శతకములు వేమన పద్యములు ద్వితీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. జాతసూతకములు సత్యమై యుండంగ
నంటిన గుణములు హతమ్ముగాక
యతియుఁగాగనేల నవనిలో జీవుఁడు
విశ్వదాభిరామ వినర వేమ.
426
ఆ. మదమువలనఁ గల్గు మాటల బహుపల్కి
మ్రుచ్చుసుద్దులఁ గొని మోసపుచ్చి
కాసురాఁబెనగెడు కష్టుండుగురుఁ డౌనె
విశ్వదాభిరామ వినర వేమ.
427
ఆ. పేరు సోమయాజి పెనుసింహబలుఁడయా
మేఁకపోతుఁబట్టి మెడలువిఱవఁ
గానిక్రతువువంకఁ గలుగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ.
428
ఆ. సందె వార్చఁగ నేమి జపము సేయగ నేమి
వేదశాస్త్రములను వెలయ నేమి
పడఁతిఁ గనినవాఁడు బాపఁడు గాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ.
429
క. కుక్కల దిని కడుబాపలు
నక్కను భుజియించువారు నాకేశులగు\న్‌
చొక్కముగ జీవహత్యల
మిక్కుటముగఁ జేసి తమిని మించిరి వేమా.
430
ఆ. అరయఁదోచునాఁడు గురువని తా నెంచి
తిరుగువాఁడు తన్ను నరయలేఁడు
పనికిమాలినట్టి బానిసె కొడుకురా
విశ్వదాభిరామ వినర వేమ.
431
ఆ. చాడికానిమాట చావడిలో నిక్కు
వెంటఁ బో శునకము వెలయ నిక్కు
స్త్రీలఁజూచినపుడు శిశ్నంబు నిక్కురా
విశ్వదాభిరామ వినర వేమ.
432
ఆ. పుట్టుశక్తు లైదు పుడమి నటింపగ
విప్రులెల్ల వేదవేత్తలండ్రు
శక్తిపుత్రుకులము జగతిలో నెఱుగరో
విశ్వదాభిరామ వినర వేమ.
433
క. భేదాభేదంబులకును
వాదంబై జనముచూడ వర్తించును నా
భేదాభేదము లుడిగిన
వేదాంత ధ్యాని యగుచు వెలుఁగుర వేమా.
434
ఆ. ద్విజవరుండు చెడ్డ పిండంబు దినఁబోయె
పేరటాలు మురువు పెండ్లిమొనసె
కులము మొదలుఁ బోయెఁ గూలెఁబో మానంబు
విశ్వదాభిరామ వినర వేమ.
435
ఆ. చీరగట్టి రాత్రి సిగ్గును నెఱిఁగుండు
పగలు చీరవిడుచు పను లదేల
చేడె గాదుర యిది చేవాడికత్తెర
విశ్వదాభిరామ వినర వేమ.
436
ఆ. శూద్రుఁడనుచు మిగుల శూద్రులఁ బోనాడు
మాలకంటె మగఁడు మాలయనుచు
ద్విజుఁడ నేనటన్న ద్విజుఁడు కానేర్చునా
విశ్వదాభిరామ వినర వేమ.
437
. ---
---
---
---
438
ఆ. బ్రహ్మనృపతి వైశ్యపతులును శూద్రులు
బ్రహ్మవిష్ణుహరులు పశువు లెన్న
బ్రహ్మముం దెలియక బహురూపులైరిట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
439
ఆ. కలుషమొక్క యింత గాన్పింప దెందును
జూడ నెవరికైన సొంపుమీఱఁ
దామసం బడంగఁ దావెల్గు జ్ఞానంబు
విశ్వదాభిరామ వినర వేమ.
440
ఆ. తనువునందు నగ్ని దఱికొని కాల్పంగ
కాల్చుకొనుట యేమి కర్మమునకు
కాల్చుకొన్న యంత ఘనుఁడు తానాయెనా
విశ్వదాభిరామ వినర వేమ.
441
ఆ. త్రాడు మెడనువేసి తనదు శూద్రత్వంబు
పోయె ననెడి దెల్ల బుద్ధి కొదువ
మనసులకును త్రాడు మఱివన్నెఁ దెచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ.
442
ఆ. పట్టుచీరఁ గట్టి పట్టె తిరుమణి నిడి
సృష్టివైష్ణవంబు శిఖలు మించె
చిన్నెలన్ని చేసి చేర వైష్ణవ మిట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
443
ఆ. కసవు నేరి తినెడు పసరపు మైఁ దిన
మాలఁడండ్రు వాని మహిని నరులు
పట్టికోడిఁ దిన్న ప్రాజ్ఞులందురు జనుల్‌
విశ్వదాభిరామ వినర వేమ.
444
ఆ. ఊరిబావిలోని యుదకమ్ము నిందించి
పాదతీర్థమునకు భ్రమయువారు
పాదతీర్థములను ఫలమేమి కందురా
విశ్వదాభిరామ వినర వేమ.
445
ఆ. మొనసి యింద్రియముల మొదట నిల్పఁగలేక
సమసిపోవు వేళ సన్యసించు
ఆత్మశుద్ధిలేక యంటునా మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ.
446
ఆ. చావుఁ దెలియువాఁడు సన్యసించునదెల్ల
కడవలందు కులము చెడినయట్లు
పాపమొకటె మీఁద ఫలమేమి లేదురా
విశ్వదాభిరామ వినర వేమ.
447
తే. వెల్లకుక్కల యెంగిలి విశదమాయె
పడుచువేశ్యల యెంగిలి ప్రాప్తమాయె
చెడుగు నెంగిలి యెంతకు శ్రేష్ఠమాయె
ఇష్టమగువారి యెంగిలి యెగ్గు వేమ.
448
ఆ. ప్రియము సత్యమెప్డు పృథివిఁ బల్కెడువాని
నోరె యమృతవాపి మారులేదు
అనుదినంబుచూడ ననృతమాడెడినోరు
నోరె కాదు క్రింది నోరు వేమ.
449
ఆ. అంగమందు లింగ మతిశయంబునఁ గట్టి
లింగమందు ముక్తి నిలుపలేరు
ముక్తిలేక తుదను మూర్ఖుఁడై పోవురా
విశ్వదాభిరామ వినర వేమ.
450
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )