| ఆ. |
తనదుభ్రాత లెల్ల దానంబు సేయంగ
తనకు ఫలమటంచుఁ దలఁచరాదు
తనదుకాలు కోయఁ దన తమ్ముఁడేడ్చునా
విశ్వదాభిరామ వినర వేమ. |
76 |
|
| ఆ. |
పంకజాక్షిఁ గన్న బంగరు పొడగన్న
దిమ్ముబట్టియుండు తెలివి కెల్ల
మనుజులకును తత్వమహి మెట్టు గల్గురా
విశ్వదాభిరామ వినర వేమ. |
77 |
|
| ఆ. |
దాతగానివాని తఱచుగా వేఁడిన
వాడుఁ దాతయగునె వసుధలోన
అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ. |
78 |
|
| ఆ. |
మొండివాని కేల ముంజేతి కడియాలు
తొఱ్ఱివాని కేల కఱ్ఱపండ్లు
గాడిదలకు నేల గడ్డముల్ మీసముల్
విశ్వదాభిరామ వినర వేమ. |
79 |
|
| ఆ. |
దొడ్డవాండ్రమనుచుఁ ద్రోవడొంకలు బెట్టి
యడ్డమైన జనులనంటఁగట్టి
దోఁచుకున్న నట్టి దోష మెక్కడఁబోవు
విశ్వదాభిరామ వినర వేమ. |
80 |
|
| ఆ. |
పట్టనేర్చు పాము పడగ నోరఁగఁజేయు
చెఱుపఁజూచువాఁడు చెలిమిఁజేయు
చంపఁ దలఁచురాజుచనువిచ్చు చూడరా
విశ్వదాభిరామ వినర వేమ. |
81 |
|
| ఆ. |
ఎంతసేవఁజేసి యేపాటుపడినను
రాచమూక నమ్మరాదు రన్న
పాముతోడిపొందు పదివేలకైనను
విశ్వదాభిరామ వినర వేమ. |
82 |
|
| ఆ. |
మొదల క్రియను దప్పి మోసంబుచేసియు
పొట్టకొఱకు మనసుఁ బొందుపఱచి
బీద కుక్కరీతి పెరుగును మనుజుండు
విశ్వదాభిరామ వినర వేమ. |
83 |
|
| ఆ. |
కలికిచిత్ర మరయఁ గామునియంత్రంబు
పువ్వుఁ బోడిచుక్కబొట్టు గన్న
కాంతిబెళుకు గన్న కడు పొక్కు పుట్టురా
విశ్వదాభిరామ వినర వేమ. |
84 |
|
| క. |
చక్కెర గలిపియు తినఁగా
ముక్కిన తవుడైన లెస్స మోహము గలుగ\న్
వెక్కురు బానిసయైన\న్
మక్కువఁ గను దివ్యభామ మహిలో వేమా. |
85 |
|
| ఆ. |
ఎట్టివానికైనఁ బుట్టును మోహంబు
పుట్టు మోహమెల్లబ్రోవఁద్రొక్కి
గట్టిచేసి చూడఁ గాన్పించు బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
86 |
|
| ఆ. |
పట్టుకొమ్మ లేక బలుపాట్ల బడువారు
పెట్టిపోయ లేక తిట్టువారు
ముట్టిశివునిపూజ మొదలు సేయరు వారు
విశ్వదాభిరామ వినర వేమ. |
87 |
|
| ఆ. |
ఆత్మలోని శివుని ననువుగా శోధించి
నిశ్చలముగ భక్తి నిలిపెనేని
సర్వముక్తుడౌను సర్వంబుఁ దానౌను
విశ్వదాభిరామ వినర వేమ. |
88 |
|
| ఆ. |
ఎఱిఁగిన శివపూజ యెన్నడు చెడిపోదు
మొదలఁబట్టుపట్టి వదల రాదు
మొదలు విడిచి గోడ తుదిఁ బెట్ట గల్గురా
విశ్వదాభిరామ వినర వేమ. |
89 |
|
| ఆ. |
చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు
మేలు వచ్చెనేని మెచ్చుఁ దన్ను
చేటు మేలుతలఁపుఁ జేసినకర్మముల్
విశ్వదాభిరామ వినర వేమ. |
90 |
|
| ఆ. |
కడుపుచిచ్చుచేత కామానలముచేత
క్రోధవహ్నిచేత కుతిలపడకను
యుక్తమనసుతోడ నుండినప్పుడె ముక్తి
విశ్వదాభిరామ వినర వేమ. |
91 |
|
| క. |
ఏవంక మనసు కలిగిన
నా వంకకు నింద్రియంబు లన్నియు నేగు\న్
నీ వంక మనసు కలిగిన
నే వంకకు నింద్రియంబు లేగవు వేమా. |
92 |
|
| ఆ. |
పాలు పెరుగు వెన్న పాయసాన్నము నెయ్యి
జున్ను లెన్నియైనఁ జూడ పాలె
పొలవంటికులము బ్రహ్మంబు కానరో
విశ్వదాభిరామ వినర వేమ. |
93 |
|
| ఆ. |
చదువులందు రాజపదవులందును పాడి
మొదవులందు స్త్రీల పెదవులందు
నాశ లుడుగునట్టి యయ్యలు ముక్తులు
విశ్వదాభిరామ వినర వేమ. |
94 |
|
| ఆ. |
కడుపు కేల మనసు కళవళపడియెడు
కడుపు కేలతృప్తి కలుగుచుండు
కరప రాతిలోని కప్పకుఁ గలుగదా
విశ్వదాభిరామ వినర వేమ. |
95 |
|
| ఆ. |
శూద్రతనము పోయె శూద్రుఁడఁ గానని
ద్విజుఁ డనుకొనుటెల్ల దెలివిలేమి
ఇత్త డెసఁగ పసిడి కీడన వచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ. |
96 |
|
| ఆ. |
అధికమైన యజ్ఞ మల్పుండు తాఁ జేసి
మొనసి శాస్త్ర మనుచు మురువు దక్కు
దొబ్బ నేర్చుకుక్క దుత్తల మోచునా
విశ్వదాభిరామ వినర వేమ. |
97 |
|
| ఆ. |
శాంతమానసమునఁ జల్లనై శీతల
భాతి నున్నవాఁడు పరమయోగి
యట్టివాఁడు ముక్తి నతివేగఁ గైకొను
విశ్వదాభిరామ వినర వేమ. |
98 |
|
| ఆ. |
కనకమేడల మంచి కాంతలయెడలను
వలఁచియుందు రెంతవారలైన
తోయజాక్షిఁ బాయుదొర లెవ్వరును లేరు
విశ్వదాభిరామ వినర వేమ. |
99 |
|
| ఆ. |
మధురసములు గోరి మక్షికంబులు చేరి
చొచ్చి వెడలలేక చచ్చున్నట్లు
మునిగిఁ వెడల లేఁడు మోహంబు రాశిలో
విశ్వదాభిరామ వినర వేమ. |
100 |
|