శతకములు వేమన పద్యములు తృతీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

క. పడిపడి మ్రొక్కఁగ నేటికి
గుడిలోపలి కఠినశిలల గుణములు చెడునా
గుడి దేహ మాత్మదేవుఁడు
చెడురాళ్ళకు వట్టిపూజ సేయకు వేమా.
201
ఆ. పలుగురాళ్ళఁ దెచ్చి పరఁగగుడులు కట్టి
చెలఁగిశిలలసేవఁ జేయనేల
శిలలసేవఁ జేయ ఫలమేమి గల్గురా
విశ్వదాభిరామ వినర వేమ.
202
ఆ. ఉపవసములనున్న నూరపందిగఁబుట్టుఁ
దపసియై దరిద్రతను వహించు
శిలకు మ్రొక్కనగునె జీవమడుగు పొమ్ము
విశ్వదాభిరామ వినర వేమ.
203
ఆ. ఇహము విడచి ఫలము లింపుగఁ గలవని
మహిని బల్కు వారిమతము కల్ల
యిహములోనఁ బరము నెసఁగుట గానరో
విశ్వదాభిరామ వినర వేమ.
204
ఆ. వ్రాఁత వెంటఁగాని వరమీడు దైవంబు
సేఁతకొలదిగాని వ్రాఁతగాదు
వ్రాఁతకజుఁడు కర్త చేఁతకుఁ దాఁగర్త
విశ్వదాభిరామ వినర వేమ.
205
ఆ. దోసకారియైన దూసరికాఁడైనఁ
బతితుఁడైన వేదబాహ్యుఁడైన
వట్టిలేని పేదవాని కీఁదగు నీవి
ధనికునకు నొసంగఁ దగదు వేమ.
206
ఆ. కంటికంటి ననుచుఁ గర్మాధికారంబు
వెంటఁబట్టి చెడును వెఱ్ఱినరుఁడు
బట్టబయట ముక్తి చాటించిచూడరో
విశ్వదాభిరామ వినర వేమ.
207
ఆ. తాను విమలుఁడైనఁ దనగుణ మంతయు
శివుని కీనిగురువు చెడుగురుండు
గ్రుడ్డిగుఱ్ఱ మెక్కి గుడి దిరిగినటుల
విశ్వదాభిరామ వినర వేమ.
208
ఆ. జార పురుషుమీఁద సద్భక్తి నిలుపుచు
పతికి నిచ్చకంబు బడయుభంగి
పరముకొఱకు యోగి పాటించు దేహంబు
విశ్వదాభిరామ వినర వేమ.
209
ఆ. తనువులోన జీవతత్వ మెఱుంగక
వేఱె కలదటంచు వెదుకనేల
భానుడుండ దివ్వెఁబట్టి వెదుకు రీతి
విశ్వదాభిరామ వినర వేమ.
210
ఆ. చదువులందు లేదు శాస్త్రంబులను లేదు
వేదములను దైవభేదములను
బైటనున్న ముక్తి పాటించ లేఁడయా
విశ్వదాభిరామ వినర వేమ.
211
ఆ. చచ్చువారిని గని చావు నిశ్చయమని
తత్వమెల్ల నాత్మఁదలచి తెలివి
నదరు బెదరులేక యడరిన ముక్తుఁడు
విశ్వదాభిరామ వినర వేమ.
212
ఆ. బొమ్మలాటవాఁడు బొమ్మల నాడించు
భువిని జనులుచూఁడ బొలుపుమీఱ
తానుమఱిగియుండి దైవ మాడించురా
విశ్వదాభిరామ వినర వేమ.
213
ఆ. పరయువతిరతంబు పాటించి కోరిన
కోటిపూజలెల్లఁ గొల్లఁబోవు
సెగకు పొంతనున్న చెడదె తాపముచేత
విశ్వదాభిరామ వినర వేమ.
214
ఆ. తప్పురూపు గట్టి ధరలోనఁ దిరిగెడు
సేఁతలెల్ల మిత్తిఁజేరుకొఱకె
కడుపునిండ నింత కష్టంబు లేలరా
విశ్వదాభిరామ వినర వేమ.
215
ఆ. వాక్కుశుద్ధి లేనివాఁడు చండాలుండు
ప్రేమశుద్ధిలేని పెట్టులేల
నొసలు భక్తుఁడైన నోరు తోడేలయా
విశ్వదాభిరామ వినర వేమ.
216
ఆ. పరఁగ బొమ్మగుడ్డు పరికించి చూచిన
కులముల నిలయందుఁ గూడఁబెట్టు
నందఱొకటఁ గలియ నన్నదమ్ములె కదా
విశ్వదాభిరామ వినర వేమ.
217
ఆ. కూడ దేమిచేసె గులమేమి చేసెను
భూమి యేమిచేసె బొందికట్టె
నరుఁడు పడెడుపాట్లు నగుబాట్లు చూడరా
విశ్వదాభిరామ వినర వేమ.
218
క. కానలేరు గాని కలియుగంబుననున్న
మనుజులందఱికిని మాన మొకటి
దౌష్టికు లగువారు తమవలెఁ జూడక
పరులఁదూల నాడుదురుగ వేమ.
219
ఆ. జాతులందు నెట్టిజాతి ముఖ్యముచూడు
మెఱుఁగలేక దిరుగ నేమిగలదు
యెఱుక గలుగు మనుజుఁ డేజాతి గలవాఁడు
విశ్వదాభిరామ వినర వేమ.
220
ఆ. చావు వచ్చినపుడు సన్యసించునదెట్లు
కడకు మొదటికులము చెడినదగును
పాప మొకటి గలదు ఫలమేమి లేదయా
విశ్వదాభిరామ వినర వేమ.
221
క. ఊరులు పల్లెలు మానుక
వారక యడవిం జరించువాఁ డరుదెంచు\న్‌
పెరుగులు కూరలు మెసవెడు
వీఱిఁడికెట మోక్షపదవి వినరా వేమా.
222
ఆ. శూద్రు లనుచు భువిని శూద్రులఁ బోనాఁడు
మాలకన్న చెడుగు మహినిలేఁడు
నరకమునకు నేగు నష్టమైన వెనుక
విశ్వదాభిరామ వినర వేమ.
223
ఆ. పూజకన్న నెంచ బుద్ధి నిధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణమే ప్రధానంబు
విశ్వదాభిరామ వినర వేమ.
224
ఆ. కులము హెచ్చుతగ్గు గొడవలు పనిలేదు
సానుజాత మయ్యె సకలకులము
హెచ్చుతగ్గుమాట లెటులెఱుంగఁగ వచ్చు
విశ్వదాభిరామ వినర వేమ.
225
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )