శతకములు వేమన పద్యములు ద్వితీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. తనదుదాన మవనిఁ దనకూఁతు సమమగు
తండ్రిదాన మెల్లఁ దనకుఁ దోడు
అన్యు లిచ్చుదాన మది తనవంటిది
విశ్వదాభిరామ వినర వేమ.
126
ఆ. గతము చేసినట్టి కర్మబంధము లన్ని
తరలిపోవు సత్యగురునివలన
కమ్మరి కొకయేఁడు గుదియకు నొకనాఁడు
విశ్వదాభిరామ వినర వేమ.
127
ఆ. జాతులందు మిగుల జాతి యే దెక్కువో
యెఱుక లేక తిరుగు నేమిఫలము
ఎఱుక గలుగువాఁడె హెచ్చైన కులజుండు
విశ్వదాభిరామ వినర వేమ.
128
ఆ. కూటికి వగలేక కూర్చున్నవారికి
నాఁడుదానిమీఁది యాస గలదె
యన్నమదముచేత నన్ని మదంబులౌ
విశ్వదాభిరామ వినర వేమ.
129
ఆ. ఒడ్డు పొడుగు గలిగి గడ్డంబుఁ బొడుగైన
దానగుణములేక దాత యగునె
యెనుము గొప్పదైన నేనుఁగుంబోలునా
విశ్వదాభిరామ వినర వేమ.
130
ఆ. సతులఁ జూచి నరుఁడు సౌఖ్యంబు గోరును
గతులఁ గానలేఁడు కర్మమందు
గతుల సతులవలనఁ గానంగ లేఁడయా
విశ్వదాభిరామ వినర వేమ.
131
ఆ. అన్నిజాడ లుడిగి యానందగాముఁడై
నిన్ను నమ్మఁజూచు నిష్ఠతోడ
నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన
విశ్వదాభిరామ వినర వేమ.
132
ఆ. ఆలిమాటలు విని యన్నదమ్ముల రోసి
వేఱుపడెడువాఁడు వెఱ్ఱివాఁడు
కుక్కతోఁకఁ బట్టి గోదావ రీఁదునా
విశ్వదాభిరామ వినర వేమ.
133
ఆ. స్త్రీలు కల్గుచోట చెల్లాటములుకల్గు
స్త్రీలులేని చోటఁ జిన్నఁబోవు
స్త్రీలచేత నరులు చిక్కుచున్నారయా
విశ్వదాభిరామ వినర వేమ.
134
ఆ. మాల మాలగాఁడు మహిమీఁద నేప్రొద్దు
మాటతిరుగువాఁడు మాలగాక
వాని మాలయన్నవాఁడెపో పెనుమాల
విశ్వదాభిరామ వినర వేమ.
135
ఆ. చిప్పలోనఁ బడ్డ చినుకు ముత్యం బాయె
నీళ్ళలోనఁగలిసి నీరె యాయె
ప్రాప్తము గలచోట ఫలమేల దప్పురా
విశ్వదాభిరామ వినర వేమ.
136
ఆ. కులము గలుగువారు గోత్రంబు గలవారు
విద్యచేత విఱ్ఱవీగువారు
పసిఁడిగల్గువాని బానిసకొడుకులు
విశ్వదాభిరామ వినర వేమ.
137
ఆ. కానివాని తోడఁ గలసి వర్తించెనా
హాని వచ్చు నెంతవాని కైన
తాటిక్రింద పాలు ద్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినర వేమ.
138
ఆ. కరఁగకరగఁబుట్టు కనకంబునకు వన్నె
పెనఁగ పెనఁగబుట్టు ప్రేమసతికి
ముదియ ముదియఁ బుట్టు మోహంబు లోభంబు
విశ్వదాభిరామ వినర వేమ.
139
ఆ. ఎఱుక లేనిదొరల నెన్నాళ్ళు కొలిచిన
బ్రతుకులేదు వట్టి భ్రాంతి గాని
గొడ్డుటావు పాలుగోరిన చేపునా
విశ్వదాభిరామ వినర వేమ.
140
ఆ. గొడ్డుటావుఁ బితుకకుండఁ గొంపోయిన
పండ్లు నూడఁదన్నుఁ బాలు రావు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ వినర వేమ.
141
ఆ. కులము లేనివాఁడు కలిమిచే వెలయును
కలిమిలేనివాని కులము దిగును
కులముకన్న మిగులకలిమి ప్రధానంబు
విశ్వదాభిరామ వినర వేమ.
142
ఆ. నెయ్యి లేనికూడు నీయాన కసవది
కూరలేని తిండి కుక్కతిండి
ప్రియములేనికూడు పిండపుఁ గూడురా
విశ్వదాభిరామ వినర వేమ.
143
ఆ. నోటి పుప్పి కెల్ల నొప్పిలేకుంటకు
నాకు పోకసున్న మౌషధముగ
పెట్ట కుండెనేని పెనురోఁత వేయురా
విశ్వదాభిరామ వినర వేమ.
144
ఆ. అన్నమదమువలన నతివలు పురుషులు
ఏపురేఁగి మదనుఁ డేఁచె నందు
రన్న ముడుగువెనుక నతఁ డెందుఁబోయెరా
విశ్వదాభిరామ వినర వేమ.
145
ఆ. ఎఱ్ఱనాఁడుదాని నేపారఁ జూచిన
వేకిపుట్టి చాల వెఱ్ఱిపట్టు
పల్లుదెఱవనట్టె పరఁగు పెన్భూతంబు
విశ్వదాభిరామ వినర వేమ.
146
ఆ. హీనజాతివాని నిలుఁజేర నిచ్చెనా
హాని వచ్చు నెంతవాని కైన
ఈఁగ కడుపుఁ జొచ్చి యిట్టట్టు చేయదా
విశ్వదాభిరామ వినర వేమ.
147
ఆ. తలఁప వశముగాదు తత్వంబు బ్రహ్మంబు
తెలియలేఁడు బ్రహ్మదేవుఁడైన
ఇసుక బావి త్రవ్వ నెవ్వరి వశమయా
విశ్వదాభిరామ వినర వేమ.
148
ఆ. ఎట్టిస్త్రీలఁ గనిన నింతంత యనరాదు
కాలవహ్ని లక్క కరఁగినట్లు
ఇట్టిగాఢమోహ మెంతైనఁ జేయురా
విశ్వదాభిరామ వినర వేమ.
149
ఆ. కాంత కుంకయైనఁ గానికులం బైనఁ
బాయలేక విటుఁడు బ్రమసియుండు
మరగి గ్రుడ్డికుక్క మాంసంబు గన్నట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
150
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )