శతకములు వేమన పద్యములు ప్రథమాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. ఈశ్వరుని దలంప నేడుపాళ్లుగఁ జేసి
తనదుమూర్తినెల్ల ధారఁబోసి
నిత్యకర్మములను నిలుచురా నెఱయోగి
విశ్వదాభిరామ వినర వేమ.
401
ఆ. ఏడె యక్షరముల నీయంద మొందిన
నందు నిందు ముక్తి యలరుచుండు
నందు నిందుఁ దెలియ నదియెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ.
402
ఆ. ఎసఁగువేత్త యనుచు నెఱుగరే యీనరుల్‌
వేయిమార్గములను వేలు పజుఁడు
అవని సృష్టికర్త యంతకు గురుఁ డెన్న
నతనికి తలయేది యరయ వేమా.
403
క. వేమన చెప్పిన మాటలు
సామంబున సకలవేద సారంబుగదా
సామెత పంచాక్షరిలో
నీమహిమలఁ దెలియకున్న నింపా వేమా.
404
ఆ. ప్రణవమంత్రమహిమ భావింప లింగంబు
మూడుమూర్తులందు మొనసియుండు
నతని నెఱిఁగి కొలువ నన్యుల వశమా
విశ్వదాభిరామ వినర వేమ.
405
ఆ. అక్షరపుట మిట్టి యండంబులోఁ గూర్చి
యమరునొక్క రవము ననుభవించు
నతని కన్న ముక్తి యక్షరమై యుండు
విశ్వదాభిరామ వినర వేమ.
406
క. అక్షరపుటడవిఁజొర వే
లక్షలఁ జదువంగ నేల లాలితముగఁ బ్ర
త్యక్షముగను శివ యను రెం
డక్షరములు మనకి శుద్ధి యగురా వేమా.
407
ఆ. లోను బదిలపఱచి లోనివికారముల్‌
దలఁచి మెట్టువారు తెలియువారు
ఆకసమున వేడ్కనరయంగ నుందురు
విశ్వదాభిరామ వినర వేమ.
408
ఆ. సూక్ష్మమధ్యమునను సొరిది జీవుం డుండు
స్థూలమధ్యమందు సూర్యుఁ డుండు
నాదబిందుకళల నాబ్రహ్మ ముండురా
విశ్వదాభిరామ వినర వేమ.
409
ఆ. చూపులోనిచూపు సూక్ష్మమౌఁ దెలియంగఁ
జూపులోనిచూపు శుభ్రమాయె
జూపులోనిచూపు సురవరగమ్యము
విశ్వదాభిరామ వినర వేమ.
410
ఆ. ప్రణవ మరయలేక భక్తుఁడు గాలేఁడు
జ్యోతి నరయలేక జోగికాఁడు
నిత్య మరయలేక నిర్వాణికాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ.
411
ఆ. ఆత్మయందు జ్యోతి యెఱుగుట లింగంబు
తెలిసిచూడగాను తేటపడును
అదియు గురువులేక యబ్బునా తెలియంగ
విశ్వదాభిరామ వినర వేమ.
412
క. ఘంటారావము మదిలో
వింటిన్నే కంటఁగంటి విమలపుకాంతి\న్‌
వెంటాడక బ్రహ్మంబును
గంటిని వగ కాదు నన్నుఁ గనుగొన వేమా.
413
ఆ. మొదలు చూచిచూచి తుదిఁ జూడకుండెనా
చూపు తప్పినపుడె సొరగవలెను
సొరగకున్నవానిఁ జులకగాఁ జూతురు
విశ్వదాభిరామ వినర వేమ.
414
ఆ. జ్ఞానముద్రచేతఁ గానవచ్చెడితళ్కు
నదియ మదికి శ్రేష్ఠ మనుచు మునులు
పలికి రదియుఁ దెలియఁ బరమార్థ మగునయా
విశ్వదాభిరామ వినర వేమ.
415
ఆ. నాదబిందుకళల నయమొంది యాత్మ
యం దంటి చపలచిత్త మమర నిల్పి
బ్రహ్మరంధ్రమునను బ్రబలిన యోగిరా
విశ్వదాభిరామ వినర వేమ.
416
ఆ. మనసు హక్కు కర్మ మదియేమి లేకయ
రాకపోకలేని రాజవీధి
పరగ హాని గలదె పరతత్వయోగికి
విశ్వదాభిరామ వినర వేమ.
417
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )