| ఆ. |
తత్వ మెఱుఁగువాడు దైవంబు నెఱుఁగును
సర్వసారములను జావఁ జేయు
కదళిమ్రింగునట్లు గరళంబు మ్రింగునా
విశ్వదాభిరామ వినర వేమ. |
76 |
|
| ఆ. |
నీళ్లమీద బుగ్గ నిలచిన యప్పుడు
తళ్లువేగవచ్చి తాకుఁ గాక
విడెడుకుండకింత విభ్రాంతి పడుదురు
విశ్వదాభిరామ వినర వేమ. |
77 |
|
| ఆ. |
హేమకారవిద్య నెఱిఁగిన వారెల్ల
వెతలఁ బడనియట్లు విద్యచేతఁ
దత్వమెఱుఁగు వెనుక తనకుఁ జింతేలరా
విశ్వదాభిరామ వినర వేమ. |
78 |
|
| ఆ. |
జీవభావ మెఱుగఁ జెడ దెన్నటికి మది
దైవమును నెఱుంగఁ దనరుబుద్ధి
తేజ ముదయమందఁ దిమిరంబు నిలువదు
విశ్వదాభిరామ వినర వేమ. |
79 |
|
| ఆ. |
ఆశచేత మనుజు లాయువుగలనాళ్లు
దిరుగుచుంద్రు భ్రమను ద్రిప్పలేక
మురికిభాండమందు ముసరు నీఁగలభంగి
విశ్వదాభిరామ వినర వేమ. |
80 |
|
| ఆ. |
పరుస మినుముసోకి బంగారమైనట్లు
కప్పురంబు జ్యోతిఁ గలసినట్లు
పుష్పమందు దావి పొసఁగినట్లగు ముక్తి
విశ్వదాభిరామ వినర వేమ. |
81 |
|
| ఆ. |
కుండ పగిలెనేని క్రొత్తది కొనవచ్చు
భూతలంబునందు బొందుగాను
కూలబడిన నరుఁడు కుదురుట యరుదయా
విశ్వదాభిరామ వినర వేమ. |
82 |
|
| ఆ. |
సతము బాహ్యపూజ చాలఁ జేసినపిదప
కపటము విడలేక కష్టనరులు
ముక్తి నొందలేక మునిగిరి తమమున
విశ్వదాభిరామ వినర వేమ. |
83 |
|
| ఆ. |
ఊర్ధ్వలోకమందు నుచితక్రమంబున
రూప మేమి లేక రూఢితోను
పరమయోగి చూచు పరమాత్ముఁ డితఁడని
విశ్వదాభిరామ వినర వేమ. |
84 |
|
| ఆ. |
సత్య మమరియుండ జ్ఞాన మమరియుండు
జ్ఞాన మమరియుండ సత్యముండు
జ్ఞానసత్యములును సమమయిన ద్విజుఁడగు
విశ్వదాభిరామ వినర వేమ. |
85 |
|
| ఆ. |
దాన మొసఁగుకన్నఁ దేజంబు మఱిహెచ్చు
తేజ మొసఁగుకన్నఁ దెలివి హెచ్చు
తెలివికన్న నాసఁ దెగ వేయునది హెచ్చు
విశ్వదాభిరామ వినర వేమ. |
86 |
|
| ఆ. |
దొంగమాటలాడ దొరుకునె మోక్షంబు
చేతగానికూత చెల్ల దెపుడు
గురువుపద్దు గాదు గుణహీన మగుఁగాక
విశ్వదాభిరామ వినర వేమ. |
87 |
|
| ఆ. |
గాలిలేని దీపకళిక చందంబున
నలలుసుళ్లులేని జలధిరీతి
నిశ్చలాత్మయున్న నిర్వికారంబున
ముక్తియండ్రు దాని మొగిని వేమ. |
88 |
|
| ఆ. |
మంటలోహమునలు మ్రాను చీలలయందు
పటముగోడలందుఁ బరగ నిసుక
బెట్టనంటునట్ల పెనఁగు దేహముజీవి
విశ్వదాభిరామ వినర వేమ. |
89 |
|
| ఆ. |
కలుషమెల్లఁ దెలియఁ దలవంపులకు మూల
మరయఁదత్వ మెల్ల నాత్మఁబుట్టు
తెలిసినందుకు మఱిధీరుఁడు గావలె
విశ్వదాభిరామ వినర వేమ. |
90 |
|
| ఆ. |
అనఁగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినఁగ దినఁగ వేము దీయనుండు
సాధనమున బనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినర వేమ. |
91 |
|
| ఆ. |
స్థూలము కనుగ్రుడ్డు సూక్ష్మంబు కన్పాప
కంటిపాప నుండు కారణంబు
కారణమున బ్రహ్మకళ నెఱుంగఁగవలె
విశ్వదాభిరామ వినర వేమ. |
92 |
|
| ఆ. |
తేనెతెరలజాడ తేనెటీఁగ యెఱుంగు
సుమరసంబుజాడ భ్రమర మెఱుఁగు
పరమయోగి జాడభక్తుం డెఱుంగును
విశ్వదాభిరామ వినర వేమ. |
93 |
|
| ఆ. |
అడవి దిరుగ లేదు ఆకసమున లేదు
అవనిఁ దీర్థయాత్రలందు లేదు
ఒడలు సిద్ధిఁజేసి యొడయని జూడరా
విశ్వదాభిరామ వినర వేమ. |
94 |
|
| ఆ. |
కప్పురంబు మనసు గాంక్షించుయోగికి
జ్ఞానదీపశిఖయుఁ దానటించుఁ
గానవచ్చు నాత్మ క్రమమాణమై నిచ్చ
విశ్వదాభిరామ వినర వేమ. |
95 |
|
| క. |
నీ వాడిన నే నాడుదు
నీవుండిన నేను నుందు నిర్విణ్ణుఁడనై
నీవు తలంచినఁదలఁపుదు
నీవు నగిన నేను నగుదు నిజముగ వేమా. |
96 |
|
| ఆ. |
నీరు కార మాయె కారంబు నీరాయె
కారమైన నీరుకార మాయె
కారమందు నీరు కడురమ్యమైయుండు
విశ్వదాభిరామ వినర వేమ. |
97 |
|
| ఆ. |
శివుని యనుభవంబు సృష్టిలోపల లేక
సంశయంబు చెడదు సాధకులకు
చెలగుఁదివ్వె లేక చీఁకటిపాయునా?
విశ్వదాభిరామ వినర వేమ. |
98 |
|
| ఆ. |
ఇంద్రియములచేత నెగ్గొందుచుండెడు
వెఱ్ఱిమనుజుఁ డేల వెదకు శివుని?
ఇంద్రియముల రోసి యీశునిఁ జూడరా
విశ్వదాభిరామ వినర వేమ. |
99 |
|
| ఆ. |
కడుపునిండ సుధను గ్రమముతోఁ ద్రావిన
బాలమీఁద నేల పాఱు మనసు?
తత్వ మెఱుఁగువెనుక తన్వంగు లేటికో?
విశ్వదాభిరామ వినర వేమ. |
100 |
|