శతకములు వేమన పద్యములు తృతీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. కడుపులోనిరోఁత కడు నోటియెంగిలి
కడుగ వశమె బ్రహ్మకొడుకుకైన
సత్యమున్న కొంత జగతిపై సిద్ధించు
విశ్వదాభిరామ వినర వేమ.
101
ఆ. అన్నిగోసివేసి యనలంబు చల్లార్చి
గోచిబిగియఁగట్టి కోప మడచి
యాసవిడిచెనేని యతఁడు తా యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ.
102
ఆ. గుణహీనజనుని గుణ మెంచగా నేల
బుద్ధిలేనివాని పూజలేల
మనసు లేనివాని మంత్రంబు లేలరా
విశ్వదాభిరామ వినర వేమ.
103
తే. కూడుఁగుడిచియు శతకోటిపడిగ లెత్తి
మాటిమాటికిఁ దినియును మంటఁగలిపి
కాటికేగువేళను రిత్తకూటి కగును
దాటిపోదురు నిజముగ దరికి వేమ.
104
ఆ. గీము విడిచి సుగుడి గిక్కురుమన కుండు
జీవు విడుచువేళ శివునిఁ దలఁచు
మనసు గొల్పకయును మాయచేఁ బొరలెడు
పాపనరుల కేటి పరము వేమ.
105
ఆ. తనకుఁ జేయుమేలుఁ దాఁ దెలియగ నేర్చు
నెలమితోడకుక్క యెఱుఁగు భువిని
తనకుఁ జేయుమేలు దాఁదెలియగలేని
మనుజుఁ డెంతఖలుఁడు మహిని వేమా.
106
ఆ. హీననరులతోడ నింతులతోడను
పడుచువాండ్రతోడ ప్రభువుతోడ
ప్రాజ్ఞ జనులతోడ బ్రహ్మఘ్న జనులతో
వైపు దెలిసి పలుకవలయు వేమ.
107
ఆ. అధికజనులతోడ నాప్తులతోడను
పరువు గురు తెఱింగి పలుకకున్న
వచ్చు చెడ్డతనము హెచ్చుగా గాంభీర్య
హానిచెందుఁ దనకు నపుడు వేమ.
108
ఆ. అరుదుగా నడిగిన యతఁడర్థిగాఁబోడు
తఱచుగా నొసగక దాతగాఁడు
దాత కర్థి కింత తారతమ్యము సుమా
విశ్వదాభిరామ వినర వేమ.
109
ఆ. తల్లిదండ్రులందు దారిద్ర్యయుతులందు
నమ్మని నిరుపేద నరులయందు
ప్రభువులందుఁ జూడ భయభక్తు లమరిన
నిహముఫలము కల్గు నెసఁగు వేమ.
110
ఆ. ముట్టుముట్టనుచును ముట్టరా దందురు
ముట్టుకు దరి యేమి మూలమేమి
నవబిలములముఱికి నరుల కందఱకును
విశ్వదాభిరామ వినర వేమ.
111
ఆ. పరఁగఁదానొసఁగక పరులు చెప్పినదైన
నియ్యజాలకవిధి నెసఁగువాఁడు
పొట్టుఁదినెడులండి బువ్వలు పెట్టునా
విశ్వదాభిరామ వినర వేమ.
112
ఆ. అండదప్పిన నరుఁడతిధార్మికునియిల్లు
చేరవలయు బ్రతుకఁజేయు నతఁడు
ఆ విభీషణునకు నతిగౌరవంబీడె
భూతలమున రామమూర్తి వేమ.
113
ఆ. సకలవిద్య లరసి సంతోషపడవచ్చుఁ
జెయ్యిసాచి కాసు లియ్యఁలేడు
చెలఁగి యొరులకైన చెప్పవచ్చునుగాని
తాను చేయలేఁడు ధరను వేమ.
114
ఆ. ధర్మసత్యములను దప్పకచేయని
కర్మజీవి మేలుఁ గానఁలేఁడు
నిర్మలహృదయుండు నీరూపమున నుండు
విశ్వదాభిరామ వినర వేమ.
115
ఆ. ధనములేమి కులము తక్కువపడవచ్చు
ధనములేమి కీర్తి దలఁగిపోవు
ధనములేమి శుచిని దగఁబుట్టనియ్యదు
ధనములేమి ఘనత తప్పు వేమ.
116
ఆ. ధనములేమి సుతులు తప్పుల నిడుదురు
ధనములేమి పత్నిఁ దాకరాదు
ధనములే మెవరికి తాళిక యుండదు
విశ్వదాభిరామ వినర వేమ.
117
ఆ. చచ్చువార లెవరు చావనివా రేరి
చచ్చి బ్రతికియుండుజన్ము లెవరు
విచ్చలవిడిగాను వివరించి చూడరా
విశ్వదాభిరామ వినర వేమ.
118
ఆ. బ్రతుకువార లెవరు బ్రతుకకుందు రెవరు
బ్రతికిబ్రతుకలేని ప్రాణు లెవరు
క్షితిని శోధఁజేసి స్థిరమునఁజూడరా
విశ్వదాభిరామ వినర వేమ.
119
ఆ. పెట్టువార లెవరు పెట్టకుందు రెవరు
పెట్టిపుట్టినట్టిదిట్ట లెవరు
పట్టుదప్పకుండ భావించి చూడరా
విశ్వదాభిరామ వినర వేమ.
120
ఆ. పుట్టువార లెవరు పుట్టకుందు రెవరు
పుట్టిగిట్టినట్టి పురుషు లెవరు
పుట్టిపుట్టనియట్లు బోధించి చూడరా
విశ్వదాభిరామ వినర వేమ.
121
ఆ. కట్టువార లేరి కట్టినవారేరి
కట్టికట్ట లేని కర్ము లేరి
గట్టిపఱచిలెస్స గనుగల్గి చూడరా
విశ్వదాభిరామ వినర వేమ.
122
ఆ. ఇట్టిపంచజనుని యేష్యము దెలిసిన
పెట్టి పుట్టి కట్టి పృథివి బ్రతికి
చచ్చి సిద్ధుఁడగుచు సర్వజ్ఞుఁడయినిల్చు
నెల్లమహిమ నీకు చెల్లు వేమ.
123
ఆ. మూఢకోపములను మోహలాభంబులు
నక్కజంపు క్రూర మధిక మయ్యె
కక్కసంబుచేతఁ గాలునిచేతను
మొక్కఁబోదురు తుది మొనసి వేమ.
124
ఆ. చిత్తముగలయోగి శివునివలనే యుండు
మిథ్యయోగి యుండు మిడుతవలెనె
నిత్యుఁడైన యోగి నీవలె నుండురా
విశ్వదాభిరామ వినర వేమ.
125
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )