శతకములు వేమన పద్యములు ప్రథమాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. బయలులోని బయలు పరికించి చూడక
బయలు రూపుఁ జూచి వలచెఁగాక
ముఱికిదేహమందు మోహంబు విడదాయె
విశ్వదాభిరామ వినర వేమ.
301
క. తలఁచినను శూన్యతత్వము
తలఁపక యుండినను శూన్యతత్వం బదియౌ
తలఁచిన తలఁపీడేఱును
దలఁచకయుండినను దానె తత్వము వేమా.
302
ఆ. అంతరంగమందు నభవు నుద్దేశించి
నిల్పి చూడఁదలఁపు నిలుచుఁగాక
బాహ్యమందు శివుని భావింప నిలుచునా
విశ్వదాభిరామ వినర వేమ.
303
ఆ. ఆఱుగురిని జంపి హరిమీఁద ధ్యానంబు
నిలిపి నిశ్చలముగ నెగడి యాత్మ
నతని నొకనిఁ జేయ నాతఁడె యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ.
304
ఆ. తాను నేననియెడు తత్వభేదంబును
మాని కడువివేక మహిమఁ దనరి
యూరకున్నవాఁడు నుత్తమోత్తముఁడురా
విశ్వదాభిరామ వినర వేమ.
305
క. తా నొకటి దెలియునన్నది
తానట్టిది లేక యెల్లతావులు దానై
తానేగి పరిణమించిన
మానవునకు ముక్తి గలదు మహిలో వేమా.
306
క. బైలున బంధము గలపక
వ్రాలెను పరమాత్మునకును వాంఛిత మొప్ప\న్‌
బైలున బంధము గలిపిన
కైలాసముఁజేరి ముక్తి గాంచుర వేమా.
307
ఆ. లోన బయలుచేసి లోకంబు దెగటార్చి
కులము గాలఁబెట్టి గుణము వదలి
చింతలోనిచింతఁ జేరిన యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ.
308
ఆ. రోయవచ్చుఁ బరము రూఢిగాఁ దెలిసిన
గానవచ్చు గ్రుడ్డు కదలకున్న
రెప్పలార్పకున్న రెంటి సందుననుండి
విశ్వదాభిరామ వినర వేమ.
309
ఆ. కొంపలోన నున్న కోర్కెలు ఛేదించి
పరగ హృదయ మట్టె పదిలపఱచి
గృహము నిల్పువాఁడు బహుతత్త్వవేదిరా
విశ్వదాభిరామ వినర వేమ.
310
ఆ. దర్శనంబులందు ధర షణ్మతములందు
వర్ణకాశ్రమముల వదల కెపుడు
తిరుగుచున్నవాఁడు ధరలోన నధముండు
విశ్వదాభిరామ వినర వేమ.
311
క. అక్షరపుటడవిఁ బొరలక
యక్షరమగు మహిగాన నవనిం దొలుతౌ
నక్షరమును జపియించిన
నక్షరమగు నదియు చాల నరయఁగ వేమా.
312
ఆ. బ్రహ్మ మనగవేఱె పరదేశమున లేదు
బ్రహ్మ మనగ దానె బట్టబయలు
తన్నుదా నెఱిఁగినఁ దానెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ.
313
ఆ. అణువులోన నుండు నఖిలజగంబులు
నణువు తనదులోన నణఁగియుండు
మనసు నిల్ప నరుఁడు మఱిముక్తిఁ జేరురా
విశ్వదాభిరామ వినర వేమ.
314
ఆ. వెన్న చేతఁబట్టి వివరంబు దెలియక
ఘృతముఁ గోరునట్టి యతనిభంగి
తాను దైవమయ్యు దైవంబుఁ దలఁచును
విశ్వదాభిరామ వినర వేమ.
315
ఆ. అదిఁజూచుచుండ నన్నిటఁ దా నుండు
నాదిఁ జూప నొకని కలవిగాదు
ఆదిముక్తిఁ దెలుపు నాత్మనే యుండురా
విశ్వదాభిరామ వినర వేమ.
316
ఆ. తన్నెఱుఁగనివాఁడు తానె తానై యుండుఁ
దన్నెఱుంగువాఁడు తానె తాను
తనువులేనివాఁడు తానె తానౌనయా
విశ్వదాభిరామ వినర వేమ.
317
క. తానును సమస్తభువనము
లోనసువుల యంగఁదెలిసి లోనను వెలయు\న్‌
దానై వెలుఁగఁగ నేర్చిన
మానవునకు ముక్తి గలుగు మహిలో వేమా.
318
క. బయలున సర్వము పుట్టును
బయలందే లీనమగును బ్రహ్మం బనఁగా
బయలని మదిలోఁ దెలిసిన
బయలందే ముక్తి బట్టబయలగు వేమ.
319
ఆ. బయలు రూపు రూపు బయలునుగాఁ జేసి
బయలు రూపు బట్టబయలు చేసి
బయలులోనివాని భావింపఁ దత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ.
320
ఆ. కంటిలోనివానిఁ గఱకంఠుఁ డెఱుఁగును
గంటిలోనివాని మింటఁ జూడ
కన్నుమిన్ను హృదయంబాయె నెంచంగ
విశ్వదాభిరామ వినర వేమ.
321
ఆ. నిజము వరుస నెఱిఁగి నిత్యుండు గావలె
పలుకులోనిపలుకు పదిలపఱపు
పలుకుఁజూడ నెవరొ పరికించి చూడరా
విశ్వదాభిరామ వినర వేమ.
322
ఆ. పంచవర్ణు నెఱుఁగఁ బరము నెఱుంగును
పరము నెఱుగ నిచ్ఛ ప్రజ్వరిల్లు
ప్రజ్వరిల్లునాఁడు పరముతా నౌనయా
విశ్వదాభిరామ వినర వేమ.
323
ఆ. ఇహము విడువ ఫలము లింపుగఁ గలవని
మహిని బలుకువారి మాటకల్ల
యిహములోనఁ బరము నెరుఁగుట కానరో
విశ్వదాభిరామ వినర వేమ.
324
ఆ. లింగమందుచూడ లీనమై యుండెనా
యంగమందు లింగ మమరియుండు
లింగభావమెఱిఁగి లీనమై యుండరు
విశ్వదాభిరామ వినర వేమ.
325
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )