలుచుచోట దైవములేదని
పామర జనులు తిరుపతులు దిరిగి
జోకవీడి చేతిసొమ్మెలఁ బోఁజేసి
చెడిగృహంబు తాను జేరు వేమ.
271
ఆ. కాశిమధురకాంచి గయప్రయాగము సేతు
వాస తోడ వీని నాత్మఁ జూచి
వాసనను దెలియఁడు వట్టివెఱ్ఱివిధంబు
విశ్వదాభిరామ వినర వేమ.
272
ఆ. చదువు చదువ నేల సన్యాసి గానేల
షణ్మతములఁజిక్కి చావ నేల
అతని భజనఁజేసి యాత్మలోఁ దెలియుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ.
273
ఆ. మనములోనఁ బుట్టు మఱికోర్కులన్నియు
కోర్కులందు ముక్తి కుదురుపడదు
మనము బ్రహ్మమనుచు మదినెఱుంగఁగ లేరు
విశ్వదాభిరామ వినర వేమ.
274
ఆ. చదువులన్ని చదివి చాలవివేకియౌ
కపటికెన్న నెట్లు కలుగుముక్తి
దాలిగుంటఁగుక్క తలఁచిన చందము
విశ్వదాభిరామ వినర వేమ.
275
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )