| శతకములు | సుమతి శతకము |
|
| క. |
మానఘనుఁ డాత్మధృతిఁ జెడి హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్ మానెఁడు జలములలోపల నేనుఁగు మెయి దాఁచినట్టు లెఱుగుము సుమతీ! |
91 |
| క. |
రాపొమ్మని పిలువని యా భూపాలునిఁ గొల్వ భుక్తి ముక్తులు గలవే? దీపంబు లేని యింటను జేపుణికిళ్ళాడినట్లు సిద్ధము సుమతీ! |
92 |
| క. |
రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ గోపించు రాజుఁ గొల్వకు పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ! |
93 |
| క. |
లావు గలవాని కంటెను భావింపఁగ నీతిపరుఁడు బలవంతుఁడౌ గ్రావంబంత గజంబును మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ! |
94 |
| క. |
వఱదైన చేను దున్నకు కఱవైనను బంధుజనుల కడ కేఁగకుమీ పరులకు మర్మము సెప్పకు పిఱికికి దళవాయితనముఁ బెట్టకు సుమతీ! |
95 |
| క. |
వరిపంట లేని యూరును దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్ ధరను బతిలేని గృహమును నరయంగా రుద్రభూమి యనఁదగు సుమతీ! |
96 |
| క. |
వినఁదగు నెవ్వరు సెప్పిన వినినంతనె వేగపడక వివరింపఁదగున్ గని కల్ల నిజముఁ దెలిసిన మనుజుఁడె పో నీతిపరుఁడు మహిలో సుమతీ! |
97 |
| క. |
వీడెము సేయని నోరును జేడెల యధరామృతంబుఁ జెందని నోరున్ బాడంగరాని నోరును బూడిద కిరవైన పాడు బొందర సుమతీ. |
98 |
| క. |
వెలయాలివలనఁ గూరిమి గలుగదు మఱిఁ గలిగెనేని కడతేరదుగా పలువురు నడిచెడు తెరువునఁ బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ! |
99 |
| క. |
శుభముల నొందని చదువును నభినయమును రాగరసము నందని పాటల్ అభిలాష లేని కూటమి సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ! |
100 |