శతకములు వేమన పద్యములు ప్రథమాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. మూఁడులోకములను మొనసి యొక్కటిఁజేసి
యారులోకములను నట్లగూర్చి
స్థిరముగాను నుండు శివమూర్తి గురుఁడయా
విశ్వదాభిరామ వినర వేమ.
326
ఆ. ఆసనం బెఱుంగక యామర్మకర్మంబు
గురువుచేతఁ దెలిసి కూర్పకున్న
మనసు నిలుపకున్న మఱిద్విజుం డెట్లగు
విశ్వదాభిరామ వినర వేమ.
327
ఆ. బ్రహ్మగ్రుడ్డు మేను ప్రాణమన్నది గాలి
కనులు చంద్రరవులు గారవింప
నింతకంటె బ్రహ్మ మెక్కడనున్నది
విశ్వదాభిరామ వినర వేమ.
328
ఆ. వాయువందె పుట్టి వాయువందె పెఱిగి
వాయువందు మేలు వరుసఁ దెలియ
వాయువందు ప్రాణవాయువు తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ.
329
ఆ. దానములలో నన్నదానము దొడ్డది
గానములను సామగాన మెచ్చు
ధ్యానములను శివునిధ్యానము శ్రేష్ఠము
విశ్వదాభిరామ వినర వేమ.
330
ఆ. తలపులోని తలఁపు దలఁపోసి తెలియకా
తలఁపులెల్ల విడిచి తగినభంగి
తలఁపులోనితలఁపె తత్వంబు నాత్మరా
విశ్వదాభిరామ వినర వేమ.
331
ఆ. తాను సకలమైనఁ దనలోన సకలంబు
తనదులోని వెలుఁగు తానెఱింగి
యున్నమానవునకు నొనరంగ ముక్తిరా
విశ్వదాభిరామ వినర వేమ.
332
ఆ. సర్వ మొకటిఁ జూడ సమకూరును ధ్రువంబు
రెప్పవేయఁబోక రేయిఁబగలు
పగలులోని పగలు పరమాత్మ చూడరా
విశ్వదాభిరామ వినర వేమ.
333
ఆ. రూపడఁగక జీవరూపంబుఁ గనరాదు
నట్టిరూప మడగ నలవిగాదు
బ్రహ్మ మడఁగకున్న బ్రహ్మంబుఁ గనఁరాదు
విశ్వదాభిరామ వినర వేమ.
334
క. భయమంతయు దేహముదే
భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునిదే
లయమంతయు దేహముదే
జయమంతయు జీవుఁడనుచుఁ జాటర వేమా.
335
ఆ. ఏకమయినవర్ణ మెఱిఁగినయోగికిఁ
బరము నెఱిఁగిచూడ భావమొందు
నాకృతులును మఱియునన్నిటఁ దానౌను
విశ్వదాభిరామ వినర వేమ.
336
క. తాను దప్పకుండ తనమనంబు నిల్పి
తావుఁ జేరునట్ల తంత్రపఱచి
తాను తావుఁ జేరి తావుఁదానేకమై
తాను దాన యగుచుఁడనరు వేమా.
337
. ----
----
----
----
338
ఆ. భూమిలోనఁ బుట్టు భూభార మెల్లను
తనువులోనఁ బుట్టు దత్వమెల్ల
శ్రమములోనఁ బుట్టు సర్వంబుఁ దానౌను
విశ్వదాభిరామ వినర వేమ.
339
ఆ. కాయముఁదగఁ గూడి కడఁగి యోగిగనున్న
కాయ ముండికాని ఘనుఁడు గాఁడు
కాయమునను ముక్తిగతి కేగవలెనయా
విశ్వదాభిరామ వినర వేమ.
340
ఆ. ఆది నొకటి దెలిసియాదిని మదినిల్పి
యాదిఁబాయకున్న నభవుఁ డవును
ఆదిఁ బాయువాఁడు నంధకు రీతిరా
విశ్వదాభిరామ వినర వేమ.
341
ఆ. అందు నిందుననక యన్నిటఁ బరికించి
విష్ణు వరయుచుండు విదితముగను
చక్రి తిరుగు భూమిచక్రంబులోపల
విశ్వదాభిరామ వినర వేమ.
342
ఆ. ఆకృతి యనఁగను నిరాకృతి యనఁదగు
నాకృతి నొగిఁదగు నిరాకృతిట్టు
లవియు రెండు లే యపురూపమై యుండు
విశ్వదాభిరామ వినర వేమ.
343
ఆ. లోను చూడఁజూడ లోకాభిరామంబు
బయలు చూడఁజూడ బంధనంబు
తన్నుఁజూడఁజూడ తారక బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ.
344
ఆ. తలఁపుచేతఁగల్గు తారక బ్రహ్మంబు
తలచిఁచూడఁదానె తత్వమగును
తలఁపులోనె తలఁపు తానె తానెఱిఁగిన
విశ్వదాభిరామ వినర వేమ.
345
క. కమలభవాండం బెల్లను
విమలపుసుజ్ఞానులెల్ల నీక్షింతురయా
విమలంబౌ మనముదగ\న్‌
సుమహిత పిండాండ మెపుడు చూడర వేమా.
346
క. నరకులమునఁ దాఁబుట్టియు
నరకులమునఁ దాని బెరిగి నరుఁడయ్యును దా
నరకులమును ఛీ ఛీ యని
హరకులమునఁ దిరిగెనేని హరుఁడగు వేమా.
347
ఆ. ఎండయన తిరుగు నిర వెఱింగిన యోగి
యుండు నెల్లకాల ముర్విలోనఁ
దిండిపోతు వశమె తెలియంగ జ్ఞానంబు
విశ్వదాభిరామ వినర వేమ.
348
క. తనుసంరక్షణ కొఱకయి
మనమున కార్యములు మానుమను తత్వముచే
దినదినము తిరిగి తిరిగియు
తనువునఁ గనుగొన్న నాత్మ తత్వము వేమా.
349
ఆ. ఒక్కఘటములోనఁ బెక్కురూపులు నిల్చు
నెన్నియెన్నిరూపు లెసఁగుచుండు
నవియుఁదొలఁగెనేని యన్నియు బయలౌను
ఆత్మతత్వ మిట్టులౌర వేమా.
350
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )