శతకములు వేమన పద్యములు ద్వితీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

ఆ. సుతులచేతఁ బుణ్య సుఖముఁబొందుదు నని
మనుజుఁడుండు కర్మమతముఁ దగిలి
యేనుఁగు పడియున్న నెత్తునా మశకంబు
విశ్వదాభిరామ వినర వేమ.
51
ఆ. ఎంతచదువుఁ జదివి యెన్ని విన్నను గాని
హీనుఁ డవగుణంబు మానలేఁడు
బొగ్గు పాలఁగడుగఁ బోవునా మలినంబు
విశ్వదాభిరామ వినర వేమ.
52
క. మొదటను మతమును వదలక
తుద నెవ్వరిమతమునైన దూషింపకయు\న్‌
పదిలుఁడయి కోర్కెఁగోరక
ముదమునఁ జరియించువాఁడె ముఖ్యుఁడు వేమా.
53
ఆ. తిరిపెగాని మిగుల దీపించఁ గనరాదు
వెఱ్ఱివానిమాట వినఁగ రాదు
వెఱ్ఱికుక్కఁ బట్టి వేటాడ వచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ.
54
ఆ. ఆలు బిడ్డలు ధన మరయఁ దల్లియుఁ దండ్రి
కలమనుజుఁడు మిగుల కష్టపడును
తనకు నెవరులేరు తాను బ్రహ్మముఁగన్న
విశ్వదాభిరామ వినర వేమ.
55
ఆ. పూసపోగుపైడి పుట్టంబు విడియంబు
కాయపుష్టిమిగులఁ గలిగియున్న
హీనజాతి నైన నిందురమ్మందురు
విశ్వదాభిరామ వినర వేమ.
56
ఆ. మాసిన తలతోడ మలినవస్త్రముతోడ
నొడల జడ్డుతోడ నుండెనేని
యగ్రజన్ముఁడయిన నట్టెపొమ్మందురు
విశ్వదాభిరామ వినర వేమ.
57
ఆ. కొండెగాఁడు చావఁ గొంపదనుకఁ బోక
వంతు కింతెకాని వగపులేదు
కొంకనక్క చావ గొఱ్ఱెలేమిటి కేడ్చు
విశ్వదాభిరామ వినర వేమ.
58
ఆ. వాడకుఱికి తిట్టు వలదన్న మొఱఁబెట్టు
ముందు మగనిఁ దిట్టు ముసుఁగుపెట్టు
గడుసురాలు మగని గంపఁ బెట్టమ్మురా
విశ్వదాభిరామ వినర వేమ.
59
ఆ. ఆడు పాపజాతి యన్నిటికంటెను
ఆశచేత యతులు మోసపోరె
చూచి విడుచువారు శుద్ధాత్ములెందును
విశ్వదాభిరామ వినర వేమ.
60
ఆ. నిజములాడువాని నిందించు జగమెల్ల
నిజము లాడరాదు నీచుతోడ
నిజమహాత్ముఁగూడ నిజమాడవలయురా
విశ్వదాభిరామ వినర వేమ.
61
క. వెఱవవలెఁ బామునకు నిల
వెఱవఁగవలె మరణమునకు విశ్వములోన\న్‌
మఱవగవలె సంగమముల
మఱి మఱువగ వలదు మేలు మహిలో వేమా.
62
క. ఇచ్చకము భువిని వశ్యము
కుచ్చిత మీలోకనింద కోవిదునకు నీ
తుచ్చమున హాని వచ్చును
మచ్చరమే తన్నుఁ జెఱచు మహిలో వేమా.
63
ఆ. కోఁతిఁ బట్టితెచ్చి క్రొత్తపుట్టముగట్టి
కొండమ్రుచ్చు లెల్లఁ గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యు లుందురు
విశ్వదాభిరామ వినర వేమ.
64
ఆ. గాడ్దెమేనునిండ గంధంబుఁ బూసిన
నేమి యెఱుఁగలేక యెగసితన్ను
నీడుకానివాని నిష్ట మీలాగురా
విశ్వదాభిరామ వినర వేమ.
65
ఆ. విడువవలయు నూరు విశ్రాంతి గాకున్న
విడువవలయు నాలి విధముఁ దెలిసి
విడువవలయు రాజు వితరణి గాకున్న
విశ్వదాభిరామ వినర వేమ.
66
ఆ. అప్పుదీయ రోఁత హరిహరాదులకైన
మొప్పెతోడ మైత్రి మొదలె రోఁత
తప్పు బలుక రోఁత తాకట్టిడిన రోఁత
విశ్వదాభిరామ వినర వేమ.
67
ఆ. ఎడ్డె దెలుపవచ్చు నేఁడాది కైనను
మౌనిఁ దెలుపవచ్చు మాసమందు
మొప్పెఁ దెలుపరాదు ముప్ప దేండ్లకు నైన
విశ్వదాభిరామ వినర వేమ.
68
ఆ. చూపువలనఁ బుట్టు సుఖదుఃఖములు రెండు
పతికి సతికిఁ బుట్ట పరగ సుతుఁడు
సతికి సుతునివలన సౌఖ్యంబు గలుగును
విశ్వదాభిరామ వినర వేమ.
69
ఆ. నీళ్ళమీదఁ జూడు నెరయ నోడలపర్వు
బయలుమీఁదఁ జూడు పక్షిపర్వు
నాఁడువారిగమన మీలాగు నుండురా
విశ్వదాభిరామ వినర వేమ.
70
ఆ. ఆలు రంభయైన నతిశీలయైన
జారపురుషుఁడేల జాడ మాను
మాలవాడ కుక్క మరగినచందంబు
విశ్వదాభిరామ వినర వేమ.
71
ఆ. చాకివాఁడు కోక చీకాకుపడఁ జేసి
మయిలఁబుచ్చి మంచిమడుపుఁ జేయు
బుద్ధిచెప్పువాఁడు గ్రుద్దిన నేమయా
విశ్వదాభిరామ వినర వేమ.
72
ఆ. కలిమినాఁడు మగని కామిని చూచును
లేమిఁజిక్కునాఁడు లేవకుండు
మనినమగనినైన మడియంగఁ జూచును
విశ్వదాభిరామ వినర వేమ.
73
ఆ. పాలు పంచదార పాపరపండ్లలో
చాలఁబోసి పండ్లఁ జవికిరావు
కుటిలమానవులకు గుణ మేల కలుగురా
విశ్వదాభిరామ వినర వేమ.
74
ఆ. భూమి నాదియన్న భూమి ఫక్కున నవ్వు
దానహీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినర వేమ.
75
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )