| ఆ. |
కోమటికిక యాశ కొండలు వాములు
చందనంబు శోభ చంద్రకళలు
తనకు మితిలేదు నక్కడ గతిలేదు
వదన శుద్ధిలేనివాఁడు వేమా. |
326 |
|
| ఆ. |
ప్రజ యొనర్చుచెడ్డ ప్రభువుకు వచ్చును
ప్రభువు మంచికొరత ప్రజలకు సగము
ప్రభు వొనర్చు చెడ్డ ప్రజల కేలరాదురా
విశ్వదాభిరామ వినర వేమ. |
327 |
|
| ఆ. |
ఆఁడు దానిబొంకు గోడపెట్టినయట్టు
పురుషవరుని బొంకు పూలతడిక
స్త్రీలనేర్పులు భువి చీకు రాయితపము
విశ్వదాభిరామ వినర వేమ. |
328 |
|
| ఆ. |
అన్యులకును వచ్చునాపదఁ దనదిగా
నెన్నువాఁడు భువిని నున్నవాఁడు
ఎన్నువారిలోన నిహపరంబులు లెస్స
కన్నవాఁడు మిగుల ఘనుఁడు వేమా. |
329 |
|
| ఆ. |
కండలెల్లఁ గోయ కావికిఁజాలని
బండగోవు కాసపడినఁ గలదె
కొండఁ బసిఁడి కొండ గోరిన చందమౌ
విశ్వదాభిరామ వినర వేమ. |
330 |
|
| ఆ. |
ఎలమిని ధనకాంక్ష నెదిరిఁ దన్నెఱుఁగక
కన్నుఁ గాన కెల్ల కర్మలాగు
పుట్టినపుడు పుట్టె బుద్ధిహీనతవాని
నడుఁగబోవ కష్టమదియ వేమా. |
331 |
|
| ఆ. |
అష్టకష్టు బ్రదుకు నగ్నిపాలై పోవు
నిర్దయాత్ము బ్రతుకు నీటఁగలియు
క్రూరకర్ముబ్రతుకు చోరులపాలౌను
విశ్వదాభిరామ వినర వేమ. |
332 |
|
| ఆ. |
బాలచనులఁ బూలబంతులఁ బోల్తురు
ప్రాలుమాలినట్టి భ్రష్టు లవని
మాంసఖండమందు మఱియేమియున్నది
విశ్వదాభిరామ వినర వేమ. |
333 |
|
| ఆ. |
ఒకనికీడు వేఱెయొక్కని కియ్యఁడు
ఒకరిమేలు వేఱెయొకరి కీఁడు
కీడుమేలు వారు పోఁడిమి దెలియరు
కాలుఁ డెఱుఁగు వారిగతిని వేమా. |
334 |
|
| ఆ. |
పరగ నీవఱకును పడినపా ట్లెఱుగక
ఘనుఁడుగాగ మనుజుఁ డనఁగఁ బుట్టి
కీడు మే లెఱుఁగక క్రిందాయెఁ జూడరా
విశ్వదాభిరామ వినర వేమ. |
335 |
|
| ఆ. |
పుట్టలోన తేనె పుట్టినరీతిని
గుట్టమీఁద మణియు పుట్టువిధము
కట్టెలోన నగ్ని పుట్టినవిధమున
పుట్టి పెట్టవలెను భువిని వేమా. |
336 |
|
| ఆ. |
తనదునీడ శిశువు దాఁజూచుకొన్నట్టు
తనదునీడఁ జూచి తన్ను మఱచి
పతిని ననుమ నుడువు భ్రాంతుల నేమందు
విశ్వదాభిరామ వినర వేమ. |
337 |
|
| ఆ. |
తావులేనిచోట తాను తానె యుండు
తావు కలుగుచోట తానులేఁడు
తావు తానెయైన తత్వంబుఁ దెలియుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ. |
338 |
|
| ఆ. |
తన్నువలె నవియును ధరఁబుట్టినవి గావొ
పరఁగఁదమ్మువంటి బ్రతుకు గాదొ
జ్ఞాని జ్ఞానిఁ జంపిఁ గారణమేమిరా
విశ్వదాభిరామ వినర వేమ. |
339 |
|
| ఆ. |
ఒక్కమనసుతోడ నున్నది సకలము
తిక్క బట్టి నరులు తెలియలేరు
తిక్క నెఱిఁగి నడువ నొక్కఁడే చాలురా
విశ్వదాభిరామ వినర వేమ. |
340 |
|
| ఆ. |
పరఁగ ముందఱ తమ బ్రతుకుతె ర్వెఱుఁగక
సకల సంపదలును సతము లనుచు
జలముఁ బాయు చేఁపచంద మేర్పడి తుద
గతియువేఱెలేక గలుగు వేమా. |
341 |
|
| ఆ. |
తిట్టికొట్టిరేని తిరిగి మాటాడక
యడరుఁజూచి యదరింపకనీవు
తన్నుఁ గాదని నట్లు కాతఱపడకున్న
నట్టివాఁడు బ్రహ్మ మౌను వేమా. |
342 |
|
| ఆ. |
పిడుగును నరచేతఁ బిగఁబట్టి యందులోఁ
గల్మషంబునెల్ల కడకఁదీసి
కడమచేతి చేత కలియుగమును బ్రోచు
కర్మ కర్మ నెఱుగఁ గదర వేమా. |
343 |
|
| ఆ. |
పూర్ణమైన తనదు భుజబల్మిఁ జూడక
భువిని చెడుగుతోడ పోరరాదు
పాలకుండ కింత పొలసినా సారాయి
విశ్వదాభిరామ వినర వేమ. |
344 |
|
| ఆ. |
పరుల కుపకరించి పరుసొమ్ము పరునకు
పరఁగ నిచ్చె నేని పరము గల్గు
పరముకన్న నేమి పావనమా సొమ్ము
విశ్వదాభిరామ వినర వేమ. |
345 |
|
| ఆ. |
పలుగువానికేల పదనమృద్ధి దలంప
పలుగువరుస వానిబలిమి దప్ప
చలమువాని కేల సాత్వికధర్మంబు
ఏమి యొకటి ఘనము నిలను వేమా. |
346 |
|
| ఆ. |
సాగి పాఱురారు సకలకార్యంబుల
వాక్ప్రగల్భములచె వరలుచుండ్రు
సాగిపాఱక సఱిసమకూడ దొక్కటి
ధనమదెంతయున్న ధరను వేమా. |
347 |
|
| ఆ. |
అదయ హస్తమందు నభయహస్తంబీయ
దర్పకాంగుఁడైన తన్నుఁ జూచి
మంగళంబుచేయు మంగళహీనుఁడు
విశ్వదాభిరామ వినర వేమ. |
348 |
|
| ఆ. |
ఎఱుక నెఱుగువాని కెఱుక యే నడుచును
ఎఱుకలేనివాఁడు నెఱుఁగలేఁడు
ఎఱుకలోని యెఱుక నెఱుఁగుట తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
349 |
|
| క. |
జన్మమరణ సుషుప్తుల జనము లెల్ల
జరుగుచుండంగ నరుఁడు తా జంగమమను
నదియుఁ దెలియంగలేర నీయజ్ఞులైన
భూప్రజలు బుద్ధిలేకయు పొసఁగు వేమా. |
350 |
|