శతకములు వేమన పద్యములు తృతీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

క. గ్రామము భూముల మానుక
ప్రేమోదయమింత లేక భీకరమతులై
భామల సుతులను వదలుక
బాములఁ బడనేల యడవిపట్టున వేమా.
226
ఆ. మాలవాని నేల మహిమీఁద నిందింప
నొడలరక్తమాంస మొకటిగాదె
వానిలోన మెలఁగువాని కులంబేది
విశ్వదాభిరామ వినర వేమ.
227
ఆ. మాలవాని నంటి మఱినీళ్ళ మునిగేరు
మనుజకర్మచేత మాలఁడయ్యె
నేలతెలియలేరో యీ నరపశువులు
విశ్వదాభిరామ వినర వేమ.
228
ఆ. మాదిగయనవద్దు మఱిగుణ మొనసిన
మాదిగది వసిష్ఠుమగువ చేడె
మాదిగ గుణమున్న మఱి ద్విజుఁడగునయా
విశ్వదాభిరామ వినర వేమ.
229
ఆ. శిలను ప్రతిమఁజేసి చీఁకటింటను బెట్టి
మ్రొక్కవలదు మహిని మూఢులార
ఉల్లమందు బ్రహ్మముండుట దెలియరు
విశ్వదాభిరామ వినర వేమ.
230
ఆ. మాలవాఁడయినను మఱియాత్మమీఁదను
మనసు నిల్పెనేని మాలగాఁడు
మనసు నిల్పకున్న మహిమీఁద మాలఁడు
విశ్వదాభిరామ వినర వేమ.
231
ఆ. తాతఁ గన్నతల్లి తనతండ్రిఁ గనుతల్లి
తన్నుఁగన్న తల్లి తల్లితల్లి
తల్లి శూద్రురాలు తానెట్లు బాపఁడో
విశ్వదాభిరామ వినర వేమ.
232
ఉ. తాతజనించెఁ గన్యకకు తండ్రులు తామును కుండగోళకుల్‌
మాతపరానుకూలి మరి యెక్కువ ద్రౌపతి భర్తలేవురు\న్‌
నీతులు చెప్ప పాండవులనీమము లిట్టి వటంచు నెన్నుచు\న్‌
భూతలమందు మిక్కిలిగఁ బూజలఁ జేసిరి వెఱ్ఱి వేమనా.
233
ఆ. తనదు తల్లి లంజె తనయాలు మాదిగ
శ్రీపతికి గురువసిష్ఠుఁ డరయ
తపముచేత ద్విజుఁడు తర్కింప కులమెట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
234
ఆ. జాతివేఱు లేక జన్మక్రమంబున
నెమ్మదిని నభవుని నిల్పెనేని
అఖిలజనులకెల్ల నాతఁడె ఘనయోగి
విశ్వదాభిరామ వినర వేమ.
235
క. ధర గిరులు జలధు లన్నియు
పరికింపగఁ బ్రళయమునను భస్మావృతులౌ
సురలును మునులును జనఁగా
నెరయోగులు నుండఁగలరె నేర్పున వేమా.
236
ఆ. ఉర్వివారికెల్ల నొక్కకంచముఁబెట్టి
పొత్తుఁ గుడిపికులము పొలయఁ జేసి
తలను చేయిపెట్టి తగ నమ్మఁజెప్పరా
విశ్వదాభిరామ వినర వేమ.
237
ఆ. గట్టురాళ్ళఁ దెచ్చి కాళ్ళచేతులఁ ద్రొక్కి
కాసెయులులచేతఁ గాసిఁజేసి
మొఱుపురాళ్ళ కెఱగుమొప్పెల నేమందు
విశ్వదాభిరామ వినర వేమ.
238
ఆ. తోలుకడుపులోన దొడ్డవాఁ డుండఁగ
రాతిగుళ్ళలోన రాశిఁబోయ
రాళ్లుదేవుఁడైన రాసుల మ్రింగవా
విశ్వదాభిరామ వినర వేమ.
239
ఆ. రాతిబసవని గని రంగుగా మ్రొక్కుచు
గునుకుబసవని గని గ్రుద్దుచుండ్రు
బసవభక్తులెల్ల పాపులె తలపోయ
విశ్వదాభిరామ వినర వేమ.
240
ఆ. మన్నుమెత్తి కడిగి మఱిరూపు గావించి
గుంతనిండఁ బూడ్చి గుఱుతు నిల్పి
మనుజులెల్లఁ గూడి మఱిదేవుఁ డందురు
విశ్వదాభిరామ వినర వేమ.
241
ఆ. మంచిశకునము లని యెంచి పెండ్లియాడు
వార లొకరు లేరు వసుధలోన
జనులకర్మములను శకునము ల్నిల్చునా
విశ్వదాభిరామ వినర వేమ.
242
. ---
---
---
---
243
ఆ. విషసహితులు నరులు విషధరు లెన్నఁగ
విష విషధరములను విరియఁగొట్ట
నఘము వచ్చుకడకు నాయువుకొదువగు
విశ్వదాభిరామ వినర వేమ.
244
ఆ. వేము పాలఁబోసి వెయ్యేండ్లు పెంచిన
చేదువిడిచి తీపు చెందదెపుడు
నోగుగుణము విడిచి యుచితజ్ఞుఁ డగునట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
245
ఆ. వాడవదినెకేల వావివర్తనములు
చాడివాని కేల జాడబుద్ధి
మూఢసతులకేల ముదముతో జ్ఞానంబు
విశ్వదాభిరామ వినర వేమ.
246
ఆ. నేరనన్నవాఁడు నెరజాణ మహిలోన
నేర్తునన్నవాఁడు వార్తకాఁడు
ఊరకున్నవాఁడె యుత్తమోత్తముఁ డెందు
విశ్వదాభిరామ వినర వేమ.
247
క. దూలాలు టెంకినుండిన
వాలాయము చేటు వచ్చు వసుమతిలోన\న్‌
లోలాక్ష విడిచిపెట్టిన
మేలిమిగా బ్రతుకవచ్చు మేదిని వేమా.
248
ఆ. మానినీమనోజమంది రానందైక
లోలురెల్ల రూర్ధ్వలోకసుఖము
మాలవాడకుక్క మధురాన్న మెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ.
249
ఆ. తొత్తు తొత్తెగాని దొరసాని గాఁబోదు
అడఁచుటింతె దానికైన గుణము
మిత్తికూళ్ళ దొంగ మేలెఱుఁగ నేర్చునా
విశ్వదాభిరామ వినర వేమ.
250
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )