| శతకములు | సుమతి శతకము |
|
| క. |
కరణము సాధై యున్నను గరి మదముడిఁగినను బాము గఱవకయున్నన్ ధరఁ దేలు మీటకున్నను గర మరుదుగ లెక్కఁగొనరు గదరా సుమతీ! |
31 |
| క. |
కసుగాయఁ గఱచి చూచిన మసలక దనయొగరు గాక మధురంబగునా? పసగలుగు యువతు లుండగఁ బసిబాలలఁ బొందువాఁడు పసరము సుమతీ! |
32 |
| క. |
కవిగాని వాని వ్రాఁతయు నవరసభావములులేని నాతుల వలంపున్ దవిలి చను పందినేయని వివిధాయుధకౌశలంబు వృథరా సుమతీ! |
33 |
| క. |
కాదుసుమీ దుస్సంగతి పోదుసుమీ కీర్తికాంత పొందినపిదపన్ వాదుసుమీ యప్పిచ్చుట లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ! |
34 |
| క. |
కాముకుఁడు దనిసి విడిచిన కోమలిఁ బరవిటుఁడు గవయ గూడుటయెల్లన్ బ్రేమమునఁ జెఱకుపిప్పికి జీమలు వెస మూఁగినట్లు సిద్ధము సుమతీ! |
35 |
| క. |
కారణము లేని నగవును బేరణమును లేని లేమ పృథివీస్థలిలోఁ బూరణము లేని బూరెయు వీరణములు లేని పెండ్లి వృథరా సుమతీ! |
36 |
| క. |
కులకాంత తోడనెప్పుడుఁ గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ కలకంఠికంట కన్నీ రొలికిన సిరి యింటనుంట నొల్లదు సుమతీ! |
37 |
| క. |
కూరిమిగల దినములలో నేరము లెన్నఁడును గలుగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ! |
38 |
| క. |
కొంచెపు నరు సంగతిచే నంచితముగఁ గీడు వచ్చు నది యెట్లన్నన్ గించిత్తు నల్లి కుట్టిన మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ! |
39 |
| క. |
కొక్కోకమెల్లఁ జదివినఁ జక్కనివాఁడైన రాజ చంద్రుండైనన్ మిక్కిలి రొక్కంబీయక చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ! |
40 |