| ఆ. |
హంగుమీరఁ దాను యతులజన్మంబుల
నరసి చెప్పునెంతవారికైన
ఆడకాడ కనువు నతిశయమై వచ్చు
విశ్వదాభిరామ వినర వేమ. |
351 |
|
| ఆ. |
తనువుఁ దా ననుకొనుఁ దనకుఁదా ననఁదగి
జనన మరణములను జిక్కిచిక్కి
పొలుపుపొం దెఱుఁగక పొర్లాడుచుండెడి
భ్రాంతిజీవి కేటిపరము వేమా. |
352 |
|
| క. |
చిత్తము బుద్ధియు మఱచియు
హత్తు నహంకారములను నాత్మకు లోగా
మొత్తముగఁ జేయ నేరని
మత్తునకును ముక్తిలేదు మహిలో వేమా. |
353 |
|
| ఆ. |
తాను తనువు యనుచు ద్వయమును బలుకుచు
మోహవారిరాశి మునిఁగియున్న
జనుల కెట్లు మోక్ష సంగతి సిద్ధించు
విశ్వదాభిరామ వినర వేమ. |
354 |
|
| క. |
నిఖిలాకారుం డాతఁడు
నిఖిలాత్ముఁడు సర్వసాక్షి నిజముగఁ దానై
నిఖిలంబు నిందుజూఁడగ
నిఖిలంబై యుండు నిచ్చ నిజముగ వేమా. |
355 |
|
| ఆ. |
విన్నవానికన్నఁ గన్నవాఁ డధికుండు
కన్నవానికన్నఁ గలియువాఁడు
ఉన్నతోన్నతుఁడయి యుర్విలోపల నుండు
విశ్వదాభిరామ వినర వేమ. |
356 |
|
| ఆ. |
బ్రహ్మమును దెలిసెడు భావమందున నిల్చి
తనువు గుడిని జేసి తన్ను నిలిపి
లోకమందు నిలిచి లోఁజూపు చూడరా
విశ్వదాభిరామ వినర వేమ. |
357 |
|
| ఆ. |
జీవసంజ్ఞ గలుగు జీవుని తత్వంబ
జీవపరుని గురుని జెందఁజేసి
తన్ను నిల్పువాఁడు తానె తత్వజ్ఞుఁడౌ
విశ్వదాభిరామ వినర వేమ. |
358 |
|
| క. |
తనలోననె సకలంబును
తనరందా నగుటయెఱిఁగి తారకమాత్మన్
దనువనుచుఁ బరిణమించిన
మనుజునకును ముక్తికలదు మహిలో వేమా. |
359 |
|
| ఆ. |
తాను దానె యనెడి తత్వాల లోపల
నన్య మెఱుఁగకుండు నబ్బతోడు
తానెతానునయిన దల్లడం బేలరా
విశ్వదాభిరామ వినర వేమ. |
360 |
|
| క. |
తానే నేర్పరియయినం
తారకములఁ దానెతన్ను దప్పించుకొను\న్
దానెన్ని విధము లడరిన
తానే పరమాత్మ యనుచుఁ దలఁచర వేమా. |
361 |
|
| క. |
తా నగుట యెఱిఁగి సర్వముఁ
దా నగుటయుఁ దెలిసి యెల్లతత్వముదానై
తానెఱిఁగి పరిణమించిన
మానవులకు శక్తిలేదు మహిలో వేమా. |
362 |
|
| క. |
ఇదినాకుఁ జాలఁదనుచును
వదలక మదిలోననైన వస్తువు భ్రమతల్
కదిసి విడనాడ కుండిన
నదియే సంసారబీజ మందుర వేమా. |
363 |
|
| ఆ. |
రూపు పేరు రెండు రూఢితోఁ గలిసిన
పేరు రూపిక్రియలు పెనగిఁయుండు
నామరూపమ్ములు నాశ మొందుటమేలు
విశ్వదాభిరామ వినర వేమ. |
364 |
|
| ఆ. |
దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి
మోహమందుఁ జిక్కి మోసపోఁడు
ఇంద్రజాలకుండు నెందుకుఁ జిక్కురా
విశ్వదాభిరామ వినర వేమ. |
365 |
|
| క. |
చేతస్సంకల్పంబులు
నీతిని వర్జించి నపుడె నిర్మల పదవుల్
ప్రీతిం బొందు నటందురు
భూతములనఁ బరఁగ యోగ పురుషులు వేమా. |
366 |
|
| ఆ. |
సుఖసుఖాన దాను సుగుణుఁడై యుండఁగఁ
బ్రకృతి పెండ్లిచేసి పరముఁ జెడిచి
విధులఁ బుట్టఁజేయు విధినిదాఁగానఁడు
విశ్వదాభిరామ వినర వేమ. |
367 |
|
| ఆ. |
పడుచు పక్వమెన్నఁ బసివాఁ డెఱుంగునా
యెఱుక దివ్యయోగి యెఱుఁగుఁగాక
మోహగుణ మెఱింగి మోహంబు విడనాఁడు
విశ్వదాభిరామ వినర వేమ. |
368 |
|
| ఆ. |
రూపు మాయ చూపు రూఢియై వెలుగొందుఁ
గాదుమాయమ్రానుఁ గల్పతరువు
చూపు గ్రుంగఁ జేసి చూచుట సుఖమురా
విశ్వదాభిరామ వినర వేమ. |
369 |
|
| ఆ. |
సిగ్గునేడనుదాగుఁ జీక టేడను దాగు
నాఁకలేడదాగు నాత్మలోన
దాగియున్న నిద్ర దాగుట తెలియుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ. |
370 |
|
| ఆ. |
శత్రువరుల నరసి సరగున ఖండించి
మిత్రవర్గమునకు మేలుచేసి
దండివెలుగుఁజూపి పిండమధ్యంబున
నర్థి నిలుచువాఁడు హరుఁడు వేమా. |
371 |
|
| ఆ. |
దేహ సంకటమును దెగితేరకాండ్రకు
మోహదృష్టి విడిచి మూల మెఱిఁగి
వ్యూహ మొక్కటిపన్ని యుల్లంబు సంధించి
స్నేహ మెఱుఁగ యోగ సిద్ధి వేమ. |
372 |
|
| క. |
విషయము లొరసిన నొరయఁడు
విషయేంద్రియ పరదళంబు సేయగ మఱిదా
విషమాది షట్కమను దు
ర్విషయములను బొందకుండ వేమన నేర్చు\న్. |
373 |
|
| క. |
తన నిజరూపముఁ జూడఁగ
తన మాయను సిద్ధులయినఁ దపముల మాయన్
తానెంతటి ఘనుఁడయినను
తనిసినవాఁడైన జూడ ధరలో వేమా. |
374 |
|
| ఆ. |
తాను పుట్టుచోటు తాఁజూచి పలికెనా
తాను బుద్ధిదిరుగు ధరణిలోన
తాను బుట్టుచోటు తత్వంబు తలపోయ
విశ్వదాభిరామ వినర వేమ. |
375 |
|