శతకములు వేమన పద్యములు తృతీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. పెట్టినంత ఫలము పెక్కండ్ర కుపహతిఁ
జేయకున్నఁ దాను జెఱుపకున్న
పెండ్లిసేయునట్టి పెద్దఫలంబురా
విశ్వదాభిరామ వినర వేమ.
151
ఆ. మేకఁ జంకఁబెట్టి మెలఁగుచు మందలో
బ్రమసి తిరుగు గొల్లపగిది గాక
దైవ మెఱుఁగక పరదైవముల్‌ దలఁచును
విశ్వదాభిరామ వినర వేమ.
152
ఆ. వేడబంబువాని వినయంబు లధికంబు
చెడ్డముండ ముసుఁగు చెలఁగిపెట్టు
చెడిపెకొడుకు మిగులచేయు నాచారంబు
విశ్వదాభిరామ వినర వేమ.
153
ఆ. పరధనమ్ములకును బారుగా చెయిపట్టి
సత్యమింతలేక చారుఁడయ్యె
ద్విజుఁ డనుకొనుఁదాదు తేజమింతయు లేక
విశ్వదాభిరామ వినర వేమ.
154
ఆ. ఇమ్ము దప్పువేళ నెమ్మెలన్నియుఁ దక్కి
కాల మొక్క రీతిఁ గడుపవలయు
విజయుఁ డనువుదప్పి విరటుని గొలువఁడా
విశ్వదాభిరామ వినర వేమ.
155
ఆ. మెలత నడవినుంచి మృగమువెంటనె పోయె
రామచంద్రుకన్న రసికుఁడేడి
చేటుకాలమునకు చెడుబుద్ధి పుట్టును
విశ్వదాభిరామ వినర వేమ.
156
ఆ. లంకపోవునాఁడు లంకాధిపతి రాజ్య
మంత కీశసేన లాక్రమించె
చేటుకాలమైనఁ జెఱుప నల్పుఁడె చాలు
విశ్వదాభిరామ వినర వేమ.
157
ఆ. రామవిభుఁడు పుట్టి రఘుకులం బలరించె
గురువిభుండు పుట్టి కులముచెఱచె
ఎవరి మంచిచెడ్డ లెంచిచూచినఁ దేట
విశ్వదాభిరామ వినర వేమ.
158
ఆ. పురహరునకు నేఁతపరువు తానేసిన
స్థిరముగల్గు జ్ఞానజీవ మయ్యె
నేత కేమివచ్చె నిజభక్తి హేతువు
విశ్వదాభిరామ వినర వేమ.
159
ఆ. శుద్ధదృష్టిఁ దెలిసి శుక్రునంతటివాఁడు
పట్టలేక మనసు పాఱవిడిచి
కన్నుపోయి పిదప కాకిచందం బయ్యె
విశ్వదాభిరామ వినర వేమ.
160
క. పంచాక్షరి పూజలచే
సంచితముగ నెఱుఁగు నాతఁ డఖిలజ్ఞుండై
వంచన మెఱుఁగక కువలయ
సంచారము సేయు నతఁడు శంభుఁడు వేమా.
161
ఆ. శూద్రులందుఁబుట్టి శూద్రుల దూషించి
ద్విజుఁడ ననెడిపేరు నిజముఁజేసి
మనసు నిల్పకున్న మఱిశూద్ర నీచుండు
విశ్వదాభిరామ వినర వేమ.
162
ఆ. నొసలు బత్తుఁడయ్యె నోరు తోడే లయ్యె
మనసు భూతమువలె మలయఁగాను
శివునిఁ గనియె నన్నసిగ్గెట్లు గాదొకొ
విశ్వదాభిరామ వినర వేమ.
163
ఆ. మాదిగ చెవులను మనసులోఁ బెట్టుక
మాదిగలను దెగడు మాదిగపుడు
మంచిగుణములేక మఱిద్విజుఁ డెట్లగు
విశ్వదాభిరామ వినర వేమ.
164
ఆ. కల్లలాడుకంటె కష్టంబు మఱిలేదు
కష్టమెపుడు కీడుఁ గలిగియుండు
ద్విజుఁడననుట చూడఁ ద్రిమ్మరితన మది
విశ్వదాభిరామ వినర వేమ.
165
ఆ. విప్రవరుల మనుచు వేదంబుఁ జదువక
ప్రాకృతులను జూచి పరిహసించు
ధరణిసురులకన్న దాసరిమత మెచ్చు
విశ్వదాభిరామ వినర వేమ.
166
ఆ. వేష మొనరఁగట్టి వెలయ శూద్రత్వంబు
తనకు లేదనుకొను ధరణి ద్విజుఁడు
అరిది గిట్టువేళ నడఁగు ద్విజత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ.
167
ఆ. సోమయాజి ననుచు సొంపుగా వేషంబు
గట్టి మాంసమెల్లఁ గాల్చితినును
ద్విజుఁడనంగ నేమితేజంబు తనవల్ల
విశ్వదాభిరామ వినర వేమ.
168
ఆ. అంతరాత్మఁ గనక యల్పబుద్ధులతోడ
మెలఁగునట్టి ద్విజులు మేదినందు
యమునినరకములకు నరుగంగ నది సాక్షి
విశ్వదాభిరామ వినర వేమ.
169
ఆ. కల్లటికెకు భూతి గట్టిగాఁ బెట్టిన
నందులోని కంపు లడఁగనట్లు
మెడను త్రాడు వేయ మెఱపుతో ద్విజుఁడౌనె
విశ్వదాభిరామ వినర వేమ.
170
ఆ. బిందురక్తములను బెరసిన దేహంబు
చంద మెఱుఁగక ద్విజశబ్ద మిడఁగ
నడచిన విడుచున నరకంబు మృత్యువు
విశ్వదాభిరామ వినర వేమ.
171
ఆ. భూతి దేహమందుఁ బూసిన నాయెనా
నిష్ఠ శివునియందె నిలుపవలయుఁ
గాని భస్మమందు గాడిదె పొర్లదా
విశ్వదాభిరామ వినర వేమ.
172
ఆ. ఆకులెల్లఁదిన్న మేఁకపోతుల కేల
గాకపోవునయ్య కాయసిద్ధి
లోకులెల్ల వెఱ్ఱి పోకళ్ళఁ బోదురు
విశ్వదాభిరామ వినర వేమ.
173
ఆ. బోడితలల జడల బూడిదెపూఁతల
భాషణాసనముల వేషములను
యోగిగాఁడు లోన బాగుగాకుండెనా
విశ్వదాభిరామ వినర వేమ.
174
ఆ. కాయగూరలుతిని కాషాయవస్త్రముల్‌
బోడినెత్తి గలిగి పొరయుచుండ్రు
తలలు బోడులైనఁ దలఁపులు బోడులా
విశ్వదాభిరామ వినర వేమ.
175
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )