| ఆ. |
ఇచ్చిపుచ్చుకొన్న హితమయిన మనువులు
తగ్గులేక యల్లు తామరవలె
కాచిపూచి పండి కడురమ్యమై యుండు
విశ్వదాభిరామ వినర వేమ. |
201 |
|
| ఆ. |
సతికి పతికినైన సంపద సంపదే
పుత్రసంపదలును భువిని మేలు
సరిగముదిసి బ్రతుకు సంపదే సంపద
విశ్వదాభిరామ వినర వేమ. |
202 |
|
| ఆ. |
కడఁక నింద్రియములు గట్టి వేయగ లేక
చావు వచ్చునపుడు సన్యసించు
నాత్మ జితములేక యందునా మోక్షము
విశ్వదాభిరామ వినర వేమ. |
203 |
|
| ఆ. |
అధిక సూక్ష్మమైన యానంద మెఱుఁగక
మతియు లేక చదివి మగ్నుఁ డయ్యె
నతిరహస్య మెల్ల నాజనుఁ డెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ. |
204 |
|
| ఆ. |
కడక నఖిలమునకు నడినాళమం దున్న
వేఁగుచుక్కవంటి వెలుఁగు దిక్కు
వెలుఁగుకన్న దిక్కు వేఱెవ్వ రున్నారు
విశ్వదాభిరామ వినర వేమ. |
205 |
|
| ఆ. |
రామనామపఠనమహిమచే వాల్మీకి
పరఁగ బోయ యయ్యు బాపఁడయ్యె
కులము ఘనము గాదు గుణము ఘనంబురా
విశ్వదాభిరామ వినర వేమ. |
206 |
|
| ఆ. |
కలిమి కల్గనేమి కరుణలేకుండెనా
కలిమి యేలనల్ప కర్ములకును
తేనెఁగూర్చి యీఁగ తెరువునఁ బోవదా
విశ్వదాభిరామ వినర వేమ. |
207 |
|
| క. |
కన్నుఁగవరీతి సంపద
కొన్నాళ్ళకు వ్రేగుఁజూపి గొబ్బున వ్రాలు\న్
వెన్నెల చీఁకటి సరి యగు
నన్నా శివంగమాయ లన్నియు వేమా. |
208 |
|
| క. |
ఆలు పతిసౌఖ్యముల కిల
నాలయ మగునేని దానినా లన వచ్చు\న్
ఆలాగునఁ గాకుండిన
కాలునిపెనుదూత యదియ కదరా వేమా. |
209 |
|
| ఆ. |
తుమ్మచెట్ల ముండ్లు తోడనెపుట్టును
విత్తులోననుండి వెడలినట్లు
మూర్ఖునకును బుద్ధి ముందుగాఁ బుట్టును
విశ్వదాభిరామ వినర వేమ. |
210 |
|
| ఆ. |
కామి కానివాఁడు కవి గాఁడు రవి గాడు
కామిగాక మోక్షకామి గాఁడు
కామియైనవాఁడు కవియగు రవియగు
విశ్వదాభిరామ వినర వేమ. |
211 |
|
| ఆ. |
కుక్క గోవు గాదు కుందేలు పులికాదు
దోమ గజము గాదు దొడ్డదైన
లోభి దాత గాఁడు లోకంబు లోపల
విశ్వదాభిరామ వినర వేమ. |
212 |
|
| ఆ. |
కూడు గుడిచి లెస్స గూర్చున్నవాఁడైన
నాడుదానిఁ గన్న నట్టె తగులు
నన్న సారమొడలి కతిమదం బిడుసుమీ
విశ్వదాభిరామ వినర వేమ. |
213 |
|
| ఆ. |
దేవపూజ సేయ దివ్యభోగము గల్గు
తత్వ మెఱింగెనేని దైవసముఁడె
యేమిలేనినరున కేగతిలేదురా
విశ్వదాభిరామ వినర వేమ. |
214 |
|
| క. |
వానను దడియనివారును
పూనిక విడ మన్న చేఁత బొరయనివారు\న్
నానాదిక్కుల వెదకినఁ
గానమురా నెంతవాని గానము వేమ. |
215 |
|
| ఆ. |
బ్రహ్మవేత్తల మని పౌరుష మాడేరు
బ్రహ్మ మనఁగ దాని భావమేమి
తెలుపొ నలుపొ యెఱుపొ తెలిసినఁ బలుకుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ. |
216 |
|
| ఆ. |
ఎట్టివాఁడు తానో యెఱుఁగడు తొలిపుట్టు
నీచబ్రతుకుకింత నీమమేల
కష్టనరుల కెల్ల కలుగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
217 |
|
| ఆ. |
కూళకూళ మెచ్చు గుణవంతు విడనాడి
యెట్టివారు మెత్తు రట్టివారి
మ్రావిదూలమునకు జ్ఞానంబు తెలియునా
విశ్వదాభిరామ వినర వేమ. |
218 |
|
| ఆ. |
శివ మతమునకైన వివరింపగా గుర్వు
హరిమతమునకైన నరయ గుర్వు
గురువు నెఱుఁగలేని గుణహీనుఁడేమెఱుఁగు
విశ్వదాభిరామ వినర వేమ. |
219 |
|
| ఆ. |
మునిజనములు కలఁగ మునిఁగి వెళ్ళిన బావి
బ్రహ్మకుఁ దలయెత్తరాని బావి
మొలల బంటిగానుముంచు నెవ్వరినైన
విశ్వదాభిరామ వినర వేమ. |
220 |
|
| ఆ. |
అమృతసాధనమున నందఱుబలుతురు
అమృతమెంచిచూడ నందలేరు
అమృతము విషమాయె నదియేమి చిత్రమౌ
విశ్వదాభిరామ వినర వేమ. |
221 |
|
| ఆ. |
కొండఱేఁడు మామ కొండకూతురు నాలు
కొండ యిల్లు పసిఁడికొండ విల్లు
కొండవంటి దొరకు గుండురూపంబురా
విశ్వదాభిరామ వినర వేమ. |
222 |
|
| ఆ. |
వెలయ పరమతత్వ విభవంబు దెలియక
బాహ్యవిద్యచేత బరఁగు టెల్ల
పూరి మెసవఁగ హరి పోయినచందంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
223 |
|
| ఆ. |
ఒల్ల నన్నఁ బోదు నొల్ల ననఁగరాదు
తొల్లి చేయునట్టి ధూర్తఫలము
ఉల్లమందు వగవకుండుట యోగ్యంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
224 |
|
| ఆ. |
కంటిమంటచేత కాముని దహియించి
కామమునను కడఁగి గౌరిఁ గూడె
నట్టి శివుని తేజ మంటినంతనె చూడ
పూర్వకర్మ ఫలము పోవు వేమ. |
225 |
|