శతకములు వేమన పద్యములు తృతీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. వండివచ్చునపుడు వంటక మమృతంబు
కంటికింపుగాను కానుపించు
నొడలతినినదిండి వడిమించ గడిదేఱు
విశ్వదాభిరామ వినర వేమ.
51
ఆ. కలిగి ధర్మమీయఁ గాననివారును
కలిగి తినక చాలగ్రాఁగువారు
కలిమి నెచటఁ జూడఁ గానక చెడుదురు
విశ్వదాభిరామ వినర వేమ.
52
ఆ. అల్లువాని మృతికి నాత్మఁ జింతించును
తనయుమృతికిఁ దానె తల్లడిల్లుఁ
బుణ్యపురుషు మృతికి భూమిలో జనులకు
యుగము గ్రుంగినట్టు లుండు వేమ.
53
ఆ. సకలవిద్య లరసి చచ్చి బ్రతుకువిద్య
యొకటినేర మనుచు నుర్విజనులు
కటకటఁ బడుదురు కడహానిఁ దెలియరు
విశ్వదాభిరామ వినర వేమ.
54
ఆ. దూరదృష్టిఁ గనరు దుడుకుడువదలక
బారప ట్టెఱుగరు పడినదనుక
దండసాధ్యు లయిరి ధర్మసాధ్యులుగాక
భూమిజనులు వెఱ్ఱిబుద్ధి వేమ.
55
ఆ. ముష్టి వేపచెట్టు మొదలుగా ప్రజలకు
పరఁగ మూలికలకు పనికివచ్చు
నిర్దయాత్మకుండు నీచుఁడెందునకును
పనికిరాఁడు గదర పరఁగ వేమ.
56
ఆ. ప్రభువు కోఁతియైనఁ బ్రగ్గడ పందియౌ
సైనికుండు పక్కి సేన పసులు
ఏనుఁగు లశ్వము లెలుకలు పిల్లులు
విశ్వదాభిరామ వినర వేమ.
57
ఆ. తిట్టెనేని మొట్టు మొట్టినఁ గొట్టును
కొట్టెనేని యముఁడు కొద్దిపఱచుఁ
గోప మెంచ చెడ్డపాపము నరహత్య
విశ్వదాభిరామ వినర వేమ.
58
ఆ. కోపమునను ఘనత కొంచెమై పోవును
కోపమునను మిగుల గోడుఁజెందుఁ
గోపమడచెనేని గోరిక లీడేరు
విశ్వదాభిరామ వినర వేమ.
59
ఆ. కోపమునను నరక కూపముఁ జెందును
కోపమునను గుణము కొంచె మగును
కోపమునను బ్రతుకు కొంచెమై పోవును
విశ్వదాభిరామ వినర వేమ.
60
ఆ. రాజుమాటవలెను రసికుఁ డాడగవలె
నెంతపనికి నుబికి యెగురరాదు
కదిసి యెగిరెనేని గ్రహసమానము గాదె
దొడ్డ కొంచె మేల దొరకు వేమ.
61
క. సాధుసజ్జనులను సంతరించినవాఁడు
ప్రజల సంతసంబు పఱచువాఁడు
కదిసి శాత్రవులను గరుణఁజూచినవాఁడు
పాదుకొన్న ముక్తిపరుఁడు వేమ.
62
ఆ. పరఁగ లేమిచేత బంధువుల్‌ పగవారు
పరఁగ లేమిచేతఁ బరము తప్పు
పరఁగ లేమిచేతఁ బరపతి దప్పురా
విశ్వదాభిరామ వినర వేమ.
63
ఆ. నేర్చి నడుతునన్న నేరమి తా వచ్చు
నోర్చి నడతునన్న నోర్పురాదు
కూర్చి నడతునన్నఁ గూడంగ నీయదు
విశ్వదాభిరామ వినర వేమ.
64
ఆ. ధనము లేమి యనెడు దావానలం బది
తన్నుఁ జెఱచును దరిదాపుఁ జెఱచు
ధనములేమి చూడఁదలఁచగా పాపంబు
విశ్వదాభిరామ వినర వేమ.
65
ఆ. కాఁపు బల్మియున్నఁ గరణాన కది బల్మి
కరణముబలిమెల్ల గాఁపుబలిమి
కాఁపుసంతసంబు కరణముసంతోష
మరసిచూడ లోకమందు వేమ.
66
ఆ. కనుక గ్రామమునకుఁ గారణకర్తలి
ట్లుండయగుచు నుభయులుండిరేని
గండపక్షియుగళ ముండినరీతిని
నుద్దిగూడి బ్రతుకుచుంద్రు వేమ.
67
ఆ. చేకొనుచును తనకుఁ జేరి సాగినంతలోఁ
జెడిన ప్రజల రక్షసేయకున్న
తనదుసాగుటేమి తనతనువదియేమి
విశ్వదాభిరామ వినర వేమ.
68
ఆ. దోపునిచ్చువాఁడు తులలేని నెఱదాత
దోఁచుకొన్నవాఁడు ద్రోహి యయ్యె
ప్రాపుఁ జూపువాఁడు పరమపుణ్యుం డయ్యె
ప్రాపుఁజెఱచువాఁడు పశువు వేమ.
69
క. కాలము తన కిక చాలా
కాలము గలదంచునున్న కాలమునందు\న్‌
కూళఁడు తను దాఁదెలియక
కూలును తొలిజామునందు గొబ్బున వేమా.
70
ఆ. కూటవాసి యగుచు గుణములఁ బచరించి
నీటనీడవలెను నిలిచియుండు
నుదకఘటములందు నొగిఁదోఁచుటే గాని
సూర్యుఁడొకఁడు గాఁడె చూడ వేమ.
71
తే. ప్రాఁతచేసిన నర్తనల్‌ పదటఁగలిపి
క్రొత్తనర్తనఁ జేతురు కోడెకాండ్రు
కన్నతల్లిని విడనాడి కష్టపెట్టి
యన్యకాంతలఁ బోషించునట్లు వేమ.
72
ఆ. వావివర్తనలును వరుసలు మర్యాద
దప్పి నడచెనేని తగులుఁ గీడు
వదల దపుడు తాకు నది దప్పినం దుది
ముసలిముప్పునైన మునుగు వేమా.
73
ఆ. ఇంగలంబుతోడ నిలనల్పుతోడను
పరునియాలితోడ పతితుతోడ
సరసమాడు టెల్లచావుకు మూలంబు
విశ్వదాభిరామ వినర వేమ.
74
ఆ. మనసు నిల్పినట్టి మర్మజ్ఞులగువారు
గరిమ మోక్షపదముఁ గన్నవారు
చెట్టుఁబెట్ట ఫలము చేకొనఁడాతాను
విశ్వదాభిరామ వినర వేమ.
75
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )