| క. |
పరనారీ దూరగుడై
పరధనముల కాసపడక పరహితదారై
పరులలిగిన దానలుగక
పరులెన్నగ బ్రతుకువాఁడు ప్రాజ్ఞుఁడు వేమా. |
51 |
|
| క. |
అజ్ఞానమె శూద్రత్వము
సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినరా
యజ్ఞాన ముడిగి వాల్మీకి
సుజ్ఞానపు బ్రహ్మమొందెఁ జూడర వేమా. |
52 |
|
| ఆ. |
నీళ్లలోనిచేప నెఱమాంస మాశకు
గాలమందుఁజిక్కి కూలినట్లు
ఆశపుట్టి మనుజుఁ డారీతి జెడిపోవు
విశ్వదాభిరామ వినర వేమ. |
53 |
|
| ఆ. |
బొంది యెవరిసొమ్ము పోషింపఁ బలుమారు
ప్రాణ మెవరిసొమ్ము భక్తిసేయ
ధనమ దెవరి సొమ్ము ధర్మమే తనసొమ్ము
విశ్వదాభిరామ వినర వేమ. |
54 |
|
| ఆ. |
నమశివ యనవచ్చు నారాయ ణనవచ్చు
మేలువారి నమ్మి మెచ్చవచ్చు
కొంగుకాసు విడిచి గొబ్బున నీరాదు
విశ్వదాభిరామ వినర వేమ. |
55 |
|
| ఆ. |
మేడిపండు చూడ మేలిమైయుండును
బొట్టవిచ్చి చూడఁ బురుగులుండుఁ
బెరుకువాని మదిని బింక మీలాగురా
విశ్వదాభిరామ వినర వేమ. |
56 |
|
| ఆ. |
ఉసురు లేనితిత్తి యిసుమంత నూదిన
పంచలోహములును భస్మమౌను
పెద్ద లుసురుమన్న పెనుమంట లెగయవా
విశ్వదాభిరామ వినర వేమ. |
57 |
|
| క. |
మందుదినఁ బోటు మానును
మందు దినగ జేయఁ బొలఁతి మహిలో వలచు\న్
మందుదిన కుదురు రోగము
మందుదినం గలదు పుష్టి మహిలో వేమా. |
58 |
|
| ఆ. |
తలను పాగ పైని తగుపచ్చడము బొజ్జ
చెవులపోగు లరసి చేరు నర్థి
శుద్ధపశువు లౌట బుద్ధిలో నెఱుగురా
విశ్వదాభిరామ వినర వేమ. |
59 |
|
| ఆ. |
స్త్రీలసుఖముఁ జూచి చిత్తంబు నిలుకడ
సేయని మనుజుండు చెడు నిజంబు
ఏటికట్టు మ్రాని కెప్పుడు చలనంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
60 |
|
| ఆ. |
కూలినాలిచేసి గుల్లాముపనిచేసి
తెచ్చిపెట్ట నాలు మెచ్చనేర్చు
లేమిఁజిక్కువిభుని వేమాఱు దిట్టును
విశ్వదాభిరామ వినర వేమ. |
61 |
|
| క. |
ఇంద్రియ పరవశుఁ డధముం
డింద్రియ పరవశుఁడు భక్తియెడ మధ్యముంఁడౌ
నింద్రియజయుఁ డుత్తముఁ జి
తేంద్రియసుతుఁడు విన మహేశుఁడు వేమా. |
62 |
|
| క. |
తన గుణము తనకు నుండఁగ
నెనయంగా నొరునిగుణము నెంచును మదిలో
తన గుణముఁదాను దెలియక
పనరి యొరుని ననెడువాఁడు భ్రష్టుఁడు వేమా. |
63 |
|
| ఆ. |
వెఱ్ఱివాని కయిన వేషధారికయిన
రోగికైన పరమయోగికైన
స్త్రీలఁజూచినపుడె చిత్తంబు రంజిల్లు
విశ్వదాభిరామ వినర వేమ. |
64 |
|
| ఆ. |
తావసించుచోటఁ దగనల్గు డాయెనా
సౌఖ్యభూమి కపుడు జరుగవలయు
కొలఁకు లింకెనేని కొంగ లందుండునా
విశ్వదాభిరామ వినర వేమ. |
65 |
|
| ఆ. |
భూమిలోనఁ బుణ్యపురుషులు లేకున్న
జగములేలనిల్చు సమయుఁగాక
నంత దఱచుదొరక రాడ నాడనెగాని
విశ్వదాభిరామ వినర వేమ. |
66 |
|
| ఆ. |
చిత్తశుద్ధిగల్గి చేసినపుణ్యంబు
కొంచెమయిన నదియు గొదువ కాదు
విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినర వేమ. |
67 |
|
| ఆ. |
చెడ్డవాని మిగులఁ జెఱుచును దైవంబు
అడ్డపడదు వాని కాపదయిన
చెడినచేనుఁ జూచి యొడయఁడు మెచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ. |
68 |
|
| ఆ. |
ఎక్కడయినయాశ లినుమడియుండఁగా
తిక్కపట్టి నరుఁడు తిరుగుచుండు
కుక్కవంటి యాశ కూర్చుండ నీయదు
విశ్వదాభిరామ వినర వేమ. |
69 |
|
| ఆ. |
అరయఁ దఱచుకల్ల లాడెడు వారిండ్ల
వెడలకేల లక్ష్మి విశ్రమించు
నీరు నోటికుండ నిలువని చందాన
విశ్వదాభిరామ వినర వేమ. |
70 |
|
| ఆ. |
గుణవతి యగు యువతి గృహము చక్కగనుండు
చీకటింట దివ్వె చెలఁగురీతి
దేవియున్న యిల్లు దేవార్చన గృహంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
71 |
|
| ఆ. |
ఇంటియాలు విడిచి యిల జారకాంతల
వెంటఁ దిరుగువాఁడు వెఱ్ఱివాఁడు
పంటచేను విడిచి పరిగ యేరినయట్లు
విశ్వదాభిరామ వినర వేమ. |
72 |
|
| ఆ. |
రాజవరుల కెపుడు రణరంగముల చింత
పరమ మునులకెల్ల పరముచింత
యల్పనరుల కెల్ల నతివలపై చింత
విశ్వదాభిరామ వినర వేమ. |
73 |
|
| ఆ. |
తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు
పుట్టనేమివాఁడు గిట్టనేమి
పుట్టలోనఁ జెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినర వేమ. |
74 |
|
| క. |
ముందరి పోటుల మాన్పను
మందెందును గలదుగాని మహిలోపల నే
నిందల పోటులు మాన్పెడు
మందెచ్చట నైనఁ గలదె మహిలో వేమా. |
75 |
|