శతకములు వేమన పద్యములు ప్రథమాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. నీళ్ళ లోన మొసలి నిగిడి యేనుఁగుఁ బట్టు
బైట కుక్క చేత భంగ పడును
స్థాన బలిమి గాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినర వేమ.
26
ఆ. కులము లో నొకండు గుణవంతు డుండెనా
కులము వెలయు వాని గుణముచేత
వెలయ వనము లోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
27
ఆ. పంది పిల్ల లీనుఁ బదియు నైదింటిని
కుంజరంబు యీను కొదమ నొకటి
యుత్తమ పురుషుండు నొక్కఁడు జాలడా
విశ్వదాభిరామ వినర వేమ.
28
ఆ. ఎఱుఁగు వాని దెలుప నెవ్వఁడయిననుఁ జాలు
నొరుల వశము గాదు వోగుఁ దెల్ప
యేటి వంక దీర్ప నెవ్వరి తరమయా?
విశ్వదాభిరామ వినర వేమ.
29
ఆ. అల్పుఁ డెపుడు బల్కు నాడంబరము గాను
సజ్జనుండు బలుకుఁ జల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినర వేమ.
30
ఆ. ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావ మిచ్చి మెచ్చు పరమ లుబ్ధు
పంది బురద మెచ్చుఁ బన్నీరు మెచ్చునా?
విశ్వదాభిరామ వినర వేమ.
31
ఆ. గంగ పారు చుండు కదలని గతి తోడ
ముఱికి కాల్వ పారు మ్రోఁత తోడ
దాత యోర్చునట్లధము డోర్వఁగా లేఁడు
విశ్వదాభిరామ వినర వేమ.
32
ఆ. కాని వాని చేత కాసు వీసము లిచ్చి
వెంటఁ దిరుగు టెల్ల వెఱ్ఱి తనము
పిల్లిఁ బట్ట కోడి పిలిచినఁ బలుకునా?
విశ్వదాభిరామ వినర వేమ.
33
ఆ. పిసిని వాని యింట పీనుఁగు వెడలిన
కట్ట కోలలకును కాసు లిచ్చి
వెచ్చ మాయె నంచు వెక్కి వెక్కేడ్చురా
విశ్వదాభిరామ వినర వేమ.
34
ఆ. కష్ట లోభి వాని కలిమికి నాశించి
బడుగు వాఁడు దిరిగి పరిణమించు
తగరు వెంట నక్క దగిలిన చందంబు
విశ్వదాభిరామ వినర వేమ.
35
ఆ. లోభి వానిఁ జంప లోకంబు లోపల
మందు వలదు; వేఱె మతము గలదు
పైక మడుగఁ జాల భగ్గున పడి చచ్చు
విశ్వదాభిరామ వినర వేమ.
36
ఆ. మాట లెల్ల కల్ల, మన సెల్ల దొంగకె
నేటి ప్రాణ మింక నేటి బ్రతుకు?
మాట సత్యమైన మఱి శతాయుష్యంబు
విశ్వదాభిరామ వినర వేమ.
37
ఆ. కలిమి నాఁడు నరుఁడు కానఁడు మదమున
లేమి నాఁడు మొదలె లేదు పెట్టఁ
గలిమి లేమి లేని కాలంబు గలుగునా?
విశ్వదాభిరామ వినర వేమ.
38
ఆ. కనియుఁ గాన లేఁడు కదలింపఁ డానోరు
వినియు వినగ లేఁడు విస్మయమున
సంపద గల వాఁడు సన్నిపాతక మది
విశ్వదాభిరామ వినర వేమ.
39
ఆ. తీర్ప నార్ప లేని తీర్పరితన మేల?
కూర్ప విప్ప లేని నేర్ప దేల?
పెట్టి పొయ్య లేని వట్టి బీరము లేల?
విశ్వదాభిరామ వినర వేమ.
40
ఆ. తాను గుడువలేఁడు, తగ వేది యాప్తుల
జేర నివ్వఁడ ట్టి చెనటి గోవు
చేని లోన బొమ్మఁ జేసి కట్టిన యట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
41
ఆ. పూర్వ జన్మమందుఁ బుణ్యంబు సేయని
పాపి ధనము కాశ పడుట యెల్ల
విత్త మఱచి కోయ వెదకిన చందంబు
విశ్వదాభిరామ వినర వేమ.
42
ఆ. చమురు గలుగు దివ్వె సరవితో మండును
చమురు లేని దివ్వె సమసి పోవు
తనువు తీఱె నేని తలపు తోడనె తీరు
విశ్వదాభిరామ వినర వేమ.
43
ఆ. భూపతి కృప నమ్మి భూమి జెఱుచు వాఁడు
ప్రజల యుసురు దాకి పడును పిదప
యెగర వేయ బంతి యెందాక నిల్చురా
విశ్వదాభిరామ వినర వేమ.
44
ఆ. పాప మనఁగ వేఱె పరదేశమున లేదు
తనదు కర్మములను దగిలియుండు
కర్మ తంత్రిగాక, గనుకని యుంటొప్పు
విశ్వదాభిరామ వినర వేమ.
45
ఆ. నక్క వినయములను నయగారములఁ బల్కి
కుడువకెల్ల ధనము కూడఁ బెట్టు
కుక్క బోను వాతఁ గూడు చల్లిన రీతి
విశ్వదాభిరామ వినర వేమ.
46
ఆ. వెళ్లి వచ్చు నాఁడు మళ్లి పోయెడు నాఁడు
వెంట రాదు; ధనము కొంచఁ బోఁడు;
తానదేడఁ బోనొ ధన మేడఁ బోవునో?
విశ్వదాభిరామ వినర వేమ.
47
ఆ. పుట్టు బిత్తలి వలె పోవు బిత్తలి వలె;
తిరుగు బిత్తలి వలె, దేహి ధరణి
యున్న నాటి కైన నుపకారి గాలేఁడు
విశ్వదాభిరామ వినర వేమ.
48
ఆ. కాశి బోదు ననుచు గడకట్టగా నేల?
కాశి తీర్థమునకు గదలనేల?
దోషకారి కెట్లు దొరుకురా యాకాశి
విశ్వదాభిరామ వినర వేమ.
49
ఆ. ఇనుము విఱిగె నేని యినుమాఱు ముమ్మాఱు
కాచియతుక నేర్చు కమ్మరీడు
మనసు విఱిగెనేని మఱియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినర వేమ.
50
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )