శతకములు వేమన పద్యములు ద్వితీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. అల్లుఁడైన నేమి యన్యుఁడైన నేమి
చెప్పఁదగిన రీతిఁ జెప్పినాము
హరునియెఱుక లేక యాకులల్లాడునా
విశ్వదాభిరామ వినర వేమ.
376
ఆ. నూఱుపలుకవచ్చు నొకటి వ్రాయఁగరాదు
వ్రాఁతకన్న సాక్షి వలవ దెన్న
పరగవ్రాతలేని పక్షానికప్పుడు
సుద్దిసాక్షి తగనిబుద్ధి వేమా.
377
ఆ. ధారదత్తమైన తామ్రపుఁబలకను
లావుటుంగరమున లంకెజేసి
యరయ మీఁదముద్ర యమరియుండంగను
నదియ శాసనంబు నవని వేమ.
378
క. నీతి వైరాగ్యభక్తిని నీచులకును
ఘాతకులు కాని జ్ఞానసంకలితులకును
వ్రాల కందని పద్యముల్‌ వేల సంఖ్య
చేత నందుగ భువినిదాఁ జెప్పె వేమ.
379
ఆ. గుఱుతు తిథులవలనఁ గులమెల్లఁ జెడిపోయె
స్త్రీల నడతవలన సిగ్గుపోయె
ఏహ్యపల్వలముల నిలయెల్లఁ జెడిపోయె
చాన్లవలన బ్రతుకు సమయు వేమా.
380
ఆ. చిత్తవాజి నెక్కి శిక్షింప నేరక
తత్తఱించి రౌతు తరల నేల
వారణాసి తనకు వయ్యాళి కాబోలు
విశ్వదాభిరామ వినర వేమ.
381
ఆ. రాజయోగి మహిమ రాజయోగికి గాక
ఇతర జనులకెల్ల నేమిదెలియు
తాను దేవుఁడైన దైవముఁ గొలుచునా
విశ్వదాభిరామ వినర వేమ.
382
ఆ. దేవభూములందు దేవాలయములందు
దేవుఁడంచుఁ జెప్పి తెరువుఁజూపె
తెలియ విశ్వమెల్ల దేవాది దేవుఁడౌ
విశ్వదాభిరామ వినర వేమ.
383
ఆ. గంపెడంత తవుడు గంపలోఁ బెట్టక
చన్నుఁ బట్టనీదు కొన్నబఱ్ఱె
వారకాంత లేల వలతురు నూరక
విశ్వదాభిరామ వినర వేమ.
384
ఆ. తివిరి లేమియుంట తిరిపెకాఁ డెఱుగునె
మొఱ్ఱబెట్టి నెత్తి మొత్తుఁగాని
పతిస ధర్మ మెన్నపడుచు కత్తెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ.
385
ఆ. దాత లేని కొంప దయ్యాల పెనువాడ
నీతిగాని పాట వాతిచేటు
ప్రీతిలేని లంజ ఘాతియై తోఁచురా
విశ్వదాభిరామ వినర వేమ.
386
ఆ. చినుఁగు బట్ట కాదు చీనాంబరము గాని
ముఱికియొడలు గాదు ముక్తి గాని
పరమయోగిమహిమఁ బరికింప నరుదురా
విశ్వదాభిరామ వినర వేమ.
387
ఆ. అంధులైన వారు నందు నిం దనకుండు
నన్నితావులందు హరునివలెను
తెలియువారి కెల్ల దేవుఁడే కనుపించు
విశ్వదాభిరామ వినర వేమ.
388
ఆ. వాని గననివాఁడు వాఁడు కానేకాఁడు
వానిలోనివాఁడు వాఁడు సుమ్మి
వాని గన్నవాఁడు వాఁడెపో యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ.
389
ఆ. కుక్క యేమెఱుంగు గురులింగ దేవుని
నక్క యేమెఱుంగు నొక్కప్రొద్దు
మూర్ఖుఁడే మెఱుంగు మోక్షంబుత్రోవను
విశ్వదాభిరామ వినర వేమ.
390
క. వెయ్యారుగతుల జలనిధి
తియ్యగ ననిశంబు గలయ దిప్పుట యరుదౌ
కొయ్యకుఁదా సుజ్ఞానము
వెయ్యి విధంబులను జెప్ప వృథరా వేమా.
391
ఆ. వెదకి కానలేరు వేదాంత వేద్యుని
నుత్తముండు గాంచు నుర్విమీఁదఁ
గలిగెనేని వానిఁ గానంగ లేరయా
విశ్వదాభిరామ వినర వేమ.
392
ఆ. జ్ఞానవంతుఁ జూచి సహకర్మబుద్ధులు
వెఱ్ఱియండ్రు ప్రకృతి విడువలేరు
వెఱ్ఱి కవనిఁ బ్రకృతి వెదకినఁ గల్గునా
విశ్వదాభిరామ వినర వేమ.
393
ఆ. ఇంతికనులు చనులు నెంత లెస్సనిచూచి
మోహపడును బుద్ధి మోసపోయి
గరిసెలోనివానిఁ గానలే దాయెరా
విశ్వదాభిరామ వినర వేమ.
394
ఆ. వాతగుణము చేత వలపున మగవాఁడు
లొట్టకనులదాని లోలతకును
పుట్టి జగతి నిలుచు పునరుద్భవంబగు
విశ్వదాభిరామ వినర వేమ.
395
క. ఏసూత్ర మరసిచూచిన
స్త్రీ సూత్రం బదియుఁ గాక సిద్ధము కాఁగా
నా సూత్రముఁ స్త్రీ సూత్రము
నాసూత్రముఁ దెలియువాఁడు సాధుఁడు వేమా.
396
ఆ. బందెత్రాళ్ళఁ దెచ్చి బంధించి కట్టంగ
లింగఁడేమి దొంగిలించినాఁడొ
యాత్మలింగ మేల యర్చింపఁజూడరో
విశ్వదాభిరామ వినర వేమ.
397
ఆ. మంత్రమెల్ల మఱచి మధురాధరముఁగోరు
నేవిధమున భక్తుఁ డెఱుఁగు నిన్ను
యోనిఁ జూచి పరమయోగంబు మఱచురా
విశ్వదాభిరామ వినర వేమ.
398
ఆ. శైవవైష్ణవాది షణ్మతంబుల కెల్ల
దేవుఁ డొక్కఁ డనుచుఁ దెలియ లేరు
తమకు భేదమైన తత్వంబు భేదమా
విశ్వదాభిరామ వినర వేమ.
399
ఆ. పూసపోగు బెట్టిపురుషునిభుజ మెక్కి
కన్నులార్ప వారకాంత గాదు
తనకు లొంగువారిఁ దడయక చంపురా
విశ్వదాభిరామ వినర వేమ.
400
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )