శతకములు వేమన పద్యములు ప్రథమాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. మ్రానులోన నగ్ని మఱియుండఁగా వచ్చు
నగ్ని నుండ మ్రాను కలవిగాదు
మ్రానులోనియగ్ని మర్యాద సంసారి
విశ్వదాభిరామ వినర వేమ.
226
ఆ. మేఘ మడ్డమయిన మిహిరుని జెఱచును
జిత్తమడ్డమయిన స్థిరముఁ జెఱచు
పఱుపు లడ్డమైన మఱిముక్తి జెఱచురా
విశ్వదాభిరామ వినర వేమ.
227
ఆ. దోసముల్లువంటి తుర్యమం దాత్మను
జూచి యాసలనటుతోచివేసి
వాసనను దెలిసినవాఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ.
228
ఆ. వెదకి కానలేఁడు వేదాంతవేద్యుని
తత్వవేత్తలేఁడు ధరణిలోనఁ
గలిగెనేని యతఁడు కనఁబోఁడు మఱివేఱె
విశ్వదాభిరామ వినర వేమ.
229
క. విషయములఁ బొరలి రోయక
విషమంటినగతిని జూచి విముఖత ధరలో
విష సమమాయా సుఖముల
విషయముల\న్‌ గూడకుండ్రు వేత్తలు వేమా.
230
ఆ. వాక్కునందు గురువు వాక్తత్వము గురువు
చీఁకటింట గురువు చిక్కియుండు
అఖిలమునకు గురువె యాధార మయియుండు
విశ్వదాభిరామ వినర వేమ.
231
క. కర్మాకర్మము లొక్కటి
కర్మవినోదునకు దత్వఘనునకు దెలియు\న్‌
ధర్మాధర్మము లేర్పడ
నిర్మలమతి తెలుపవలయు నిజముగ వేమా.
232
ఆ. ఈషణత్రయంబు నెడపంగ నేరక
మోహనరాశిలోన మునిఁగియుండు
జనుల కెట్టు మోక్షసౌఖ్యంబు గల్గును
విశ్వదాభిరామ వినర వేమ.
233
ఆ. ఎఱుకమాలి జీవి యెంతకాలంబుండి
చచ్చిపుట్టుచుండు సహజముగను
ఎఱుకమఱచుచోటు నెఱుగుట బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ.
234
క. సద్గురు కృపజ్ఞానంబున
సద్గతి దీపించుచున్న చాలగు చదువుల్‌
సద్గతిఁ గలుగంజేసెడి
సద్గురువే దైవమనుచుఁ జాటర వేమా.
235
ఆ. సిగ్గు విడువకున్న శివసౌఖ్యమేలేదు
తగ్గ మొగ్గకున్న సిగ్గు విడదు
సిగ్గు విడుచువాఁడు చిరకాల జీవిరా
విశ్వదాభిరామ వినర వేమ.
236
క. అమ్మసుమీ యా లనఁగా
నమ్మనఁగా నాలు సుమ్మియాయిద్దరిని\న్‌
ఇమ్మహిలోఁ బరమాత్ముని
నెమ్మదిలోఁ దెలియఁ దానె నేర్పరి వేమా.
237
ఆ. ఆశ విడక గాని పాశముక్తుఁడు గాఁడు
ముక్తుఁడయినఁగాని మునియుఁగాఁడు
మునికిఁగాని సర్వమోహంబు లూడవు
విశ్వదాభిరామ వినర వేమ.
238
ఆ. ఆత్మలోన నాద మాలించి మాలించి
యాసలందుఁ జిక్కఁ డాదియోగి
ఆత్మలోనికళల నంటినఁ దత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ.
239
ఆ. మానసంబు మంచిమల్లెపూవులచవికె
బావితోఁటచేసి బాలఁగూడి
భోగినయ్యెద ననఁ బోయెపో కాలంబు
విశ్వదాభిరామ వినర వేమ.
240
ఆ. సొమ్ములున్నచోటు శోధింపఁగలుగును
సొమ్ములేనిచోట శోధనేల
యంజనంబులేక యా సొమ్ము తెలియదు
విశ్వదాభిరామ వినర వేమ.
241
ఆ. నిజము కల్ల నెఱిఁగి నిత్యుండు గాఁడాయె
పలుకులోన బిందు పదిలపఱచి
వేడుకైన బిందు వెదఁబెట్టకుండదు
విశ్వదాభిరామ వినర వేమ.
242
ఆ. అగ్ని శిఖలయందు నమరంగ మమకార
మభవుమీఁద ధ్యాన మమర నునిచి
యాహుతి యగువెనుక హరున కర్పితమౌను
విశ్వదాభిరామ వినర వేమ.
243
క. మ్రాకున ననలము పుట్టును
మ్రాకెదుగును ననలమునకు మనుజునిలోన\న్‌
మ్రాకుననలముల క్రియఁ జీ
జా కుడి నయోగి నెవరు గానరు వేమా.
244
క. అండములో నాకాశం
బుండంగాఁ జూడఁజూడ నొనరుఁగ దీనిపై
యుండును నన్నియుఁ దెలిసిన
మెండుగ నెటుచూచి చన్నమేలగు వేమా.
245
ఆ. బ్రహ్మగుడ్డు ననెడిపట్టణంబులోపల
బ్రహ్మ మెఱుగలేని బాపఁడేల
తనమనంబు దెలియఁ దానెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ.
246
ఆ. గురువు సెప్పువిద్య గురువునకును దెలియు
గురువుసెప్పు విద్య గురునయెఱుఁగు
గురువుమహిమ పరమగురునకుఁదెలియును
విశ్వదాభిరామ వినర వేమ.
247
ఆ. మనసులోనఁ దెలిసి మనసులోనే కలిసి
మనసులోనివాని మరలఁదిగిచి
మనసునిల్పువాఁడు మర్మజ్ఞుఁడగు యోగి
విశ్వదాభిరామ వినర వేమ.
248
ఆ. తానె తత్వమనుచు తన్నెఱుంగక లేక
మాయతత్వమనుచు మఱుగుచుండు
ధర్మకర్మములను తగరోయ దత్వమౌ
విశ్వదాభిరామ వినర వేమ.
249
క. నిరతం బెడతెగ కుండక
బరిపూర్ణ బ్రహ్మ మాత్మపదమున నుండ\న్‌
నిరవద్యమయిన యడవిని
జరియించును జగమెఱుంగ సత్యము వేమా.
250
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )