శతకములు వేమన పద్యములు ద్వితీయాశ్వాసము

ప్రథమ1265176101126151176201226251276301326351376401
ద్వితీయ1265176101126151176201226251276301326351376401426451
తృతీయ1265176101126151176201226251276

క. చెట్టునన విత్తును బుట్టెను
చెట్టును విత్తున పుట్టెఁ జెలిమి దలిర్ప\న్‌
చెట్టును విత్తును రెండును
పుట్టిన విధిఁ దెలియవలయు భువిలో వేమా.
251
ఆ. తలి గర్భమందుఁ దాఁబుట్టి నప్పుడు
మొదల బట్ట లేదు తుదను లేదు
నడుమ బట్టగట్ట నగుఁబాటు గాదటో
విశ్వదాభిరామ వినర వేమ.
252
ఆ. తవిటి కరయఁ బోఁవ దండులంబుల గంప
శ్వానమాశ్రయించు సామ్యమునకు
కోమటింటి సొమ్ము క్రూరులపా లౌను
విశ్వదాభిరామ వినర వేమ.
253
ఆ. బాపఁ డెముకకూడు భక్షించుచుండును
పేరటంబుఁబోవు పెండ్లి మగువ
కులము మానము వీడ కోర్కెలు మెండాయె
విశ్వదాభిరామ వినర వేమ.
254
ఆ. మద్యమాంసరుచిని మాదిగె దైవాల
యెంగిలిదినువారి దెట్టికులము
భక్తిని హరిఁగొల్చి భవ్యులుగారైరి
విశ్వదాభిరామ వినర వేమ.
255
ఆ. ప్రళయకాలమందు ప్రమధులచేతను
నష్టమైరిగాదె నాటిజనులు
తెలియనేరరైరి దేవుని ద్విజులెల్ల
విశ్వదాభిరామ వినర వేమ.
256
ఆ. వైష్ణవుల మటంచు వార్తమాత్రమె కాని
భ్రష్టు లంతకన్న వేఱులేరు
చారు బలమదైన నీరుగాఁ బోవునా
విశ్వదాభిరామ వినర వేమ.
257
ఆ. బ్రహ్మ యెవనికొడుకు పరికింపఁగా భువి
విష్ణు వెవనికొడుకు వెలయఁజూడ
శివుఁడు నెవనికొడుకు సిగ్గెఱుఁగరు జనుల్‌
విశ్వదాభిరామ వినర వేమ.
258
ఆ. సోమయాజిని బట్టి సొడ్డు వేసెను రంభ
యందె సోమయా జనంగఁబట్టి
క్రతువుఁజేయు ఫలము గల్గెరా చేసెఁత
విశ్వదాభిరామ వినర వేమ.
259
ఆ. మునిఁగి బ్రాహ్మణుండు ముందుఁగానకపోయె
తిరిగి తిరిగి యతఁడు ద్రిమ్మ రాయె
కూసికూసితుదకు కుక్కయై పోయెరా
విశ్వదాభిరామ వినర వేమ.
260
ఆ. చచ్చువారిఁజూచి చావని పుట్టని
తత్వ మెల్ల నాత్మఁ దలఁపుఁ జేసి
యరసి చూచినట్టి యతనికి మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ.
261
క. కప్పయు పామును బోరఁగ
కప్పను నాపాముమ్రింగె కడువేడుకతో
కప్పను చెడలందిగిచెడి
విప్పను నా చొప్పు దెలియ వేమననేర్చు\న్‌.
262
ఆ. మన్ను మిన్ను నంటి మహిమీఁద నొకకోట
కొమ్మ లమరియుండు కొనలుసాగి
దివ్వెలేని వెలుఁగు తేజరిల్లుచు నుండు
విశ్వదాభిరామ వినర వేమ.
263
ఆ. మొదలమ్రాను నగును తుద పక్షియును గాదు
నోరు లేదు పండ్లు నాఱు గలుగు
జీవమొకటిలేదు జీవులఁజంపురా
విశ్వదాభిరామ వినర వేమ.
264
ఆ. కాలు చేయి లేదు కంచుకంబు గలదు
కొమ్మ లేదు ఉరికి చిమ్ము వేగ
గరిడిలేక చంపుఁగడు పెద్దచోద్యమౌ
విశ్వదాభిరామ వినర వేమ.
265
ఆ. వాఁత నాకు మేను వలపట మెడవాఁడు
ఒంటికాలువాఁడు నొప్పుచుండు
రాజసభలయందె రంజిల్ల మాట్లాడు
విశ్వదాభిరామ వినర వేమ.
266
ఆ. బ్రహ్మ గుఱ్ఱ మాయె భవుఁడు పల్లం బాయె
నాదివిష్ణువెన్న నంకె మాయె
నందు మీఁదివాఁడు నాఁడుదో మగవాఁడొ
విశ్వదాభిరామ వినర వేమ.
267
ఆ. రమణి నవ్వుచుండు రమణుఁడు నేడ్చును
రమణ సేయుచుండు ఱంకుమీర
ఱంకు చూడఁగానె పరమైన తత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ.
268
ఆ. రూపులేని వనితరూఢి పతివ్రత
నీటు లేనివాఁడు బంటు కాఁడు
తెలుప వచ్చువాఁడు దేవరబంటురా
విశ్వదాభిరామ వినర వేమ.
269
ఆ. ఇహమునందు నేమి యిడుములఁ బడినను
పరమ సాధనార్హ పదవి గాదు
పరులుకారు నెట్టి వెరవునఁ జూచిన
విశ్వదాభిరామ వినర వేమ.
270
ఆ. సతి యొనర్చు చెడ్డ పతి కవశ్యము వచ్చు
పతియొనర్చు మంచి సతికి సగము
పతి యొనర్చు చెడ్డ సతి కేల రాదురా
విశ్వదాభిరామ వినర వేమ.
271
చ. కురుపులు గండముల్‌ కఠినకష్టపు రోగము లెన్నివచ్చిన\న్‌
గరిమను జీవరాసులకు గట్టిగ నాయువు గల్గినంత వే
మరు వగవంగ నేల క్షుధమాయను లేదననేల మూఢుఁడై
యరయ దయాళుఁడైన పరమాత్ముఁడె యొక్కఁడు దిక్కు వేమా.
272
ఆ. ఘటము జలములందు గగనంబు కనఁబడు
ఘటము జలము లేమి గగనమేది
ఘటములోన జ్యోతిఁ గ్రమమునఁ దెలియుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ.
273
ఆ. ఘటముఁగాన్గఁజేసి కామ మెద్దుగఁజేసి
తెలిసి కర్మములను తిలలుఁ జేసి
తెలిసి గాను గాఁడు తిలకార కాత్మయు
విశ్వదాభిరామ వినర వేమ.
274
క. ఆమడ కామడ కడవులు
గ్రామంబులు చెరువు నదులు కర్మము లింతే
తా మెందులోనఁ దిరిగిన
వేమన తోడగుచువచ్చు వెంటనె వేమా.
275
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vemana shatakamu - vemana satakamu - vemana padyamulu ( telugu andhra )