శతకములు వేమన పద్యములు ప్రథమాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. ఉత్తమోత్తముండు తత్వజ్ఞుఁ డిలమీద
మహిమఁజూపువాఁడు మధ్యముండు
వేషధారి యుదరపోషకుఁడధముండు
విశ్వదాభిరామ వినర వేమ.
101
ఆ. హృదయమందు నున్నయీశుని దెలియక
శిలలనెల్ల మ్రొక్కుజీవులార
శిలల నేమియుండు జీవులందే కాక
విశ్వదాభిరామ వినర వేమ.
102
ఆ. గంగగోవుపాలు గరిటెడైనను జాలు
కడివెడైననేమి ఖరముపాలు
భక్తిగలుగుకూడు పట్టెడైనను జాలు
విశ్వదాభిరామ వినర వేమ.
103
ఆ. బండమీఁద చెలమ పాటించిత్రవ్విన
నలయి కెక్కుడౌను నాశలేదు
గుంటపట్టు చెలమ కులముద్ధరించురా
విశ్వదాభిరామ వినర వేమ.
104
ఆ. కాకిగూటిలోన కోకిల మున్నట్లు
భ్రమర మగుచుపురుగు బ్రతికినట్లు
గురుని గొల్చువెనుక గురువు తా నౌనయా
విశ్వదాభిరామ వినర వేమ.
105
ఆ. మాట దిద్దవచ్చు మఱియెగ్గు లేకుండ
దిద్దవచ్చు ఱాతిఁదిన్నగాను
మనసు దిద్దరాదు మహి నెంతవారికి
విశ్వదాభిరామ వినర వేమ.
106
ఆ. మనసునందు ముక్తిమలయుచు నుండంగ
మనసు లెఱుఁగలేక మనుజులెల్ల
మనసు నంటలేక మాయమై పోదురు
విశ్వదాభిరామ వినర వేమ.
107
ఆ. మనసు ముక్తియనుచు మది నెఱుంగఁగలేరు
మనసుచేతఁ దగిలి మాయమైరి
మనసు తానయైన మర్మజ్ఞుడగు యోగి
విశ్వదాభిరామ వినర వేమ.
108
ఆ. మదినెఱిఁగినవాని మహిఁగాన నెందును
మది నెఱుంగువాఁడు మహిని నరుఁడు
వెదకి తనువులోన వేడ్కతో నినుఁజూచు
విశ్వదాభిరామ వినర వేమ.
109
ఆ. బ్రహ్మమును నెఱుఁగవు భావమందుండిన
తనువు గుడిగఁ జేసి తన్ను నిలిపి
లోకబుద్ధివిడిచి లోఁజూపు చూడరా
విశ్వదాభిరామ వినర వేమ.
110
ఆ. నిన్నుఁజూచుచుండ నిండును దత్వంబు
తన్నుఁ జూచుచుండఁ దగులు మాయ
నిన్ను నెఱిఁగినపుడె తన్నుఁదా నెఱుఁగును
విశ్వదాభిరామ వినర వేమ.
111
ఆ. గాలి గాలి గలసె గగనంబు గగనంబు
మన్ను మన్ను గలసె మంట మంట
నీరు నీటఁ గలసె నిర్మలంబయి యుండె
విశ్వదాభిరామ వినర వేమ.
112
ఆ. వెదక వెదకఁ దొఱకు వేదాంతవేద్యుండు
వెదకువానిఁ దాను వెదకుచుండు
వెదకనేర్చునట్టి వెరవరుల్‌ గలరొకో
విశ్వదాభిరామ వినర వేమ.
113
క. తను వలచినఁదా వలచును
దను వలవక యున్నఁదన్ను దా వలవడిల\న్‌
దనదు పటాటోపంబులు
తనమాయలు పనికిరావు ధరలో వేమా.
114
ఆ. స్వానుభూతిలేక శాస్త్రవాసనలచే
సంశయంబు చెడదు సాధకునకుఁ
జిత్రదీపమునకు జీఁకటి చెడనట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
115
క. శాంతమున సకలకార్యము
సంతోషంబునను బొందు సత్యము జయమౌ
పంతము చెల్లును ధర్మజుఁ
డెంతేసి ప్రయాసముల జయించెను వేమా.
116
ఆ. ఉర్విజనులు పరమయోగీశ్వరునిఁ జూచి
తెగడువారె గాని తెలియలేరు
అమృతస్వాదురుచులహస్త మేమెఱుఁగును
విశ్వదాభిరామ వినర వేమ.
117
ఆ. పురుషుఁడెన్నిగతులఁబుట్టువు మొదలుగఁ
బాపచింతఁజేయు జాపలమున
మహిని కుంటినక్క మాంసముదిన్నట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
118
ఆ. అంకి లెఱిఁగి మాట లాడనేర్చినపుడె
పిన్న పెద్దతనము లెన్నలేల
పిన్న చేతిదివ్వె పెద్దగా వెలుఁగదా
విశ్వదాభిరామ వినర వేమ.
119
ఆ. మొదటఁ బోయునీవు మొగిబీజముల కెక్కి
మొదటి కుఱుకువేగ మొలక లెత్తు
మొలక పృథివిఁ బెరిగి వెలయును వృక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ.
120
ఆ. మగనికాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖముఁ బొందు
కలిమి లేములెందుఁ గలవెంతవారికి
బలిమి పుత్రబలిమె బలిమి వేమ.
121
ఆ. ఆఱురుచులు వేఱు సారంబు నొక్కటి
సత్యనిష్ఠ వేఱు సత్యమొకటి
పరమఋషులు వేఱు భావ్యుఁ డొక్కండురా
విశ్వదాభిరామ వినర వేమ.
122
ఆ. తారకంబుఁ జూచుదారి వేఱుగఁగల్గు
సమముగాను జూడఁ జక్కఁబడును
వెఱ్ఱిగాను జూడ వెలుగెల్ల బాఱురా
విశ్వదాభిరామ వినర వేమ.
123
ఆ. సజ్జనముల చెలిమి చాలింపఁగా రాదు
ప్రకృతి నెఱుఁగకున్న భక్తిలేదు
పలువ లెట్టిరీతి భక్తి సల్పుదురయా
విశ్వదాభిరామ వినర వేమ.
124
ఆ. ఇట్టికనుల బ్రహ్మ మెట్లు చూడఁగవచ్చుఁ
జూచుకనులువేఱు చూపువేఱు
చూపులోనమరిచి చూడంగవలవదా
విశ్వదాభిరామ వినర వేమ.
125
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )