శతకములు వేమన పద్యములు ప్రథమాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. తఱచుచీఁకటి విడి తఱితోడఁ దనుమఱచి
పరమునందు మనసుఁ బదిలపఱచి
గరిమయున్నయట్టి ఘనుఁడెందు లేదురా
విశ్వదాభిరామ వినర వేమ.
251
ఆ. త్రాడుపామతంచుఁ దాఁజూచి భయపడి
తెలిసి త్రాడటన్నఁ దీఱు భయము
భయము దీఱినపుడె బ్రహ్మంబు నంగురా
విశ్వదాభిరామ వినర వేమ.
252
ఆ. చూచువారికెల్లఁ జూడ వేఱైయుండు
చూపుఁజూచి దెలియఁ జూచువారు
చూచి తాముచూపుచూపె తామగుదురు
విశ్వదాభిరామ వినర వేమ.
253
క. దేహియు జ్ఞానానలమున
దాహంబై దేహ మెల్లఁ దల్లడపడ నా
దేహములోఁ బొర్లాడుచు
మోహమడచి శివునిఁ జూడ ముక్తిర వేమా.
254
ఆ. ధ్యానివలెనె యుండు మౌనివలనె యుండు
భోగివలెనె యుండు రోగివలెనె
సకలము దెలిసినను సర్వజ్ఞుఁడై యుండు
బరమయోగివలెనె పరగ వేమా.
255
ఆ. ఉండడె సుఖశీలి యుండును గొన్నాళ్లు
యుండి యుండి యుండి యుండలేక
ఉండ వెరవు దెలిసి గండిదొంగను బట్టి
చెండిచెండి తావుచేరు వేమా.
256
ఆ. తరువున నెడియింటఁ దనశత్రుమిత్రులఁ
దెలియ లేనివాని తెలివదేల
తెలిసిన మనుజునకు దివ్యామృతమ్మురా
విశ్వదాభిరామ వినర వేమ.
257
ఆ. నది నుదకంబులు చనుక్రియ
మది నొదవెడు తత్వబుద్ధిమగ్నత లెల్లం
దుది పదవి గలయ ఘనుఁడగు
మదధిఁ బ్రవేశించి గంగ యొప్పున వేమా.
258
ఆ. మనసుఁ బాఱవీడి మనసుఁ దా మగుడించి
మనసులోనఁగలుగు మర్మమెఱిగి
మనసు తాను నిల్ప మఱియుఁదా బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ.
259
క. దేహాభిమాన ముండఁగ
మోహాదులు జననవార్ధిముంచును కలగా
నీహా విషయభావన
కూహాదులు పోవు మేలుకొన్నను వేమా.
260
ఆ. మర్మమంతగొనకు మనసైన్యమేగాన
పరరహస్య మంత బయలుపడదు
పడినమనస దెన్న బయలుపడినరీతి
విశ్వదాభిరామ వినర వేమ.
261
క. ఈతనువునందుఁ జూచిన
నేతనువుల కింతె యనుచు నెఱిగియుఁ దన్నుఁ
జూతురు నాలోఁ జూపున
నాతురమునఁ దపసులెల్ల నమరఁగ వేమా.
262
ఆ. గురుని పరమగురుని గుఱుతుగాఁ దెలియక
గురువుగాను నుండు గ్రుడ్డిరీతి
గురువుకు గురువైన గురుఁడు ప్రాణేశుండు
విశ్వదాభిరామ వినర వేమ.
263
సీ. నియమాది సంగుఁడై నిలిచినఁ దత్వంబు - తామసంబగుఁ నిద్రఁ దలఁగఁజేయు
నిద్ర తలంగిన నిర్భీతినొందించు - శమమున నానంద సమితి పుట్టు
నానందమున విశ్వమంతయుఁ దానగుఁ - దాను విశ్వంబయినఁ దత్వమగును
తత్వ మింద్రియ పంచతత్వంబునను - నిల్చుఁ దత్వంబు నిలిచినఁ దానయగును
 
గీ. రాజయోగీంద్రుఁ డాతఁడై తేజరిల్లు
వెలయ జగముల విహరించు విశ్రుతముగ
బాలు విధమున వృద్ధుని పగిదిసోకు
కరణివెంగలిక్రియ చూడ ఘనత వేమా.
264
క. మనసున నెఱుకను మరుపునఁ
గని విని చూడంగలేరు కదిసినపిదప\న్‌
పెనగొని పట్టినచోనది
మనచోటను మాయమౌను మహిలో వేమా.
265
ఆ. మాయ నరకమనుచు మాయ రోయకసాటి
సమముగ నరదేవసభలయందు
నందఱు ఘనులయిన హరునకుఁ దావేది
విశ్వదాభిరామ వినర వేమ.
266
ఆ. బ్రతుకులెల్ల మాయ భవబంధములు మాయ
తెలివి మాయ తన్నుఁ దెలియ మాయ
మాయ దెలియువాఁడు మర్మజ్ఞుఁడగు యోగి
విశ్వదాభిరామ వినర వేమ.
267
ఆ. మాయలోక మన్న మర్మంబు దెలియక
మాయఁజిక్కి యంత మాయఁబడిరి
మాయ దెలియ దివ్వె మాయదా జన్మంబు
విశ్వదాభిరామ వినర వేమ.
268
ఆ. సతులు సుతులు మాయ సంసారములు మాయ
ధనము ఘనము మాయ తనువు మాయ
మాయ గెల్చువాఁడు మర్మజ్ఞుఁడగు యోగి
విశ్వదాభిరామ వినర వేమ.
269
ఆ. మాయలోనఁ బుట్టి మాయలోననె పెరిగి
మాయఁ దెలియలేని మనుజుఁడేల
మాయఁ దెలియువాఁడు మహిమీఁద ధన్యుండు
విశ్వదాభిరామ వినర వేమ.
270
క. మాయల సంసారమునకు
మాయలనే తిరుగుచుండు మనుజుఁడులోనై
మాయలఁ దెలిసిన యంతట
మాయలనే ముక్తి గలుగు మహిలో వేమా.
271
ఆ. సుప్తి జాగరముల సొలపులఁ దానుండి
కప్పుకొన్న మాయఁ గానలేక
దబ్బర నిజములను తానులెస్స గనక
గొబ్బున చెడిపోవు గుణము వేమా.
272
ఆ. మాయరూపు రూపు మాయ తాఁజేసియు
మాయరూపులఁ బెనుమాయఁజేసి
మాయలోని మాయమహిమ నెఱుంగురా
విశ్వదాభిరామ వినర వేమ.
273
ఆ. ముఱికికొంపలోన నిఱికించి జీవుని
కర్మపాశములను గట్టివేసి
నిట్టికర్మజీవి కెట్లొకో మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ.
274
ఆ. విత్తులేని వృక్షమొక్కటి పుట్టె
ఫలము లేని పువ్వు మొదలు పత్రిలేదు
స్వాదులేదు చూడ నాపాటుకును లెస్స
దీనిభావ మేమి తెలుపు వేమా.
275
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )