శతకములు వేమన పద్యములు ప్రథమాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

క. అనలంబున జనియించియు
ననలంబున సలిలమగును నాకాశమున\న్‌
గనిపించి పుట్టుఁదానే
జనకుఁడు లేనట్టిదాయె చరితము వేమా.
376
సీ. తమ తలంపులలోనఁ దత్వ శిఖామణిఁ, దలఁచిన వారెల్లఁ దత్వ విదులు
ఘనమైన నిబిఢాంధ కారంబునను జ్యోతి ననువునఁ జూచిన యతఁడె యోగి
శివునిలో జీవుని జీవునిలో శివు నొనరఁ దెలిసినవాఁడు యోగదృక్కు
సౌఖ్య యోగంబున సర్వంబు శివుఁడని నిశ్చయించినవాఁడు నిర్మలుండు
 
గీ. ఇట్టిజాడఁగాన నెందఱయిన నేమి
పుట్టఁ గాలశివుని పట్టఁగలరె
పొట్టనీవు పాసిపోగఁ దా నుబ్బురా
విశ్వదాభిరామ వినర వేమ.
377
ఆ. కర్మగుణము లన్ని కడఁబెట్టి నడువక
తత్వమేల దన్ను దగులుకొనును
నూనెలేక దివ్వె నువ్వులమండునా
విశ్వదాభిరామ వినర వేమ.
378
క. విత్తును నుముకయుఁ ధరలోఁ
బొత్తున జనియించి పొట్టుపోయినభంగి\న్‌
వేత్తయగువానికర్మం
బత్తెఱగున విడిచిపోవు ననువున వేమా.
379
క. కర్మము జ్ఞానికి దవ్వగు
గర్మమునకు జ్ఞాని దవ్వుకలియుగ మందున్‌
గర్మజ్ఞానము లుడిగిన
నిర్మలునకుఁ గలుగు ముక్తి నిజముగ వేమా.
380
ఆ. కర్మమయుఁడుగాక ధర్మంబు దెలియఁడు
కర్మజీవి మేలు గానలేఁడు
నీరుచొరక లోతు నికరము దెలియదు
విశ్వదాభిరామ వినర వేమ.
381
ఆ. కర్మఫలములన్ని కపటంబుగాఁ జూచి
ధర్మఫలములన్ని దగిలియుండు
ధర్మమర్మములను దాటుట ముక్తిరా
విశ్వదాభిరామ వినర వేమ.
382
ఆ. చెట్టునందుఁబుట్టి చెలరేఁగి కాయలు
దనరుఁగాంతితోడఁ దగిలిపండ్లు
పండ్లు దినుచుఁ గాయవర్ణంబు దెలియుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ.
383
ఆ. హంస మానసోద మంటక తిరిగిన
యట్టు కర్మచయము నంటకుండ
యోగి తిరుగు సకలభోగంబుతోడను
విశ్వదాభిరామ వినర వేమ.
384
క. తనువు శోధఁజేసి దైవమ్ము మొనఁజేసి
ముందు కర్మములను మూలఁద్రోసి
మనము నిజముఁజేసి మమతలన్నియు రోసి
మొనసి నిల్చువాఁడు మోక్షి వేమా.
385
ఆ. అన్నమునకు నంటునైన నాత్మకునంటు
ఆత్మను పెనగొన్న నన్నమంటు
ఆత్మశుద్ధియన్న మన్న శుద్ధియునాత్మ
మిన్నుమన్నుమాడ్కి మెఱయు వేమా.
386
క. హరివిధిసురిమును లాదిని
మెరసియు జన్మించి పిదప మేలులకెడగా
జరయందు మరణమందును
వరుస న్వర్తిలిరి మాయవాసన వేమా.
387
ఆ. మూల మెవ్వ రనుచు ముగ్గురిలోపల
మూల మెఱుఁగలేరు మూఢజనులు
మూలమందఱకును ముఖ్యమౌఁ గర్మము
విశ్వదాభిరామ వినర వేమ.
388
ఆ. ముగ్గురిలోన హెచ్చు ముందుగా కనలేక
నరకమునకుఁ బోవు నరులు గలరు
ముగ్గురికిందనట్టి మూలమూర్తి యొకండు
విశ్వదాభిరామ వినర వేమ.
389
ఆ. ముగ్గురి నెఱుఁగునట్టి మూలంబు నెఱిఁగియు
ముగ్గురిమీఁద నొకటి మునుపు తెలిసి
పరగఁజిహ్వచేతఁ బ్రస్తుతి చేయరా
విశ్వదాభిరామ వినర వేమ.
390
క. విధికృతములందు రన్నియు
విధికిని విధి లెస్సయయ్యె విష్ణు జపింప\న్‌
విధియుభవురూప మందెను
విధి బ్రహ్మము సుమ్ముదలప వినరా వేమా.
391
ఆ. కుండఁగుంభ మండ్రు కొండఁ బర్వతమండ్రు
ఉప్పు లవణ మండ్రు నొకటి గాదె
భాషలింతెవేఱు పరతత్వ మొక్కటి
విశ్వదాభిరామ వినర వేమ.
392
ఆ. ఆకు కానవచ్చు హరిహరాదులకును
కొమ్మ గానరాదు కోరిచూడ
కొమ్మగానరాగఁ గొనియాడ కుండురా
విశ్వదాభిరామ వినర వేమ.
393
ఆ. వాఁడు వాఁడు వాఁడు వానిలోపల నుండు
వాఁడు వాఁడు వాఁడు వాఁడుగాఁడు
వాని వానిగూర్చువాఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ.
394
ఆ. అయిదు నక్షరముల యంగంబు దెలిసిన
నైదునందు ముక్తి యమరియుండు
నైదులోననున్న యతఁడెపో బ్రహంబు
విశ్వదాభిరామ వినర వేమ.
395
ఆ. బ్రహ్మఁ జంపి విష్ణుభాగంబులోఁ గల్పి
విష్ణుఁ జంపి శివునివెలయఁ గల్పి
శివునిఁ జంపి తాను శివయోగి కావలె
విశ్వదాభిరామ వినర వేమ.
396
ఆ. ఇంత వగవ వెలసె నేకాంత బుద్ధితా
హరిహరాదులందు నాశ లుడిగి
శాంతబుద్ధి నుండ సమకూరును సుఖంబు
విశ్వదాభిరామ వినర వేమ.
397
ఆ. బ్రహ్మఘటము మేను ప్రాణంబు దగ గాలి
మిత్రచంద్రవహ్ని నేత్రచయము
మఱియుఁ బ్రహ్మ మనఁగ మహిమీదలేదయా
విశ్వదాభిరామ వినర వేమ.
398
ఆ. పంచశత్రుఁ దెగడి పంచబాణుని గెల్చి
పంచవర్ణములను పఠనఁ జేసి
పంచముఖములు గల భవసంజ్ఞ గలవాని
పంచఁ జేరువాఁడు పరుఁడు వేమా.
399
ఆ. అచరచరసమూహ మంగము లింగము
సరణి దెలియనట్టి శైవమేల
అష్టతనువు లమర హరుఁడౌట నెఱుఁగరో
విశ్వదాభిరామ వినర వేమ.
400
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )