శతకములు వేమన పద్యములు ప్రథమాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. వేమననగ యోగి వెలసె లోకములోనఁ
బూజలిడుఁడు, పుణ్య పురుషులార
పూజలిడిన యంత, భుక్తి ముక్తుల నిచ్చు
విశ్వదాభిరామ వినర వేమ.
1
ఆ. పలుకుమన్న నేల పలుకక యున్నావు
పలుకుమయ్య నాతో ప్రబలముగను
పలుకుమయ్య! నీదు పలుకు నేనెఱిఁగెద
విశ్వదాభిరామ వినర వేమ.
2
ఆ. ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండ శుద్ధి లేని పాక మేల
చిత్త శుద్ధి లేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ వినర వేమ.
3
ఆ. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టె డేల?
చదువఁ బద్య మరయఁ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినర వేమ.
4
ఆ. నిన్నుఁ జూచె నేని తన్నుఁ దా మఱచును
తన్నుఁ జూచె నేని నిన్ను మఱచు;
నే విధమున జనుఁడు నెఱుగు, నిన్నును దన్ను?
విశ్వదాభిరామ వినర వేమ.
5
ఆ. మురియు వాఁ డెవండు? మురియని దెవ్వఁడు?
పాటు జేసి చూడ బట్ట బయలు;
సొరిది జల ఘటమున సూర్యుని చందంబు
విశ్వదాభిరామ వినర వేమ.
6
ఆ. గాజు కుప్పె లోన కడఁగుచు దీపంబు
యెట్టు లుండు, జ్ఞాన మట్టు లుండుఁ
దెలిసినట్టి వారి దేహంబు లందును
విశ్వదాభిరామ వినర వేమ.
7
ఆ. కల్ల గురుఁడు గట్టు, నెల్ల కర్మంబుల
మధ్య గురుఁడు గట్టు మంత్ర చయము
నుత్తముండు కట్టు, యోగ సామ్రాజ్యంబు
విశ్వదాభిరామ వినర వేమ.
8
ఆ. పెట్టి పోయ లేని వట్టి నరులు భూమి
పుట్ట నేమి? వారు గిట్ట నేమి?
పుట్టలోనఁ జెదలు పుట్టదా గిట్టదా?
విశ్వదాభిరామ వినర వేమ.
9
ఆ. తాము గన్న వారు తముఁ గన్న వారును
చచ్చు టెల్ల, తమకు సాక్షి గాదె?
బ్రతుకు టెల్ల తమకు బ్రహ్మ కల్పంబులా?
విశ్వదాభిరామ వినర వేమ.
10
ఆ. ఎరుక మాలు వాఁడు యేమేమి చదివినఁ
జదివినంత సేపె సద్గుణి యగు
కదసి తామరందుఁ గప్ప గూర్చున్నట్లు
విశ్వదాభిరామ వినర వేమ.
11
ఆ. కూటికి నెడఁ బాసి కూర్చున్న మనుజుఁడు
వెలఁదులఁ గనుగొన్న వెతలఁ జిక్కు
చెలఁగి యగ్నిఁ జూచు శలభంబు చాడ్పున
విశ్వదాభిరామ వినర వేమ.
12
ఆ. కసువుఁ బసికిఁజేసె, గాలి ఫణికిఁ జేసె;
మన్నెఱలకుఁ జేసె, మఱవ కెట్లు;
కుంభిని జనులకును కూడట్లు చేసెరా
విశ్వదాభిరామ వినర వేమ.
13
ఆ. ఎవ్వరి గుణములును యేమన్న మానవు
చక్కఁజేయ రాదు కుక్క తోఁక
గడుసురాలు మగని గంపఁ బెట్టమ్మురా
విశ్వదాభిరామ వినర వేమ.
14
ఆ. వేరు పురుగు చేరి వృక్షంబు జెఱుచును
చీడ పురుగు చేరి చెట్టుఁ జెఱుచు
కుత్సితుండు చేరి, గుణవంతుఁ జెఱచురా
విశ్వదాభిరామ వినర వేమ.
15
ఆ. ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండుఁ
జూడఁ జూడ రుచుల జాడ వేఱు
పురుషులందు పుణ్య పురుషులు వేఱయా
విశ్వదాభిరామ వినర వేమ.
16
ఆ. జీవి పోక ముందె జీవ వస్తువు లిచ్చి
జీవి నిలుప వలయు జీవనముగ
జీవి తొలఁగు వెనుక జీవ వస్తువు లేల?
విశ్వదాభిరామ వినర వేమ.
17
ఆ. కల్ల నిజము రెండు కఱకంఠుఁ డెరుగును
నీరు పల్ల మెఱుఁగు నిజముగాను
తనయుని జననంబు తల్లిఁదా నెరుగును
విశ్వదాభిరామ వినర వేమ.
18
ఆ. అంగ మెల్ల వదలి, యటు దంతములు నూడి
తనువు ముదిమిచేతఁ దఱుచు వడక
ముప్పు తిప్పలఁ బడి మోహంబు విడువడు
విశ్వదాభిరామ వినర వేమ.
19
ఆ. ఆడు వారిఁ గన్న నర్థంబు పొడఁ గన్న
సారమైన రుచుల చవులు గన్న;
నయ్యగాండ్ర కైన నాశలు బుట్టవా?
విశ్వదాభిరామ వినర వేమ.
20
ఆ. అనువు గాని చోట నధికుల మనరాదు
కొంచె ముండు టెల్ల కొదువ గాదు
కొండ యద్దమందుఁ గొంచమై యుండదా?
విశ్వదాభిరామ వినర వేమ.
21
క. తన మదిఁ గపటము గలిగిన
తనవలెనే కపట ముండు, తగ జీవులకు\న్‌
తన మది కపటము విడిచినఁ
దన కెవ్వడు కపటి లేఁడు ధరలో వేమా!
22
ఆ. చంపఁదగిన యట్టి శత్రువు తన చేతఁ
జిక్కెనేని కీడు సేయ రాదు
పొసఁగ మేలు జేసి పొమ్మనుటే చాలు!
విశ్వదాభిరామ వినర వేమ.
23
ఆ. తామసించి సేయఁదగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమ మగును
పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె?
విశ్వదాభిరామ వినర వేమ.
24
ఆ. నీళ్లలోన నోడ నిగిడి తిన్నగఁ బ్రాకు
బైట మూరెడైనఁ బ్రాక లేదు
నెలవు దప్పు చోట నేర్పరి కొఱ గాడు!
విశ్వదాభిరామ వినర వేమ.
25
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )