| ఆ. |
పప్పులేని కూడు పరుల కసహ్యమౌ
నప్పులేనివాఁడె యధిక బలుఁడు
ముప్పులేనివాఁడు మొదల సుజ్ఞానుఁడు
విశ్వదాభిరామ వినర వేమ. |
151 |
|
| క. |
పేదరిక మంతదోషము
లేదే యీ జగతిలోన నీశ్వరుఁ డెఱుఁగ\న్
పేదను పొడఁగనువాడు\న్
గాదము విధమునను జూచుఁ గదరా వేమా. |
152 |
|
| ఆ. |
ధార్మికునకుఁ గాని ధర్మంబుఁ గనరాదు
కష్టజీవి కెట్లు కానఁబడును
నీరుచొరకలోతు నిజముగాఁ దెలియదు
విశ్వదాభిరామ వినర వేమ. |
153 |
|
| ఆ. |
మొగముఁ జూచినపుడె మోహంబు ఘన మౌను
ధనముఁ జూచినపుడె తగులు మనసు
కూలినప్పు డరయకుసులెల్ల విఱుగును
విశ్వదాభిరామ వినర వేమ. |
154 |
|
| ఆ. |
ఎన్ని మతములైన జరుగఁ దగదు
సత్య మింతలేక జరుగఁ దగదు
సత్యము గలవాఁడు జగతిలో ద్విజుఁ డయ్యె
విశ్వదాభిరామ వినర వేమ. |
155 |
|
| ఆ. |
పరుల మోసపుచ్చి పరధన మార్జించి
కడుపునింపుకొనుట కానిపద్దు
ఋణముసేయు మనుజుఁ డెక్కువ కెక్కునా
విశ్వదాభిరామ వినర వేమ. |
156 |
|
| ఆ. |
స్థిరముగాని క్షుద్రపర నటనలుచేసి
హెచ్చుతగ్గు లొంది హీనమతులు
గాడ్దెపిల్ల లరుతుఁ గ్రక్కునఁ జెడుదురు
విశ్వదాభిరామ వినర వేమ. |
157 |
|
| ఆ. |
ధర్మమన్న వినరు తము నమ్మి భూనరుల్
యమునివారు వచ్చి యడలు నించి
చొచ్చి కట్టఁదారు చొరఁబారఁ గలరొకో
విశ్వదాభిరామ వినర వేమ. |
158 |
|
| ఆ. |
దానమడుగువాఁడు ధరలోన నధముండు
దానమడుగఁడేని దైవసముఁడు
దానమీనివాఁడు ధన్యుండు కాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ. |
159 |
|
| ఆ. |
తనకు ప్రాప్తిలేక దానమియ్యరటంచు
దోషబుద్ధిచేత దూరుటెల్ల
ముక్కువంకఁ జూచి ముక్కఱదూరుట
విశ్వదాభిరామ వినర వేమ. |
160 |
|
| ఆ. |
పెక్కుజనులఁ జంపి పేదల వధియించి
డొక్కకొరకు నూళ్లు దొంగలించి
యెక్కడికిని బోవ నెఱిఁగి యముఁడు చంపు
విశ్వదాభిరామ వినర వేమ. |
161 |
|
| ఆ. |
తండ్రికన సుగుణి తనయుఁడు గల్గెనా
పిన్న తనము లెన్నఁదగదు
వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా
విశ్వదాభిరామ వినర వేమ. |
162 |
|
| ఆ. |
పాల నీడిగింటఁ గ్రోలుచు నుండెనా
మనుజు లెల్లగూడి మద్యమండ్రు
నిలువఁదగనిచోట నిలువ నిందలు వచ్చు
విశ్వదాభిరామ వినర వేమ. |
163 |
|
| ఆ. |
కన్నపుత్రునాశ కనకంబుమీఁ దాస
స్త్రీలమీఁద నాశ చిత్తమెడలి
బ్రమలు విడువకున్న బ్రహ్మంబుఁ గానరొ
విశ్వదాభిరామ వినర వేమ. |
164 |
|
| ఆ. |
చెట్టుచేనుగొట్టి చుట్టుగోడలఁబెట్టి
యిట్టునట్టుఁ బెద్దయిల్లు గట్టి
మిట్టిపడును నరుఁడు మీఁదిచే టెఱుంగక
విశ్వదాభిరామ వినర వేమ. |
165 |
|
| క. |
వచ్చెడిది పోయెడిది మఱి
చచ్చెడిదియుఁ గనకలేక సహజము లనుచు\న్
విచ్చలవిడిగాఁ దిరుగుట
చిచ్చునఁబడునట్టి మిడుత చెలువము వేమా. |
166 |
|
| ఆ. |
కుక్కతోలు దెచ్చి యెఱుపుబొమ్మను జేసి
యాడునట్టుచేసి యట్టెవేసె
తన్నుఁ ద్రిప్పువానిఁ దానేలకానఁడో
విశ్వదాభిరామ వినర వేమ. |
167 |
|
| ఆ. |
పరబలంబుఁజూచి ప్రాణరక్షణమున
కుఱికి పాఱిపోవు పిఱికినరుఁడు
యముఁడు కుపితుఁడైన నడ్డ మెవ్వండయా
విశ్వదాభిరామ వినర వేమ. |
168 |
|
| ఆ. |
తల్లిదండ్రి చావఁ దనయుఁడు తానేడ్చు
మగఁడు చావ నాలు వగచుచుండు
కార్యవశము గాని కలుగదు మోహంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
169 |
|
| ఆ. |
మనసులోని ముక్తి మఱియొక్క చోటను
వెదుకఁబోవువాఁడు వెఱ్ఱివాఁడు
గొఱ్ఱెఁ జింకఁ బెట్టి గొల్ల వెదుకురీతి
విశ్వదాభిరామ వినర వేమ. |
170 |
|
| ఆ. |
ఆశకన్న దుఃఖ మతిశయంబుగ లేదు
చూపు నిలుపకున్న సుఖము లేదు
మనసు నిల్పకున్న మఱి ముక్తి లేదయా
విశ్వదాభిరామ వినర వేమ. |
171 |
|
| ఆ. |
తత్వహీను లుండ్రు తఱుచుగా భువిలోన
తత్త్వ మెఱుగువారు తఱుచులేరు
కలిగిలేనివారు కనిపింపరారయా
విశ్వదాభిరామ వినర వేమ. |
172 |
|
| ఆ. |
తామసేంద్రియములఁ దనర జయించిన
తత్వ మరసి చూడఁ దాన యగును
రాజయోగి యిట్లు తేజరిల్లుచు నుండు
విశ్వదాభిరామ వినర వేమ. |
173 |
|
| ఆ. |
స్త్రీలమాయచేతఁ జిక్కి తాఁ గొన్నాళ్ళు
తగులు గోరునట్లు తగిలిపోవు
తనిసిపోయి తాను దైవంబుచేఁజెడు
విశ్వదాభిరామ వినర వేమ. |
174 |
|
| ఆ. |
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు నింతింత కాదయా
విశ్వదాభిరామ వినర వేమ. |
175 |
|