శతకములు వేమన పద్యములు ద్వితీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. సూక్ష్మరూప మెఱిగి సుఖమొందగా లేక
బహుళముగను జదువఁబడుచు నరుఁడు
చావుచేటెఱుఁగని చదువేల చదువునో
విశ్వదాభిరామ వినర వేమ.
1
ఆ. ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాఁడు చెఱచువానివంశమెల్ల
చెఱకువెన్ను పుట్టి చెఱపదా తీపెల్ల
విశ్వదాభిరామ వినర వేమ.
2
ఆ. తనువ దెవరిసొమ్ము తనదని పోషింప
ధనమదెవరిసొమ్ము దాచుకొనఁగ
ప్రాణ మెవరిసొమ్ము పాయకుండఁగ నిల్ప
విశ్వదాభిరామ వినర వేమ.
3
ఆ. జీవిఁజంపుటెల్ల శివభక్తి తప్పుట
జీవు నరసిచూడ శివుఁడు గాదె
జీవుఁడు శివుఁడగును సిద్ధంబు దెలియరో
విశ్వదాభిరామ వినర వేమ.
4
ఆ. పరగ చెట్టుఁబెట్టి పాలింప కుండెనా
వెలుగుదాటి వీధి వెళ్ళిరాఱు
ఆడువారి చిత్త మటువలె నుండురా
విశ్వదాభిరామ వినర వేమ.
5
ఆ. కొంకణంబు పోఁవగుక్క సింహము గాదు
కాశిబోవఁబంది గజము గాదు
వేఱె జాతివాఁడు విప్రుఁడు గాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ.
6
ఆ. ఇచ్చువానియొద్ద నీయనివాడుండఁ
జచ్చుగాని యీవి సాగనీఁడు
కల్పతరువుక్రింద గ్రచ్చ చెట్టునట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
7
ఆ. అల్పబుద్ధివాని కధికార మిచ్చిన
దొడ్డవారినెల్లఁ దొలఁగఁగొట్టు
చెప్పుతినెడికుక్క చెఱకుతీ పెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ.
8
ఆ. ఆపదందుఁ జూడు మారయ బంధుల
భయమువేళఁజూడు బంటుగుణము
పేదపడ్డ వెనుక పెండ్లము మతిఁజూడు
విశ్వదాభిరామ వినర వేమ.
9
ఆ. మగఁడు మదనుఁడైన మంచికాఁపురమైన
సహజ మేల మాను జారకాంత
పాలుద్రావు కుక్క బడిబడి పోవదా
విశ్వదాభిరామ వినర వేమ.
10
ఆ. పురుషుఁ డెఱుఁగఁ జంపు భూపతి వినఁజేటు
నఖిలనిందలకును నాలయంబు
పరపురుష గమనము ప్రత్యక్ష నరకము
విశ్వదాభిరామ వినర వేమ.
11
ఆ. ఆలి వంచలేక యధమత్వముననుండి
వెనుక వంతుననుట వెఱ్ఱితనము
చెట్టుముదర నిచ్చి చిదిమినఁ బోవునా
విశ్వదాభిరామ వినర వేమ.
12
ఆ. ఎలుకతోక దెచ్చి యెందాక నుతికిన
నలుపుగాక యేల తెలుపు గలుగు
కొయ్యబొమ్మ తెచ్చి కొట్టిన గుణియౌనె
విశ్వదాభిరామ వినర వేమ.
13
ఆ. కుక్కతోకఁ దెచ్చి గొట్టంబుఁ జేర్చిన
గ్రోవిచెంతనుండుఁ గొంతతడవు
ఎంతఁజెప్పఁ జెడుగు పంతంబు మానునా
విశ్వదాభిరామ వినర వేమ.
14
ఆ. ఆలు మగనిమాట కడ్డంబు వచ్చెనా
యాలుఁగా దది మరగాలు కాని
యట్టియాలు విడచి యడవి నుండుట మేలు
విశ్వదాభిరామ వినర వేమ.
15
ఆ. మాటవిననియాలు మగనికి మృత్యువు
యోటిపడవ సర్ప మొంటిగృహము
తనకుఁగానియాలు దానవురాలయా
విశ్వదాభిరామ వినర వేమ.
16
ఆ. ఓజమాలుపొలతి యోలిమాడలు చేటు
పోటికెడలుబంటు కూటి చేటు
పనికిమాలినతొత్తు బత్తెంబు చేటురా
విశ్వదాభిరామ వినర వేమ.
17
ఆ. తప్పు లెన్నువారు తండోపతండము
లుర్వి జనులకెల్ల నుండుఁ దప్పు
తప్పు లెన్నువారు తమతప్పు నెఱుఁగరు
విశ్వదాభిరామ వినర వేమ.
18
ఆ. మ్రుచ్చు తీర్థమేగి ముల్లె విడుచును గాని
మ్రొక్కఁబ్రొద్దు లేదు మొనసి యెపుడు
కుక్క యిల్లుచొచ్చి కుండలు వెతుకదా
విశ్వదాభిరామ వినర వేమ.
19
ఆ. కల్లలాడువాని గ్రామకర్త యెఱుంగు
సత్యమాడువాని స్వామి యెఱుంగు
బెక్కుతిండిపోతుఁ బెండ్లా మెఱుంగురా
విశ్వదాభిరామ వినర వేమ.
20
ఆ. పాగ పచ్చడంబు పైకిఁ గూసంబును
పోగు లుంగరములు బొజ్జకడుపు
గలిగినట్టివానిఁ గందురు చుట్టముల్‌
విశ్వదాభిరామ వినర వేమ.
21
ఆ. ఈఁతకంటె లోతు నెంచంగఁ బనిలేదు
చావుకంటెఁ గీడు జగతిలేదు
గోచిపాతకంటె కొంచెంబు మఱిలేదు
విశ్వదాభిరామ వినర వేమ.
22
ఆ. జాణలనయట్టి చపలాయతాక్షుల
వలపు లరసిచూచి బ్రమయకేల
బయలిరూపులరసి పరికింపగా నేల
విశ్వదాభిరామ వినర వేమ.
23
ఆ. ఇంతిఁ జూచెనేని యింతంత యనరాదు
కానవహ్నిలక్క కరఁగినట్లు
వట్టిమోహ మిట్లు రట్టులఁ జేసెరా
విశ్వదాభిరామ వినర వేమ.
24
ఆ. కలిమి కలిగెనేని కాముగాఁజూతురు
లేమిచేతఁ జిక్క లేమ లధిపు
మదనువంటివాని మాలఁగాఁ జూతురు
విశ్వదాభిరామ వినర వేమ.
25
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )