శతకములు వేమన పద్యములు ద్వితీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. కలిగిన మనుజుండు కాముఁడుసోముఁడై
మిగులఁ దేజమునను మెఱయుచుండు
విత్తహీనుఁడైన రిత్తయై పోవును
విశ్వదాభిరామ వినర వేమ.
26
ఆ. విటులకనుల కెంత విభ్రమమై యుండు
సాటిలేని పొలఁతి చక్కఁదనము
కంటిలోనిపాప కుంటెనకాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ.
27
ఆ. గురువునకును పుచ్చకూరైన నియ్యరు
అరయ వేశ్యకిత్తు రర్థమెల్ల
గురుఁడు వేశ్యకన్న గుణహీనుఁ డేమొకో
విశ్వదాభిరామ వినర వేమ.
28
ఆ. తీపులోన తీపు తెలియంగఁ బ్రాణంబు
ప్రాణవితతికన్నఁ బసిడి తీపు
పసిడికన్న మిగులఁ బడతిమాటలు తీపు
విశ్వదాభిరామ వినర వేమ.
29
ఆ. పనసతొనలకన్నఁ బంచదారలకన్న
జుంటితేనెకన్న జున్నుకన్నఁ
జెఱకురసముకన్నఁ జెలిమాట తీపురా
విశ్వదాభిరామ వినర వేమ.
30
ఆ. కొమ్మదిమ్మరైనఁ ద్రిమ్మరులవలదు
సరసవిటులనేల సమ్మతించు
పేడతిన్న పురుగులెల్ల మేమెఱుఁగురా
విశ్వదాభిరామ వినర వేమ.
31
ఆ. ఆలివంకవార లాత్మబంధువు లైరి
తల్లివంకవారు తగినపాటి
తండ్రివంకవారు దాయాది తగవులౌ
విశ్వదాభిరామ వినర వేమ.
32
ఆ. కుక్క యేమెఱుంగు గురులింగజంగంబుఁ
బిక్కనొడిసిపట్టి పీఁకుగాక
సంతపాకతొత్తు సన్యాసి నెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ.
33
ఆ. తొత్తుతోడిపొందు తొఱ్ఱిపెసలమూట
ముచ్చుతోడిపొందు తెచ్చునింద
తలవరింటిపొందు తలతోటిదీరురా
విశ్వదాభిరామ వినర వేమ.
34
ఆ. తనదునృపతితోడఁ దనయాయుధముతోడ
నగ్నితోడఁ బరులయాలితోడ
హాస్యమాడుటెల్ల హాని ప్రాణమునకు
విశ్వదాభిరామ వినర వేమ.
35
ఆ. మంచిరుచులను గోరు మంచిస్త్రీలను గోరు
మనుజుఁ డెంత చెడ్డమనసు చూడ
నించుకైన నేలని విడువఁడు
విశ్వదాభిరామ వినర వేమ.
36
ఆ. తరుణి సొగసుఁగన్న తనయుని గన్నను
మరునికళల మించి మనము పాఱు
పాపజాతి మనము పట్టంగ రాదయా
విశ్వదాభిరామ వినర వేమ.
37
ఆ. తేనె పంచదార తియ్యమామిడిపండు
తిన్నఁగాని తీపు తెలియగరాదు
కన్న నింపు పుట్టుఁ గామినియధరంబు
విశ్వదాభిరామ వినర వేమ.
38
ఆ. ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ
యెరువులేకపోయి తిరిగె విలువ
నేర్పెఱుఁగనివాని నెఱయోగి యందురా
విశ్వదాభిరామ వినర వేమ.
39
ఆ. పదుగు రాడుమాట పాటియై ధరఁజెల్లు
నొక్కఁడాడుమాట యెక్కదెందు
నూరకాడుకాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినర వేమ.
40
ఆ. గుణయుతునకు మేలు గోరంతఁ జేసినఁ
గొండయౌను వానిగుణముచేత
కొండకొలఁదిమేలు గుణహీనుఁ డెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ.
41
ఆ. పతిని విడువరాదు పదివేలకైనను
పెట్టి చెప్పరాదు పేదకైన
పతిని దిట్టరాదు పతి రూపవతియైన
విశ్వదాభిరామ వినర వేమ.
42
ఆ. సుతులు పతులు మాయ సుఖదుఃఖములు మాయ
సంస్మృతియును మాయ జాతిమాయ
మాయబ్రతుకుకింత మాయ గల్పించెరా
విశ్వదాభిరామ వినర వేమ.
43
ఆ. మాటనిలుపలేని మనుజుండు చండాలుఁ
డాజ్ఞ లేనిరాజు ఆఁడుముండ
మహిమలేని వేల్పుమంటిఁ జేసినపులి
విశ్వదాభిరామ వినర వేమ.
44
ఆ. సిగ్గువారల మని సృష్టిలోపలివారు
వెఱ్ఱివేమనఁ గని వెఱఁగుపడిరి
తనకుఁ గలుగుసిగ్గు దైవ మెఱుంగురా
విశ్వదాభిరామ వినర వేమ.
45
ఆ. విడువ ముడువ లేక కుడువఁ గట్టఁగ లేక
వెఱపులేక విద్య నొరయలేక
వెడలలేనివాని నడపీనుఁ గందురో
విశ్వదాభిరామ వినర వేమ.
46
ఆ. లేని కాలమునకు లేమిమనము నొందు
నీనిన పులిరీతి నెఱుఁగకుండు
కఠినబుద్ధి కిట్లు కలిమేమి గల్గురా
విశ్వదాభిరామ వినర వేమ.
47
ఆ. ఇంచుకంతబోన మీశ్వరార్పణ మన్న
పుణ్యలోకమునకుఁ బోవు నతఁడు
అన్నదానమునకు నధికదానము లేదు
విశ్వదాభిరామ వినర వేమ.
48
ఆ. ప్రియములేని విందు పిండివంటలచేటు
భక్తిలేని పూజ పత్రిచేటు
పాత్ర మెఱుఁగ నీవి బంగారు చేటురా
విశ్వదాభిరామ వినర వేమ.
49
ఆ. తన్నుఁ దానెఱుఁగఁడు తా నెవ్వరికి నేర్పు
ప్రాలుమాలితిరుగు పశువుకొడుకు
కాసులకొఱకైన కర్మముల్‌ గట్టురా
విశ్వదాభిరామ వినర వేమ.
50
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )