| ఆ. |
దూలములనుబోలు దురవస్థలనునెల్ల
రోసి యాసలన్ని గోసివేసి
వాసనను దెలిసినవాఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
126 |
|
| ఆ. |
మన్నును దినమన్న మండేరు జనులార
మంటిలోనిమేలు మఱువనేల
నీళ్లలోనిమేలు నిఖిలమై యుండురా
విశ్వదాభిరామ వినర వేమ. |
127 |
|
| ఆ. |
జీవమేడ నుండు భావమెక్కడ నుండు
కాఁపురంబు లేడఁ గదిసియుండుఁ
దనరుచున్న రెండిస్థల మేల తెలియరు
విశ్వదాభిరామ వినర వేమ. |
128 |
|
| ఆ. |
ధనము గూడఁబెట్టి ధర్మంబు సేయక
తాను దినకలెస్స దాచుగాఁక
తేనె నీఁగె కూర్చి తెరువర్ల కియ్యదా
విశ్వదాభిరామ వినర వేమ. |
129 |
|
| క. |
ఇచ్చెడి వారలసంపద
హెచ్చునదేకాని లేమి యేలా కలుగున్
అచ్చెలమ నీళ్లుచల్లిన
విచ్చలవిడి నూరుచుండు వినరా వేమా |
130 |
|
| ఆ. |
పాలఁగలయు నీరు పాలెయై రాజిల్లు
నదియు పానయోగ్య మయినయట్లు
సాధుసజ్జనముల సాంగత్యములచేత
మూఢజనుఁడు ముక్తి మొనయు వేమ |
131 |
|
| ఆ. |
చెడినమానవులను చేపట్టి రక్షించి
కడకుఁ జేర్చినట్టి ఘనులు దలఁప
కడగి పుణ్యమైనగల శివుసన్నిధి
నెడతెగకయునుందు రెపుడు వేమ |
132 |
|
| ఆ. |
ఒకరి నోరుఁగొట్టి యొకరు భక్షింతురు
వారినోరు మిత్తి వరుసఁగొట్టు
చేఁపపిండు పిల్ల చేఁపలఁ జంపును
జనుఁడు చేఁపపిండుఁ జంపు వేమ |
133 |
|
| ఆ. |
కన్నుపోవువాఁడు కాళ్లుపోయినవాఁడు
నుభయులరయఁ గూడి యుండునట్లు
పేద పేదఁగూడి పెనగొని యుండును
విశ్వదాభిరామ వినర వేమ. |
134 |
|
| ఆ. |
పరగ రాతిగుండు పగులఁగొట్టఁగ వచ్చుఁ
గొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరగింప రాదయా
విశ్వదాభిరామ వినర వేమ. |
135 |
|
| ఆ. |
అంత కొఱత దీఱి అతిశయకాముఁడై
నిన్ను నమ్మిచాల నిష్ఠతోడ
నిన్నుఁగొల్వ ముక్తి నిశ్చయముగఁ గల్గు
విశ్వదాభిరామ వినర వేమ. |
136 |
|
| ఆ. |
తత్వము తిరమైన తావుల వెదకుచుఁ
దాను తత్వమగును తత్త్వయోగి
తలఁపులన్ని యుడుగఁ దానెపో తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
137 |
|
| ఆ. |
మాటలాడవేఱె మనసుకొలఁదియువేఱె
యొడలగుణమువేఱె యోజనవేఱె
యెట్లుగల్గు ముక్తి యేలాగు తనలాగు
విశ్వదాభిరామ వినర వేమ. |
138 |
|
| ఆ. |
వెలఁది చక్కఁదనము వెరపైన యీడును
విభుని కరుణలేక వితగనుండు
నీదుకరుణలేక నేర్పులు కొఱగావు
విశ్వదాభిరామ వినర వేమ. |
139 |
|
| ఆ. |
ఎంతకష్ట ముండు నంత పాపపుఁజింత
చింతచేత మిగులఁ జివుకు మనసు
చింతలేకయున్న చెడనిసంపదఁజూచు
విశ్వదాభిరామ వినర వేమ. |
140 |
|
| క. |
ఎన్నాళ్ళకుఁ దానుండును
ఎన్నాళ్లను దాను నేర్చి యెన్నిటవెలయున్
కొన్నాళ్లకుఁ దాఁ జన్నను
మన్నేయగు విద్యలెల్ల మహిలో వేమా. |
141 |
|
| క. |
ధనమెచ్చిన మదమెచ్చును
మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చు\న్
ధనముడిగిన మదముడుగును
మదముడిగిన దుర్గుణంబు మానును వేమా. |
142 |
|
| క. |
వినవలె నెవ్వరు చెప్పిన
వినినంతనె తమకపడక వివరింపవలె\న్
విని కని వివరము దెలిసిన
మనుజుఁడెపో నీతిపరుడు మహిలో వేమా. |
143 |
|
| క. |
ఈకపట నాటకంబును
ఈకపటపుఁ జదువులన్ని యింపు దలిర్ప\న్
ఏకపటాత్ముఁడు సేసెనొ
యాకపటాత్మునకు మ్రొక్కి యలరుము వేమా. |
144 |
|
| ఆ. |
ఎండవేళఁ జీఁక టేకమైయున్నట్లు
నిండుకుండ నీరు నిలిచినట్లు
దండిగఁ బరమాత్మ తత్వంబు దెలియరా
విశ్వదాభిరామ వినర వేమ. |
145 |
|
| క. |
ఎండినమ్రా నొక టడవిని
నుండిన నందగ్నిపుట్టి యూడ్చును చెట్ల\న్
దండిగలవంశ మెల్లను
చండాలుం డొకఁడుపుట్టి చెఱుచును వేమా. |
146 |
|
| ఆ. |
శిష్యవర్గమునకు శివుఁ జూపనేరక
కానిమతములోని గలుగునట్టి
గురునియెఱుక నరయ గ్రుడ్డెద్దు చేనురా
విశ్వదాభిరామ వినర వేమ. |
147 |
|
| ఆ. |
ఇంటిలోనిధనము నిదినాది యనుచును
మంటిలోనఁదాచు మంకుజీవి
కొంచఁబోడు వెంట గుల్లకాసును రాదు
విశ్వదాభిరామ వినర వేమ. |
148 |
|
| ఆ. |
దేశవేషములను తేటసేయక దేవుఁ
డాత్మలోన నుండ ననగిపెనగి
వేషమరసిచూడ గ్రాసంబు కొఱకయా
విశ్వదాభిరామ వినర వేమ. |
149 |
|
| ఆ. |
మిఱపగింజఁ జూడ మీఁద నల్లగనుండుఁ
గొఱికిచూడలోన చుఱుకుమనును
సజ్జను లగువారి సారమిట్టుల నుండు
విశ్వదాభిరామ వినర వేమ. |
150 |
|