| ఆ. |
వారకాంత లెల్ల వలచి యేతెంతురా
పొందుఁజేసి ధనము పుచ్చుకొఱకు
మాచలమ్మ వచ్చి మఱి యిల్లువెళ్లురా
విశ్వదాభిరామ వినర వేమ. |
176 |
|
| ఆ. |
గురువుఁగూడుఁజేసి గుణము వత్తిగఁజేసి
సరవిఁగర్మఁ జమితి సమురుఁ జేసి
మూల నొక్కజ్యోతి ముట్టించి చూడరా
విశ్వదాభిరామ వినర వేమ. |
177 |
|
| ఆ. |
ఎన్నియెన్ని పూజలెచటఁ జేసిన నేమి
భక్తిలేని పూజ ఫలములేదు
భక్తి గల్గుపూజ బహుళ కారణమురా
విశ్వదాభిరామ వినర వేమ. |
178 |
|
| క. |
శివుగుడిని దీప మిడినను
శివమందిర మెల్ల వెలుగు జేయుట యరుదా
శివయోగి జ్ఞానదీపము
భువనంబుల వెలుఁగఁ జేయు పొలుపుగ వేమా. |
179 |
|
| ఆ. |
ఆపగాళివెంట నడవులవెంటను
కొండరాళ్ళవెంట గొడవయేల
నుల్లమందె శివుఁడటుండుటఁ దెలియరు
విశ్వదాభిరామ వినర వేమ. |
180 |
|
| క. |
లలితశివ తత్వపదమునఁ
గలసిన శివయోగియేల కలియును జనుల\న్
జలబిందువు ముత్తియమై
కలియునె తొల్లింటి నీటఁగనరా వేమా. |
181 |
|
| ఆ. |
గాడ్దె యేమెఱుంగు గంధంబు వాసన
కుక్క యేమెఱుంగు గొప్పబుద్ధి
అల్పుఁడే మెఱుంగు హరునిఁ గొల్చు విరక్తి
విశ్వదాభిరామ వినర వేమ. |
182 |
|
| ఆ. |
మూఁడువేళలందు ముదముతో శివు నాత్మఁ
బూజచేయువాఁడు పుణ్యమూర్తి
పూజలేక మోక్షభోగంబు దొరకునా
విశ్వదాభిరామ వినర వేమ. |
183 |
|
| ఆ. |
రుద్రరూపుఁ దాల్చి రుద్రుని నిందించి
భ్రష్టుత్రోవఁ దిరుగు భ్రష్టజనులు
ఱంకులకునుదిరుగు రమణులవలె నుండు
విశ్వదాభిరామ వినర వేమ. |
184 |
|
| ఆ. |
ఒడలు బడలఁజేసి యోగుల మనువారు
మనసు కల్మషంబు మాన్పలేరు
పుట్టమీదఁ గొట్ట భుజగంబు చచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ. |
185 |
|
| ఆ. |
మాలవానిఁ జూచి యేల నిందింపఁగ
పాటిలేనిమాట పలుకు టొకటె
వానిలోనఁ బల్కు వానికులం బేది
విశ్వదాభిరామ వినర వేమ. |
186 |
|
| ఆ. |
కుక్క యేకతంబు కొక్కెరధ్యానంబు
గాడ్దెరాగ మెన్నఁ గప్పుముసుఁగు
ఆత్మ యెఱుఁగుభావ మదియేల చేయరో
విశ్వదాభిరామ వినర వేమ. |
187 |
|
| ఆ. |
సకల శాస్త్రములను జదివియు వ్రాసియు
తెలియఁగలరు చావు దెలియ లేరు
చావు తెలియలేని చదువులవేలరా
విశ్వదాభిరామ వినర వేమ. |
188 |
|
| ఆ. |
కొండరాళ్లు దెచ్చి కోరికఁ గట్టిన
గుళ్ళలోనఁదిరిగి కుళ్ళ నేల
పాయని శివుఁడు ప్రాణమై యుండంగ
విశ్వదాభిరామ వినర వేమ. |
189 |
|
| ఆ. |
కులమువలనఁ గొంత బలిమివలనఁ గొంత
కలిమివలనఁ గొంత గర్వమునకు
ఱంకు చదువు చదివి ఱంకునఁ బడుదురు
విశ్వదాభిరామ వినర వేమ. |
190 |
|
| ఆ. |
విశ్వము నడుపంగ విశ్వేశ్వరుం డుండ
బ్రహ్మలకునునేల పాటిదక్కె
వనములోని క్రోతి వసుమతి నడుపునా
విశ్వదాభిరామ వినర వేమ. |
191 |
|
| ఆ. |
చదువువానికన్న చాకలి తా మేలు
కులము వేల్పుకన్న కుక్క మేలు
సర్వసురలకన్న సకలేశ్వరుఁడు మేలు
విశ్వదాభిరామ వినర వేమ. |
192 |
|
| ఆ. |
బూదిపూఁత లెన్న భుజముల పొంకాలు
వ్రాలు లింగములును వరుసమతము
తిక్కడగునుగాక యెక్కఁడ దగ దట్లు
విశ్వదాభిరామ వినర వేమ. |
193 |
|
| క. |
అడుగ దగువారి నడుగమి
నిడినయెడ\న్ కొసరు చుంట యీలేననఁగా
గడుసుపడి యాసచేఁదా
నడుగుట దుర్మార్గవృత్తు లగురా వేమా. |
194 |
|
| ఆ. |
అద నెఱిఁగిన మగువ యనువెర్గు చనువెర్గు
ముదముతోడ మగని మోహ మెఱుఁగు
విభుని శ్రేష్ఠగుణము వేశ్యతా నెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ. |
195 |
|
| ఆ. |
ఆఁకటికి దొలంగు నాచార విధు లెల్ల
చీఁకటికి దొలంగు చిత్తశుద్ధి
వేఁకటికిఁ దొలఁగు వెనుకటి బిగువెల్ల
విశ్వదాభిరామ వినర వేమ. |
196 |
|
| క. |
త్రాసును పడియును లంజయు
భాసురగతి నొక్కరూపు పరికింపంగా
వీసంబధికంబిచ్చిన
వాసరమున నొక్కవంక వారలు వేమా. |
197 |
|
| క. |
నిరుపేదల రక్షించెడు
సరసుఁడు నెఱవాతగాక సంపన్నులఁ దా
భరియించువాఁడు దాతయె
మెరమెచ్చులదాత యతఁడు మేదిని వేమా. |
198 |
|
| ఆ. |
తన్నుఁజూచి యొరులు దగ మెచ్చవలెనని
సొమ్ము లెలమిఁ బెట్టు నెమ్మిమీఱ
నొరులకొఱకుఁ దాన యుబ్బుచు నుండును
తన్ను దెలియ లేఁడు ధరణి వేమ. |
199 |
|
| ఆ. |
ధనము లేకయున్న ధైర్యంబు నిలువదు
ధైర్య మొదవలేని ధనము లేదు
ధనము ధైర్య మరయ ధర భూమిపతులకు
విశ్వదాభిరామ వినర వేమ. |
200 |
|