శతకములు వేమన పద్యములు తృతీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

క. తనుఁదాఁ దెలియుట తత్త్వము
తన కన్యులు బోధసేయ ధరలోఁ గలరే
తనుఁదాఁ దెలియక యుండినఁ
దన కెవరుం దెలుపలేరు తథ్యము వేమ.
76
ఆ. మంచివారు లేరు మహిమీఁద వెదకినఁ
గష్టు లెందరైనఁ గలరు భువిని
పసిఁడి లేదె గాని సదడెంత లేదయా
విశ్వదాభిరామ వినర వేమ.
77
ఆ. మాటలాడ నేర్చి మనసు కరుఁగఁజేసి
పరఁగ ప్రియముపుట్టఁ బలుకకున్న
నొకరిచేత సొమ్ము లూరకవచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ.
78
ఆ. అండములను బుట్టు నలరు ప్రాణులు కొన్ని
బుద్బుదములఁ బుట్టుఁ బురుగు లెల్ల
స్వేదముననుబుట్టు జీవులు కొన్నిరా
విశ్వదాభిరామ వినర వేమ.
79
ఆ. అన్న మధికమైన నది తనుఁజంపును
నన్న మంటకున్న నాత్మ నొచ్చుఁ
జంప నొంప బువ్వ చాలదా వెయ్యేల
విశ్వదాభిరామ వినర వేమ.
80
ఆ. ఆశ లుడుగఁగాని పాశముక్తుఁడు గాఁడు
ముక్తుఁ డైనఁగాని మునియుఁగాఁడు
మునియు నయినఁగాని మోహంబు లుడుగవు
విశ్వదాభిరామ వినర వేమ.
81
ఆ. చంపఁదలఁచురాజు చనవగ్గలం బిచ్చుఁ
జెఱుపనున్న పగఱ చెలిమిసేయుఁ
గఱవనున్న పాము నెఱికాచుకొనియుండు
విశ్వదాభిరామ వినర వేమ.
82
ఆ. చెఱకులోననైనఁ జెడ్డగుణం బున్నఁ
దీసివేయకున్నఁ దినగఁ బొసగ
దంతిపురము ద్రోహి యాతఁడెట్లుండురా
విశ్వదాభిరామ వినర వేమ.
83
ఆ. తనకు లేనివాఁడు దైవముందూఱును
తనకుఁ గలిగెనేని దైవ మేల
తనకు దైవమునకుఁ దగులాటమేశాంతి
విశ్వదాభిరామ వినర వేమ.
84
ఆ. తనదుమనసుచేతఁ దర్శించి జ్యోతిష
మెంతచేసెననుచు నెంచిచూడఁ
దనయదృష్ట మెల్ల దైవమ్ము తెలియురా
విశ్వదాభిరామ వినర వేమ.
85
ఆ. తన్నుఁ దెలియువారు దైవజ్ఞు లెంతయు
నిన్నుఁ దెలియరేని నిలువరైరి
మాయఁ దెలియకుండ మంటపాలైరయా
విశ్వదాభిరామ వినర వేమ.
86
ఆ. దైవమతుల నరులు తమవంటివా రని
యరసి గూఢతత్వ మరయ లేరు
ఇల్లు మూయఁబడిన నెట్లు మర్మ మెఱుఁగు
విశ్వదాభిరామ వినర వేమ.
87
ఆ. నీవుగలుగుచోటు నెళువు దెలియువాఁడు
వసుధయందు త్రోవ వదలఁ డెందుఁ
కాలు కదలనీక గ్రక్కునఁ జేరురా
విశ్వదాభిరామ వినర వేమ.
88
ఆ. నీవు నిలిచియుండు నిఖిలంబు నిలువదు
నిలిచియుండు నెండు నీరువలెను
నీవు నిశ్చయంబు నిఖిలంబు మాయయౌ
విశ్వదాభిరామ వినర వేమ.
89
ఆ. మొదట నతఁడు జ్ఞాన ముద్రాంకితుఁడు గాక
యావిధమును దెలియ సజ్ఞుఁ డగును
నడుమ జ్ఞాన మొదవ నగుఁబాటు గాదయా
విశ్వదాభిరామ వినర వేమ.
90
ఆ. పికము వనములోన విలసిల్ల పలికిన
భంగి ప్రాజ్ఞుడనుల పలుకుకులుకు
కాకికూతఁ బోలుఁ గర్మబంధులకూఁత
విశ్వదాభిరామ వినర వేమ.
91
ఆ. చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్కకుక్క చేరి బాధచేయు
బలిమిలేనివేళఁ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినర వేమ.
92
ఆ. జ్ఞానుల మని యెంచి చపలాత్ము లగువారు
తెలివిలేక తమ్ముఁ దెలియలేరు
కష్టగహనమందు కాడ్పడియున్నారు
విశ్వదాభిరామ వినర వేమ.
93
ఆ. పాపపుణ్యములును పసిమిగా పెఱిగినా
ధరను నరయ యోగి యెఱుగుఁగాక
లోనిపొందికఁగని లోహముల్‌ గూర్పరో
విశ్వదాభిరామ వినర వేమ.
94
ఆ. పెద్దల వచనములఁ బ్రేమతోఁ జూచి తా
నటుల నడవఁబోవ ననువుపడదు
పులిని చూచి నక్క పూతఁపూసిన యట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
95
ఆ. బుద్ధియుతున కేల పొసఁగని సౌఖ్యంబు
కార్యవాదికేల కడుచలంబు
కుత్సితునకు నేల గురుదేవతాభక్తి
విశ్వదాభిరామ వినర వేమ.
96
క. వినుకలి కనుకలి గోరము
కనుకలియాకాంతగూడి కవయగ గోరు\న్‌
గనుగొని ప్రేమన్బొరలును
ఘనతరమోహంబుచోటు గదరా వేమా.
97
ఆ. ఎల్లి రేపు నేఁడు నేలాగునైనను
మనసునిల్పువాఁడు మంచివాఁడు
శివుఁడు భర్త కర్త చింతింపనేలరా
విశ్వదాభిరామ వినర వేమ.
98
క. మఱవవలె భావసంగతి
మఱవంగావలెను దురము మఱి విశ్వములో
మఱవవలెఁ బరులనేరము
మఱవంగా వలదు మేలు మహిలో వేమా.
99
ఆ. ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవుఁ
బుట్టువేళ నరుఁడు గిట్టువేళ
ధనము లెచటి కేఁగు దానేగు నెచటికి
విశ్వదాభిరామ వినర వేమ.
100
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )