శతకములు వేమన పద్యములు ద్వితీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

క. తన కేనాఁడు సుభిక్షము
తన కేనాఁడును భంగంబు తనకుఁదనుజుఁడు\న్‌
తానున్నయట్టి దశకును
మనసున నిల చివుకుచుండు మనుజుఁడు వేమా.
301
ఆ. పెట్టిపోయ నొగిని విరుగుఁడు సౌఖ్యంబు
బలుచచ్చినగతి యదియుగాక
నుండు నాశివుండు నొగివానియందున
విశ్వదాభిరామ వినర వేమ.
302
ఆ. పొట్లకాయ రాయి పొడవు త్రాటను గట్ట
లీలతోడ వంక లేక పెరుఁగు
కుక్కతోఁక గట్టఁ జక్కఁగా వచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ.
303
క. నోరెఱిఁగి తాము నేమియు
నేరజంతువులఁ జంపి నెమ్మదిఁ దినునా
క్రూరపు సంకర జాతుల
మారణ మేమందు నింక మహిలో వేమా.
304
ఆ. వంటవారియింట తిన్నవంటకమును
వంట తినినయపుడె వెంటవచ్చు
వచ్చు నట్లగాక వరఁకు నుభయులకు
కంటకమగు వంటకమును వేమా.
305
క. తామరపాకున నీర్వలె
వేమన చరియించుచుండు వెదకుచు శివుని\న్‌
నీమాయ నమ్మరాఁగా
దీమనమునఁ దెలియరాదు నీశుని వేమా.
306
క. వేమన్నా నీమహిమలు
నేమన్నా తెలియ దింక నెటువలె నన్నా
వేమన్నా నీచిత్త మ
దేమన్నా నీవె మాకు నెఱుక గదన్నా.
307
ఉ. కూటికి లేనివానివలెఁ గోపములేకయు నెల్లతావుల\న్‌
మాటికిమాటికి\న్‌ మఱియు మాటకుమాటకు పద్యపద్ధతి\న్‌
ధాటి నెఱుంగఁ జెప్పుచును ధారుణిలో శివరూపధారియై
మాటికి నున్న వేమన సమానము నెవ్వరు గల్గు వేమనా.
308
ఆ. ఎవ్వరేమెఱుంగు నింపయిన వస్తువు
దేహ మే మెఱుంగు దివ్యబోధ
విధముఁ దెలిసి మీరు వేదాంత మెఱుగుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ.
309
క. యుగములఁ జల్లగఁ జూచును
తగలక యుగయుగమునందు తపసుల కైన\న్‌
వగవక యేవకయుండిన
నిగనిగమనుకాంతి మదిని నిలుచుర వేమా.
310
ఆ. వినియు వినకయుండు వెఱ్ఱివాఁడై యుండు
కనియుఁ గానకుండు కడఁగి యోగి
మనుజవరులచేత మఱిపూజఁ గొనుచుండు
విశ్వదాభిరామ వినర వేమ.
311
ఆ. సుఖములెల్లఁ దెలిసి చూడంగ దుఃఖముల్‌
పుణ్యములును పాపపూర్వకములె
కొఱతవేయ దొంగ కోరినచందమా
విశ్వదాభిరామ వినర వేమ.
312
ఆ. ఆలుబిడ్డ లనుచు నతిమోహమున నున్న
ధనముమీద వాంఛ తగిలియున్న
నట్టివానిముక్తి యవనిలో లేదయా
విశ్వదాభిరామ వినర వేమ.
313
ఆ. కాకు లున్నగూడు కోకిల కగునట్లు
భ్రమరి కీటకమయి బ్రతుకుమాడ్కి
సత్యముక్తలని చెలఁగును నరుఁడయా
విశ్వదాభిరామ వినర వేమ.
314
ఆ. విటునిఁగన్నయంత విశదమై వలపుండు
బోటిఁజూడకట్టిపాటి గలదె
కంటిలోనిపాప కన నెంతవాఁడురా
విశ్వదాభిరామ వినర వేమ.
315
ఆ. ప్రభుని కిచ్చునట్లు పేదలకియ్యరు
వనిత కిచ్చునట్లు వడుగు కీరు
సురకు నిచ్చునట్లు సుమతుల కియ్యరు
మనసు పదిలపడదు మహిని వేమా.
316
ఆ. ఊరు ననుచునుండ నొగి సంతసింతురు
అడవియనుచు నుండ నడలుచుందు
రూరు నడవి రెండు నొకటిగాఁ జూచిన
నారితేఱు యోగి యతఁడు వేమా.
317
క. నీచుల వినుతులు సేయుచు
యాచకమున తిరిగి తిరిగి యలయుటకంటె\న్‌
వీచిన నింద్రియపశువులఁ
గాచినవాఁ డిందు నందు ఘనుఁ డగు వేమా.
318
క. భోగంబుల కాశింపక
రాగ ద్వేషంబు లుడిగి రంగుగ భువిలో
వేగమె మోక్షము తనకును
రాఁగన్ననువాఁడు యోగిరాయఁడు వేమా.
319
ఆ. పేదవాని బాధ పెనుభూతమై యుండు
చూడ నట్టిబాధ జాడ కనదు
కలుగువాని బాధ కనులఁ జూడఁగ రామి
కేమి చెప్పవచ్చు నింక వేమా.
320
ఆ. జీవగుణము గల్గుజీవుండు బ్రహ్మంబు
సాటివచ్చునెట్లు సరవితోడ
నూరికుక్క సింగమొకటి జేయురా
విశ్వదాభిరామ వినర వేమ.
321
ఆ. అరయ నాస్తి యనక యడ్డుమాటాడక
తట్టుపడక మదిని తన్నుకోక
తన్నుఁ దాఁ గనుగొని తాఁ బెట్టినది పెట్టు
విశ్వదాభిరామ వినర వేమ.
322
ఆ. పరుల నిందఁజేసి పరులు నావారని
స్థిరము నస్థిరము తెలియలేక
పరఁగ దన్నుఁ జేతఁబట్టుక పెట్టిన
పెట్టుగాదు కట్టిపెట్టు వేమా.
323
ఆ. ఒరులకొఱకు భూమి నొరసెటివారును
అవనిపతికి వశ్యులయినవారు
పాలవంటివారు పన్ను పెట్టెడువారు
వాకెఱుంగరు శాఖవారు వేమా.
324
ఆ. బీఱుబోవుకులకు బిరుదు మ్రింగుకులంబు
నెల్ల జీవులకు భరించుకులము
ఇట్టుకులమువారు హరదూరులు
పట్ట గలుగువాఁడు పరఁగ వేమా.
325
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )