శతకములు వేమన పద్యములు ద్వితీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. ఆత్మ దేహమందు నతిసూక్ష్మముగఁ జూచి
దేహమాత్మయందుఁ దేటపరచి
యాత్మ నెందుఁ జూడ నతఁడెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ.
276
ఆ. పుడమి నుప్పరంబుఁ బురిగొల్పి జగముల
రక్ష సేయగల్గు రాజు లెవరు
మహిసతి యనుపేర మనుజున కేడదో
విశ్వదాభిరామ వినర వేమ.
277
ఆ. ఎఱుకయుండువాని కెఱుకయేయుండును
ఎఱుకలేనివాని కెఱుకలేదు
ఎఱుకలేని యెఱుక నెఱుగుట తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ.
278
ఆ. గింజఁ జెడగనాడ గీడు తోడనె తాకు
గింజ గల్గియున్నఁ గీడుపోవు
గింజలు గలవాని లంజలపంచను
గంజి కుండ్రు జనులు కడఁగి వేమా.
279
ఆ. అధిక భుక్తిచేత మొదటి సొమ్ముకుహాని
కుదువసొమ్ము కొన్నఁ గొంత హాని
మొదటి పక్షమునను మూలకర్తకు హాని
విశ్వదాభిరామ వినర వేమ.
280
ఆ. మనసులోని శివుని మానుగాఁ దెలిసిన
యోగియండ్రు వాని యుర్విజనులు
జీవునిన్నెఱుఁగ నీవెపో శివుఁడవు
విశ్వదాభిరామ వినర వేమ.
281
ఆ. పృథివి కుదక మేగె పృథివిపై మొలకెత్తె
మగుడ పృథివి కేగె మగఁడె సుతుఁడు
ధరణి జనులకెల్ల తల్లియ పెండ్లాము
విశ్వదాభిరామ వినర వేమ.
282
ఆ. అవుటఁగా మెఱుఁగని యజ్ఞానజీవులు
మూలము దెలియకను ముట్టుచేత
ననుదినము సృజించి యాత్మఁ దెలియ లేక
చచ్చి పుట్టుచుండు జగతి వేమా.
283
ఆ. తనువు లస్థిరములు ధర్మము నిత్యము
చేయుధర్మమెల్ల చెడని పదవి
కనివిని మఱి తెలియఁ గానరు నరపశుల్‌
విశ్వదాభిరామ వినర వేమ.
284
ఆ. ఆర్తవిద్య లెల్ల యపకీర్తి పాలాయె
వార్త కెక్కునంత వారికైన
ఆర్తవిద్య లెల్ల ధూర్తులపాలాయె
విశ్వదాభిరామ వినర వేమ.
285
ఆ. కడుపు కెంత నరులు కళవళపడుదురు
కడుపుకొఱకు నూళ్ళు గహనములును
కడుపు కెట్ల యయినఁ గలుగును భుక్తిరా
విశ్వదాభిరామ వినర వేమ.
286
ఆ. దానధర్మములను తెగ రేపు నేఁడని
కాలవ్యయముఁ జేయు కష్టజనుఁడు
తానునేమి యౌనొ తనబ్రతు కేమౌనొ
మాయఁదెలియ లేదు మహిని వేమా.
287
ఆ. పరఁగ రాజకులు పాతిన ధనమెల్ల
భటులపాలు కవులపాలు తలఁప
నొనర హీనజనుని ధనము దాయాదుల
పాలు జారకాంత పాలు వేమా.
288
ఆ. ప్రాకటమున నిట్టిలోకములోఁ గుంటి
పల్లెముత్తఁ డెన్న పరమగురుడు
అన్నదానమునను హరిపూజచేతను
హరుని లోనఁగలసె నరయ వేమా.
289
ఆ. ఎంతకరువు నయిన నెంగిలి యన్నము
పరులకిడెడు ధర్మపరులు చూడ
భూమిమీద నెంగ్లిపుల్లెలు నాకెడు
కుక్కలై పుడుదురు కూడి వేమా.
290
ఆ. తనదుదత్తము పరదత్త మొకటిగాగఁ
జాడ కనుభవింపఁజోద్య మిలను
తొడగి యాలు నమ్మితొత్తును గొన్నట్టు
విశ్వదాభిరామ వినర వేమ.
291
ఆ. ఈఁకె లండఁజేసి తోఁక లండలఁజేసి
కోక లండఁజేసి కొఱఁతమాపె
నాకు లండఁజేసి నఖిల జంతువులకు
విశ్వదాభిరామ వినర వేమ.
292
క. ఒల్లనిపతి నొల్లనిసతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడె
గొల్లండు గాక ధరలో
గొల్లనికిం గలవె వేఱె కొమ్ములు వేమా.
293
ఆ. ఎంత సంపదున్న నంత కష్టపుఁజింత
చింతచేత మిగుల చివుకు మనసు
చింతలేయుంట చెదలని సంపద
విశ్వదాభిరామ వినర వేమ.
294
ఆ. జీవభేద మెఱిగి చెడిపోనివారికి
భావిజనుల చెలిమి పట్టుపడదు
ఈశ్వరునినెఱిఁగిన నెఱుగఁడీ జగమును
విశ్వదాభిరామ వినర వేమ.
295
ఆ. పతికి మాఱుపల్కు పడతియే శునకంబు
మీఱుసతిని గవయ మిగులు వగలు
పంది పంది కూడి పడదొకో రొంపిలో
విశ్వదాభిరామ వినర వేమ.
296
ఆ. పొట్టివాఁడు కీడు పొదిలపురుగు కీడు
వట్టియాస కీడు వరడు కీడు
పొట్టిచేయికాలు పొసగుట కీడురా
విశ్వదాభిరామ వినర వేమ.
297
ఆ. కట్టెపైన నున్న కట్టెకు ఘనమేమి
చెట్టు పైననున్నఁ జేరు ఘనము
కట్టెచెట్టుగూడి గలసె దైవంబులో
విశ్వదాభిరామ వినర వేమ.
298
క. కొట్టినఁ దిట్టినఁ గాని
కట్టు బిగించినను గాని కరకరి సేయ\న్‌
కట్టడివడి యన కుండును
దిట్ట మదిని శివుని దలఁప దీరదు వేమా.
299
ఆ. సిగ్గటంచనఁ బడు సిగ్గునెచ్చోనుండు
ఆఁకలనుచు నుందు రాఁకలేది
దాఁగియున్న వానిఁ దానేల యెఱుఁగఁడో
విశ్వదాభిరామ వినర వేమ.
300
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )