| ఆ. |
జదలుదాల్చు టెల్ల జగము ఛీయను టెల్ల
యొడలువిఱచుటెల్ల యోగ మెల్ల
ముక్తికాంతఁ బట్టి ముద్దాడుకొరకురా
విశ్వదాభిరామ వినర వేమ. |
401 |
|
| క. |
తనలో సర్వంబుండఁగ
తనలోపల వెదుకలేక ధరవెదకెడు నీ
తనువుల మోసెడి యెద్దుల
మనములఁ దెల్పఁగ వశమె మహిలో వేమా. |
402 |
|
| ఆ. |
కరములందు తాము గంగాధరుని బట్టి
తీర్థములకు పోయి తిరుగుచుంద్రు
వెన్నఁ బట్టి నెయ్యి వెదకిన చందమౌ
విశ్వదాభిరామ వినర వేమ. |
403 |
|
| ఆ. |
అఱుతలింగ ముంచి యదిగనఁజాలక
పర్వతమున కేగు పామరుండు
ముక్తిఁగాన నగునె మూఢాత్ముఁడగుఁగాక
విశ్వదాభిరామ వినర వేమ. |
404 |
|
| ఆ. |
స్నాన మొనరఁజేసి తద్ధర్మమీయక
నీళ్ళ మునుఁగ నగునె నేర్పు లేక
నీళ్ళయందు కోడినెలవుగా మునుఁగదా
విశ్వదాభిరామ వినర వేమ. |
405 |
|
| ఆ. |
కాలచక్ర మెఱుఁగఁగా లేక యెప్పుడు
సంధ్యజపముసేయు జాణలార
సంధ్యజపములోన జాడ లెట్లుండును
విశ్వదాభిరామ వినర వేమ. |
406 |
|
| ఆ. |
కాశియాత్రఁ బోయి గంగదానముఁ జేసి
కష్టపడిరి ముక్తిఁ గానలేక
ఎనుము తిరుగుచుండదే యెద్దువెంబడి
విశ్వదాభిరామ వినర వేమ. |
407 |
|
| ఆ. |
కాశిఁబోవువాని కర్మ మేమని చెప్పఁ
బాపహేతువుండి వచ్చెనేని
మనసు కాశిఁజేరు మఱి ముక్తి లేదురా
విశ్వదాభిరామ వినర వేమ. |
408 |
|
| ఆ. |
యోగి ననుచుఁ గొంత యోగము గూర్చుక
జగములోనివానిఁ జంపితినుచు
ధనము కొఱకు మిగుల తగవాడుచుండిన
యోగిగాఁడు వాఁడె యోగు వేమా. |
409 |
|
| ఆ. |
పరమహంస ననుచు వరవఁ గట్టుక భూమి
పరధనముల కాసపఁడెను వాఁడు
పరమహంస గాఁడు పరమహింసుఁ డటండ్రు
విశ్వదాభిరామ వినర వేమ. |
410 |
|
| ఆ. |
మునిఁగి మునిఁగి మునిఁగి ముద్దయై ముద్దయై
వనరి వనరి వనరి వక్కి వక్కి
తిరిగి తిరిగి తిరిగి దిమ్మరై యుండును
విశ్వదాభిరామ వినర వేమ. |
411 |
|
| ఆ. |
బారెడేసి జడలు భస్మంబుపూఁతలు
మరునితోడ మాఱుమలయఁ గలరు
ముంజికోకలెల్ల లంజెకోకలాయె
విశ్వదాభిరామ వినర వేమ. |
412 |
|
| ఆ. |
బోడితలల నెల్ల బూడిదెపూఁతల
నాసనముల మారు తాపనముల
యోగిగాఁడు లోన బాగు గాకుండిన
విశ్వదాభిరామ వినర వేమ. |
413 |
|
| ఆ. |
ఆఱువేషములను నటుచూడ బహువింత
లాత్మయందు ధ్యాన మమర దెందు
భీకరంబె కాని బిరుదు లేదు విరక్తి
విశ్వదాభిరామ వినర వేమ. |
414 |
|
| ఆ. |
కుక్కుటమననంబు కొక్కెర ధ్యానంబు
యతుల నొసట నొనరునట్లు వ్రాసె
తొల్లి చేసినట్టి దోషంబు తగిలెనో
విశ్వదాభిరామ వినర వేమ. |
415 |
|
| ఆ. |
ఒడల భూతిఁ బూసి జడలు ధరించిన
నొడయుఁడైన ముక్తిఁ బడయలేఁడు
తడకబిఱ్ఱుపెట్టఁ దలపుతో సరియౌనె
విశ్వదాభిరామ వినర వేమ. |
416 |
|
| ఆ. |
శివుఁడు బ్రహ్మ మనుచు స్మృతులెల్లఁ బలుకంగ
వేఱె దైవములను వేయిగొల్చి
బ్రహ్మజనులు చూడ భ్రష్టులైపోయిరి
విశ్వదాభిరామ వినర వేమ. |
417 |
|
| ఆ. |
తలను వ్రేలవేసి తాలిమి నిలుచుక
మూసి తెఱచు గన్ను మూగి యగును
జ్ఞాన మదియుఁగాదు కష్టము శేషంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
418 |
|
| ఆ. |
శివుని భక్తులెల్ల భువి మంటిపాలైరి
వాదమేల దైవభేదమేల
విష్ణుభక్తులెల్ల వెలిబూదిపాలైరి
విశ్వదాభిరామ వినర వేమ. |
429 |
|
| ఆ. |
తన్నుఁ దెలియకున్న తగ వేదములు వెఱ్ఱి
సర్వ సంపదకు ముసాబు వెఱ్ఱి
యాఱు శాస్త్రములును నా పురాణములును
జబ్బు లనుచు జగతిఁ జాటు వేమా. |
420 |
|
| ఆ. |
వేముఁడిట్లు చెప్పె వేల పద్యంబులు
తప్పు లెన్నియున్న నొప్పియుండు
తత్తఱపడ కందుఁ జిత్తము నిల్పుము
విశ్వదాభిరామ వినర వేమ. |
421 |
|
| ఆ. |
వెఱ్ఱినక్కలవలె వేదముల్ చదివెద
రాశయంబు లెఱుఁగరయ్య వారు
వేదసారమంత వేమన యెఱుఁగును
విశ్వదాభిరామ వినర వేమ. |
422 |
|
| ఆ. |
ఆలిఱంకుఁ దెలుపు నఖిలయజ్ఞంబులు
తల్లిఱంకు తెలుపుఁ దద్దినములు
కానితెరువు కర్మ కాన కల్పితమాయె
విశ్వదాభిరామ వినర వేమ. |
423 |
|
| ఆ. |
హింసఁ జేయకుండుటే ముఖ్య ధర్మంబు
ఆనక హింసచేసి రవనిసురులు
చావుపశువుఁ దినెడు చండాలుఁడే మేలు
విశ్వదాభిరామ వినర వేమ. |
424 |
|
| ఆ. |
ముక్కుత్రాళ్ళ గ్రుచ్చి ముఱికిపోవఁగఁ దోమి
కచ్చనీరు నించి కడిగి కడిగి
డొక్క దోమినంత దొరకునా తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ. |
425 |
|