| ఆ. |
ఉన్న సరికి మనుజుఁ డుపకారి గాలేక
కన్నుగనక పల్కుగర్వములను
దీనులయినవారి దిగువారిగాఁజూచి
పరము గనకనూత బడును వేమ. |
126 |
|
| ఆ. |
రోగియైనవాఁడు రోగి నెఱుంగును
రోగి నరసిచూచి రూఢిగాను
రోగి కిడినవానిరాగి బంగా రౌను
విశ్వదాభిరామ వినర వేమ. |
127 |
|
| ఆ. |
ఎదుటితనబలంబు లెంచుకోనేరక
డీకొని చలమున నెదిర్చెనేని
యెలుగు పందిసేత కేర్పడు చందంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
128 |
|
| ఆ. |
ఓగుబాగెఱుఁగని యుత్తమూఢజనంబు
లిలను ధీ జనముల నెంచుటెల్ల
కరినిజూచి కుక్క మొఱిగిన సామ్యమౌ
విశ్వదాభిరామ వినర వేమ. |
129 |
|
| ఆ. |
నేరనిజనులకును నేర్పు నేరము లెల్లఁ
జక్కఁజేయరిల నసాధుజనము
లొప్పుదుర్జనులను తప్పుగనెంతురు
విశ్వదాభిరామ వినర వేమ. |
130 |
|
| ఆ. |
దిక్కులేనిరోఁత దీనతఁ బాపిన
పురుషుఁడిహమునందు పూజ్యుఁడగును
పరమునందు వాని భాగ్య మేమనవచ్చు
విశ్వదాభిరామ వినర వేమ. |
131 |
|
| ఆ. |
పలుగువాని కేల పరసమృద్ధి దలంప
పలుగువాని కేల భక్తిపదము
పలుగువాని కేల పరమార్థ తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
132 |
|
| ఆ. |
తండ్రిసొమ్మునైన దాయాదిసొమ్మైనఁ
బరులసొమ్మునయినఁ బ్రాప్తధనము
దయను దీనులకును దాన మిచ్చినవాఁడె
బహుళపుణ్యజనుఁడు పరఁగ వేమ. |
133 |
|
| ఆ. |
తనదుసొమ్ముఁజూడ దాన మియ్యగవచ్చు
నవని దొడ్డగాద దెవరికైన
నదురు బెదురు లేక యన్యులసొమ్ముల
దానమిచ్చువాఁడు దాత వేమ. |
134 |
|
| ఆ. |
ధైర్యయుతుని కితరధనమైన నదురేమి
దాన మిచ్చునపుడె తనకుఁదక్కె
నెలమి మించుపనికినెవ రేమిసేయుదు
రడుగుదప్ప తప్పు పిడుగు వేమ. |
135 |
|
| ఆ. |
ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన
నటననైన సాహసముననైన
సంపదధికునుండి సాధించి ధనమును
బడుగు కిచ్చి బాగుపడును వేమ. |
136 |
|
| ఆ. |
నరుఁడటు పరమాత్మ గురుని జేరునపుడు
హస్తమందె మోక్ష మపుడె చూపు
విఱివిసంపదలను విఱ్ఱవీగినజీవి
పర మెఱుఁగక యమునిపాలు వేమ. |
137 |
|
| ఆ. |
బిడ్డలను సతులను వేఱైనచుట్టాల
సంపదల తనువులఁ జాలనమ్మి
సంతసిల్లుచుండు క్షణభంగురము లన్ని
దెలియ నేరఁడేమి దెల్ప వేమ. |
138 |
|
| ఆ. |
ఉచితవంతుఁడైన నుద్యోగపరుఁడైన
సాగుబాటునున్న సమయమునను
పరుల కుపకరించి పరఁగ రక్షించును
విశ్వదాభిరామ వినర వేమ. |
139 |
|
| ఆ. |
పట్టువస్త్రములను పరఁగ భూషణములు
కుదువ లిడుటలెల్ల గొదువవద్దు
లనుభవింపఁగూడఁ డతఁడెంతవాఁడైన
విశ్వదాభిరామ వినర వేమ. |
140 |
|
| క. |
వినియుండెడి జనమెల్లను
చనిపోయినవారి పుణ్యసత్కథ లెలమి\న్
వినవలెఁ గనవలె ననవలె
ననిమిషునకునైనఁ దెలియ దంత్యము వేమ. |
141 |
|
| ఆ. |
పచ్చఁజూచువారు పచ్చ మెచ్చెడివారు
పచ్చబడెడువారు చెడ్డవారు
పచ్చ విడుచువాని ప్రభువుఁగా జూతురు
విశ్వదాభిరామ వినర వేమ. |
142 |
|
| ఆ. |
ప్రస్తుతించువేళ బద్యంబుఁ జదివినఁ
దప్పుదగిలియున్న నొప్పియుండు
వెలఁది సురతవేళ బిత్తరై యొప్పదా
విశ్వదాభిరామ వినర వేమ. |
143 |
|
| ఆ. |
బంగరుఁ బొడఁగన్న భామలఁ బొడఁగన్న
చిత్తమునను చింత సేయఁడేని
వాఁడె పరమయోగి వర్ణింప జంగమందు
విశ్వదాభిరామ వినర వేమ. |
144 |
|
| క. |
పతియొప్పిన సతి యొప్పును
సతిపతు లొకటైనఁ బరమపావన మందూ
స్సతిపతిన్యాయమె మోక్షం
బతులితపరమాత్మ నైక్య మగురా వేమ. |
145 |
|
| క. |
ఆకాశంబున వాయువు
మ్రాకునదావాగ్ని యటుల మానసమందు\న్
ఏకాకారుఁడు జగమున
జోకైతనుదానె వెల్గు సుమ్ముర వేమ. |
146 |
|
| ఆ. |
కండకావరమునఁ గానఁడు మరణంబు
మదముచేతఁ దత్వమహిమఁ గనఁడు
భోగవాంఛచేతఁ బుణ్యంబుఁ గానఁడు
విశ్వదాభిరామ వినర వేమ. |
147 |
|
| ఆ. |
తెలుపు మాపుచేసి దిట్టతనంబునఁ
దెలుపు భస్మముగను దేటపఱుచు
విధముకన్నఁ బరుసవేదియు లేదురా
విశ్వదాభిరామ వినర వేమ. |
148 |
|
| ఆ. |
దుండగీడు కొడుకు కొండీడు చెలికాఁడు
బండరాజునకును బడుగుమంత్రి
కొండముచ్చునకును గోఁతియు సరియౌను
విశ్వదాభిరామ వినర వేమ. |
149 |
|
| ఆ. |
పుట్టుదుఃఖమునను పొరలుదుఃఖమునను
గిట్టుదుఃఖమునను క్రిం దగుదురు
మనుజదుఃఖమువలె మఱిలేదు దుఃఖంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
150 |
|