శతకములు వేమన పద్యములు ప్రథమాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. మాటలాడవచ్చు మనసు నిల్పగరాదు
తెలుపవచ్చు దన్నుఁ దెలియరాదు
సురియఁబట్టబచ్చు శూరుండు కారాదు
విశ్వదాభిరామ వినర వేమ.
176
ఆ. చూపు వెలయఁజేసి సూక్ష్మంబు వత్తిచే
చిత్తమనెడు దివ్వె నెన్నుపఱచి
పాపమనెడు తిమిర మేపాఱ పాపని
పాపజాతి గురుఁడు పశువు వేమా.
177
ఆ. గురువు చిల్లగింజ కుంభ మీదేహంబు
ఆత్మ కలుషవంక మడుగుఁబట్టఁ
దెలిసి నిలిచెనేని దివ్యామృతంబురా
విశ్వదాభిరామ వినర వేమ.
178
క. గురుఁడనఁగా మొదలంతకు
గురుశిష్యు లనంగ నెల్లకొమ్మలుకాగా
గురువును గానగఁ జాలరు
ధరలోపల మనుజులెల్లఁ దలఁపరు వేమా.
179
క. గురుఁ డనఁగా పరమాత్ముఁడు
పరగంగా శిష్యుఁడనఁగఁ బటుజీవుఁడగు\న్‌
గురుశిష్య జీవసంపద
గురుతరముగఁ గూర్చు నతఁడు గురువగు వేమా.
180
ఆ. లోకములకు గురువు లోకులకును గురు
వదియుఁ దెలిసి మోక్ష మందుగోరి
గురునిఁ గనక నరక కూపము నందురు
విశ్వదాభిరామ వినర వేమ.
181
ఆ. జీవిలోననుండు సిద్ధునిగానక
తిరుగు నస్థిరంబు వరుసనమ్మి
స్థిరము నస్థిరమును దెలియ జీవికిముక్తి
విశ్వదాభిరామ వినర వేమ.
182
ఆ. గతము చూతమన్న కలఁగన్న యర్థంబు
నడుచు కార్యమేని నమ్మరాదు
క్షణములోని బ్రతుకు సంసార విభ్రాంతి
విశ్వదాభిరామ వినర వేమ.
183
ఆ. తాననంగ నెవరు తనవారన నెవరు
తెలిసి తెలియలేరు తిక్క నరులు
అరయ పిసినికాయ పురుగు పద్ధతికాగ
విశ్వదాభిరామ వినర వేమ.
184
క. భయముసుమీ యజ్ఞానము
భయముడిగిన నిశ్చయంబు పరమార్థంబౌ
లయముసుమీ యీ దేహము
జయముసుమీ జీవుఁడనుచుఁ జాటర వేమా.
185
ఆ. చచ్చెఁ జచ్చె ననుచుఁ జావుకు వగచెడు
దీననరుల వెఱ్ఱి దెలుపరాదు
ప్రాణమునకు మృత్యు బంధంబు లుడుగునా
విశ్వదాభిరామ వినర వేమ.
186
ఆ. జననమరణములకు సరి స్వతంత్రుఁడు గాఁడు
మొదట కర్తగాఁడు తుదను గాఁడు
నడుమకర్త ననుటనగుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినర వేమ.
187
ఆ. బ్రహ్మమేడ ననుచు పలుమాఱు లాడేరు
వెఱ్ఱిమూర్ఖ జనుల విధముఁజూడ
బ్రహ్మ మన్నిటందుఁ బరిపూర్ణమైయుండు
విశ్వదాభిరామ వినర వేమ.
188
ఆ. పసులవన్నె వేఱు పాలెల్లనొక్కటి
పుష్పజాతి వేఱు పూజయొకటి
దర్శనంబు వేఱు దైవంబ యొక్కటి
విశ్వదాభిరామ వినర వేమ.
189
ఆ. పనితొడవులు వేఱు బంగార మొక్కటి
పరగ ఘటము వేఱు ప్రాణమొకటి
అరయఁ దిండ్లు వేఱు ఆఁకలి యొక్కటి
విశ్వదాభిరామ వినర వేమ.
190
ఆ. కానలేఁడు నుదురు కర్ణముల్‌ వీఁపును
నెఱులు కానలేఁడు నెత్తిమీఁద
తన్ను గానలేఁడు తత్వ మేమెఱుఁగును
విశ్వదాభిరామ వినర వేమ.
191
ఆ. తిరిగి తిరిగి నరుఁడు మరులుకొనుటేగాక
అందువలన నేమి యాసలేదు
అంతరాత్మ నిలుపునతఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ.
192
ఆ. చిత్తమనెడు వేరు శిథిలమైనప్పుడే
శక్తియనెడు చెట్టు పడును పిదపఁ
గోర్కు లనెడు పెద్ద కొమ్మలెండును గదా
విశ్వదాభిరామ వినర వేమ.
193
ఆ. తిట్టికొట్టిరేని తిరిగి మాఱాడక
యూరకున్నఁ జూడనుర్విమీద
వాఁడగు పరమాత్మ వర్ణింప శక్యమా
విశ్వదాభిరామ వినర వేమ.
194
ఆ. కల్మషంబు సోఁకఁ గనుపించ దెందును
రూప మెవ్వరికిని రూఢితోడ
తామసం బుడిగినఁ దగఁగల్గు జ్ఞానంబు
విశ్వదాభిరామ వినర వేమ.
195
ఆ. నీటిలోన వ్రాఁత నిలువకయున్నట్లు
పాటిజగతిలేదు పరములేదు
మాటమాటకెల్ల మనసు కోరుచునుండు
విశ్వదాభిరామ వినర వేమ.
196
ఆ. దొంగతెలివిచేత దొరకునా మోక్షంబు
చేతఁగానిపనులఁ జేయరాదు
గ్రుడ్డనంగ వలదు గుణహీనుఁడనవలె
విశ్వదాభిరామ వినర వేమ.
197
ఆ. అసలఁ దెగఁగోసి యనలంబుఁ జల్లార్చి
గోచి బిగియఁబెట్టి కోపమడఁచి
గుట్టు మీఱవాఁడు గురువుకు గురువురా
విశ్వదాభిరామ వినర వేమ.
198
ఆ. ఆశలనెడు తాళ్ళ నమరఁ గోయగఁ జేసి
పారవైవఁగాని పరములేదు
కొక్కు తిండియాసఁ జిక్కి చచ్చినయట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
199
సీ. చెవులు గోరును మంచి జిలిబిలిపాటలఁ - దియ్యని మాటల తెఱఁగు వినఁగ
జన్మంబు గోఱును సరవితోడుత శీత - పృథుల సంస్పర్శ సంపదల నెపుడు
కన్నులు గోరును గమలయవర్ణంబు - లయినట్టి రూపంబు లనువుతోడ
నాలుక గోరును నయముతోడ తీపు - నొగరు కారమ్ము చేదుప్పు పులుసు
 
తే. ముక్కు గోరును సద్గంధములను జెలఁగి
చెవులు చర్మంబు కన్నులు జిహ్వ ముక్కు
నిన్నియుం చాడినటువంటి యిల్లురోసి
తన్ను గనుగొని సుఖియింపఁ దగును వేమ.
200
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )