| ఆ. |
మోదమునను గురుని ముఖ్యకరుణచేతఁ
దొమ్మిదిస్థలముల దొడ్డు పాయ
సర్వజీవుఁడాయె సర్వమ్ముఁ దానాయె
విశ్వదాభిరామ వినర వేమ. |
276 |
|
| క. |
పగయుడుగుఁ గోప ముడిగినఁ
బగ యుడుగ\న్ గోర్కులుడుగు పరజన్మముల\న్
దగు లుడుగు భేద ముడిగినఁ
ద్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమా. |
277 |
|
| ఆ. |
ప్రణవ మెఱుఁగఁ బోఁడు భక్తుఁ డెప్పుడు గాఁడు
జ్యోతియెఱుఁగఁ బోడు యోగిగాఁడు
నిత్య మెఱుఁగ వాఁడు నిర్వాణిగాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ. |
278 |
|
| ఆ. |
పగలురేయి మరచి భావంబు లోపలఁ
దాను నేను ననెడు తలఁపు మఱచి
యున్నయట్టి యతఁడు నుత్తమ యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ. |
279 |
|
| ఆ. |
తన్ను వెదకిచూడఁ దానెపో జీవుండు
తత్వ మరసిచూడఁ దానె యాత్మ
మన్ను మిన్ను లేదు మాయరా లేదయా
విశ్వదాభిరామ వినర వేమ. |
280 |
|
| ఆ. |
మూలచక్ర మట్టె మొనసి గట్టిఁగ బట్టి
శోధఁజేసి శక్తి చొరవ దెలిసి
భేదపరచి మనసు బాధించి మోక్షము
సాధ్యమైన యోగి సరణి వేమా. |
281 |
|
| సీ. |
నేమమునను నుండ నిల్చును చిత్తంబు - తామసమున నుండ దలఁగిపోవు
నిలిచిన చిత్తము నిర్భీతి నొందించు - నిర్భీతి సఖ్యంబు నీరసించు
సఖ్యదూరగుణము సమమును బొందించు - సమగుణమునఁ జూడ సమతపుట్టు
నట్టి సమత విశ్వమంతయుఁ దానగుఁ - దానె విశ్వంబయిన తత్వమగును |
|
| గీ. |
తత్వ మింద్రియముల దరిఁజూచి గెలుచును
దత్వవేత్తయైనఁ దానె మిగిలి
రాజయోగి యనుచుఁ దేజంబుచేతను
దెలిసియుండు జగతి వినర వేమ. |
282 |
|
| ఆ. |
మాటచెఱపు మూట మర్మము కర్మము
ఆశయ కడగట్టు అప్పుముప్పు
బాస దోస మెన్నఁ బలుకులు ములుకులు
లేశమయినఁ దెలియలేరు వేమా. |
283 |
|
| క. |
తొమ్మిది క్రంతపత్తికి
నిమ్మగు సొమ్ములును గులము నేటికిఁ జెపుమా
నమ్మకు దేహము నాదని
నెమ్మది బ్రహ్మంబు దెలియునే నని వేమా. |
284 |
|
| క. |
అరిషడ్వర్గంబులచే
నరులెల్లను జొక్కిచిక్కినయగతి యనుచు\న్
జరుగుదురు గాకతత్వము
నరయంగను లేరు నించుకైనను వేమా. |
285 |
|
| ఆ. |
మ్రానుఁ గాలవేసి మహిమీఁద నొకజాణ
పూని తిరుగుచుండుఁ బొందుగాను
కాలవేయు మ్రాను కడురమ్యమైయుండు
విశ్వదాభిరామ వినర వేమ. |
286 |
|
| క. |
బయలున బంధము గప్పను
బయలునఁ బరమాత్మునకును బంధము తొలఁగు\న్
బయలున బంధము లూడిన
నయవర్తన ముక్తిఁగాంచు నరుఁడటు వేమా. |
287 |
|
| మ. |
ఎప్పుడు చూచిన న్నితర మేమియుఁ జూడక ముక్తి యందుఁగ\న్
ఱెప్పల మూసి మూయకయ రేయిఁ బగ ళ్ళొకరీతి నుండఁగా
దప్పుల నొందఁ జేయు యమ ధర్ముని పాలికినొంద నేర్చునే
చెప్పఁగ నేమి వేమనకు జెల్లునుముక్తి విధానమంతయున్. |
288 |
|
| ఆ. |
మాట లుడుగకున్న మంత్రంబు దొరకదు
మంత్ర ముడుగకున్న మనసు నిలదు
మనసు నిలుపకున్న మఱి ముక్తి లేదయా
విశ్వదాభిరామ వినర వేమ. |
289 |
|
| ఆ. |
ఎండచీఁకటులకు నిమ్మయియుండెడు
నిండు కుండలోన నిద్రమఱచి
దండియైన పరమతత్వంబు దెలియురా
విశ్వదాభిరామ వినర వేమ. |
290 |
|
| తే. |
కడఁగి సంకల్పములనెల్లఁ గట్టిపెట్టి
చిత్తమున నేమి తలఁపక చిత్రరూపు
కైవడిని నున్న యాతఁడు ఘనుఁడు దలఁప
నడవియందైనఁ బట్టణమందు వేమా. |
291 |
|
| క. |
రెప్పలు మూసియు మూయఁగఁ
దప్పక తనమనమునందుఁ దత్వము గూడున్
ఎప్పుడు చూచెడువానికిఁ
జొప్పెడు నెచ్చోట ముక్తి సులభము వేమా. |
292 |
|
| క. |
తలఁచిన దత్వంబగునా
తలఁపక తా నూరకున్నఁ దత్వంబగునా
తలఁచుట తలఁపమి రెండును
దలఁపక తానుండెనేని దత్వము వేమా. |
293 |
|
| ఆ. |
ఆఱుమతములందు నధికమైన మతము
లింగమతముకన్న లేదు జగతి
లింగధారికన్న దొంగలు లేరురా
విశ్వదాభిరామ వినర వేమ. |
294 |
|
| ఆ. |
సమమునైన దృష్టి సమముగా మదినిల్పి
బయలురుచులు మాని భద్రముగను
పరగఁజూడ బట్టబయలగు బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
295 |
|
| ఆ. |
వినరననక మెల్ల వెలిమూసి వాయువుల్
మనసుతోడఁ గూర్చి మర్మ మెఱిఁగి
యాత్మలింగపూజ నంటిన ముక్తిరా
విశ్వదాభిరామ వినర వేమ. |
296 |
|
| ఆ. |
నాసికంబునడుమ ననుఁజూచు యోగికి
వాసి వన్నె లేదు వసుధలోన
కాశినాథునైనఁ గనఁగలఁ డాయోగి
విశ్వదాభిరామ వినర వేమ. |
297 |
|
| ఆ. |
సూచికాగ్రదృష్టి సొరిది భ్రూమద్యము
జూచి చూచి మఱియు చూచెనేని
ఆత్మరాకపోక లప్పుడె తెలియురా
విశ్వదాభిరామ వినర వేమ. |
298 |
|
| ఆ. |
నిద్రలోనినిద్ర నిజముగాఁ దెలిసిన
భద్రమౌను విద్య బ్రహ్మవిద్య
నిద్రదెలియువాఁడు నిర్మలయోగిరా
విశ్వదాభిరామ వినర వేమ. |
299 |
|
| ఆ. |
ముక్కుతుదను దృష్టి ముదముతోడుత నిల్పి
హృదయమందుఁజూడ నొసగుముక్తి
పదవులెరుగకున్న పరమాత్మ యోగియౌ
విశ్వదాభిరామ వినర వేమ. |
300 |
|