శతకములు వేమన పద్యములు తృతీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. కాలు చేయి వంచి గాలి నిండఁగఁజేర్చి
నేలవ్రాలి కొన్ని నిలిచికొన్ని
యాసనముఖవిద్య లభ్యాస విద్యలు
విశ్వదాభిరామ వినర వేమ.
176
ఆ. కావిపంచె గట్టికడుయోగివలెనుండి
వెదకి కోర్కులెల్ల విడిచిపెట్టి
తొడరి తిరుగువాఁడు దొంగసన్యాసిరా
విశ్వదాభిరామ వినర వేమ.
177
ఆ. కలియుగమునఁ బుట్టి కడతేఱఁగా లేక
యొడలు బడలఁజేసి యుగ్రతపము
తపసు చేసియేమి తత్వంబుఁ గనలేరు
విశ్వదాభిరామ వినర వేమ.
178
ఆ. ఇల్లునాలివిడిచి యినుపకచ్చలఁ గట్టి
వంటకంబు నీరువాంఛ లుడిగి
యొంటినున్న యంత నొదవునా తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ.
179
ఆ. జీవలింగపూజఁ జేసినవారికి
శిలలరూపమందుఁ జింతయేల
చెలఁగి మధువు గ్రోలఁజేదు రుచించునా
విశ్వదాభిరామ వినర వేమ.
180
ఆ. శివుఁడు గలఁడటంచు శిలలకు మ్రొక్కెడి
వెఱ్ఱిజీవులార వెతల విడుడి
జీవులందె కాక శిలల నేమున్నది
విశ్వదాభిరామ వినర వేమ.
181
ఆ. రాతిప్రతిమ దెచ్చి రాజసంబుననుంచి
పూజసేయు నరుఁడు బుద్ధిమాలి
భావమందుఁ బరము భావించ నేరఁడు
విశ్వదాభిరామ వినర వేమ.
182
ఆ. జంగమాఖ్య భక్తి సంధివేఱుగలేదు
సగుణభావ మదియ శాస్త్ర విధియు
నిర్గుణంబు వీడు నెఱినేదియెఱుఁగఁడు
విశ్వదాభిరామ వినర వేమ.
183
ఆ. ఎంబెరుమతమని యెసఁగ మాంసము తిని
మారుపేరుఁ బెట్టి మధువు ద్రావి
వావివరుస దప్పి పలికి పాడౌదురు
విశ్వదాభిరామ వినర వేమ.
184
ఆ. జాతిమతము విడిచి చని యోగిగా మేలు
జాతితోనెయుండె నీతులెల్ల
మతముఁబట్టి జాతి మానకుంట కొఱంత
విశ్వదాభిరామ వినర వేమ.
185
ఆ. కట్టెపేరు లోలిగట్టి చెప్పఁగ రాదు
కానరాదు లోని కలిమితనము
జంగమయినపిదప జాతి నెంచరాదు
విశ్వదాభిరామ వినర వేమ.
186
ఆ. వేదవిద్యలెల్ల వేశ్యలవంటివి
భ్రమలపెట్టి తేటపడగ నీవు
గుప్తవిద్య యొకటె కులకాంతవంటిది
విశ్వదాభిరామ వినర వేమ.
187
ఆ. వేదశాస్త్రములను విని యేమి కుడిచిరి
యరిగితిరిగి సొత్తు రందఱిల్లు
బ్రహ్మమహిమఁ దెలిసి బ్రతుకుట నిజమయా
విశ్వదాభిరామ వినర వేమ.
188
ఆ. వ్రతము లెన్నియైన వట్టిచిక్కులె కాని
యాత్మచిక్కుఁ గాన నలవిగాదు
ఆత్మచిక్కుఁ బాపునతఁడెపో ఘనయోగి
విశ్వదాభిరామ వినర వేమ.
189
ఆ. జననమరణములకు సంధ్యత్రాడును లేదు
సంధ్యత్రాడునులేదు జనని కెపుడు
తల్లి శూద్రురాలు దానెట్లు బాగురా
విశ్వదాభిరామ వినర వేమ.
190
ఆ. ప్రేతయన్న మనుచుఁ బ్రీతితోఁ బిలిపించి
కాకులకును బెట్టు కర్ములార
కాకులందు నేమి ఘనులకుఁ బెట్టుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ.
191
ఆ. పిండములను జేసి పితరులఁదలపోసి
కాకులకును బెట్టు గాడ్దెలార
పెంటఁదినెడు కాకి పితరుఁ డెట్లాయెనో
విశ్వదాభిరామ వినర వేమ.
192
ఆ. నల్లబోడితలలు తెల్లనిగొంగళ్లు
ఒడల బూడ్దెపూత యొంటిరోఁత
యిట్టివేషములును పొట్టకోసము సుమీ
విశ్వదాభిరామ వినర వేమ.
193
ఆ. కంబళములఁ గట్టి గంటలు గజ్జలు
బోడితలలు కావి బొంతచిటికె
లాత్మదేవపూజ లవి సేయనేరవు
విశ్వదాభిరామ వినర వేమ.
194
ఆ. మానసంపురక్తి మసలక యాత్మలో
బోడితలల సొంపు పొల్పుమీఱ
కడుపుకొఱకుఁ దిరుగు కష్టంపుమతితోడ
విశ్వదాభిరామ వినర వేమ.
195
ఆ. పుస్తకములు జడలు పులితోలు బెత్తంబు
కక్షపాలలు పది లక్షలైన
మోత చేటు గాని మోక్షంబు లేదయా
విశ్వదాభిరామ వినర వేమ.
196
క. హృదయము పదిలంబైనను
గుదికొను సన్యాసమునకుఁ గొమ్మలు గలవా
యిదియెఱుఁగరు చదువరులటు
మది ముక్తికి నాస్పదంబు మహిలో వేమా.
197
ఆ. ఆసనములు పన్ని యంగంబు బిగియించి
యొడలు విఱుచుకొనెడి యోగమెల్ల
జెట్టిసాముకన్నఁ జింతాకు తక్కువ
విశ్వదాభిరామ వినర వేమ.
198
ఆ. కడుపు బోరగించి కన్నులు ముకుళించి
బిఱ్ఱబిగిసికొన్న బీదయోగి
యమునిబాఱిగొఱ్ఱె యతఁ డేమిసేయును
విశ్వదాభిరామ వినర వేమ.
199
క. రేచకపూరక కుంభక
సూచకములు రాజయోగి సుస్థిరమతియై
లోచూపుచూడనొల్లక
వాచాబ్రహ్మంబు పలుకవద్దుర వేమా.
200
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )