శతకములు సుమతి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
క. సరసము విరసము కొఱకే
పరిపూర్ణసుఖంబు లధిక బాధల కొఱకే
పెరుఁగుట విరుఁగుట కొఱకే
ధరతగ్గుట హెచ్చుకొఱకె తథ్యము సుమతీ.
101
క. మేలెంచని మాలిన్యుని
మాలను నగసాలివాని మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁ గలసిపోవుఁగాని నెగడదు సుమతీ.
102
క. స్త్రీలయెడ వాదులాడకు
బాలురతోఁ జెలిమి సేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
యేలినపతి నిందసేయ కెన్నడు సుమతీ.
103
క. సిరిదా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్‌
సిరి దాఁ బోయిన బోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ.
104
క. మది నొకని వలచియుండఁగ
మది చెడి యొక క్రూరవిటుఁడు మానక తిరుగున్‌
అది చిలుకఁ బిల్లిపట్టినఁ
జదువునె యాపంజరమున జగతిని సుమతీ.
105
క. పుత్త్రోత్సాహము తండ్రికి
బుత్త్రుఁడు జన్మించినపుడే పుట్టదు జను లా
పుత్త్రునిఁ గనుఁగొని పొగడఁగఁ
బుత్త్రోత్సాహంబు నాఁడు పొందుర సుమతీ.
106
క. వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగసాలిపొందు వెలమల చెలిమియున్‌
గలలోనఁ గన్న కలిమియు
విలసితముగ నమ్మరాదు వినురా సుమతీ.
107
క. వేసరఁపు జాతి గానీ
వీసముఁ దాఁ జేయనట్టి వెంగలి గానీ
దాసికొడుకైనఁ గానీ
కాసులు గలవాఁడె రాజు గదరా సుమతీ.
108
AndhraBharati AMdhra bhArati - shatakamulu - sumati shatakamu ( telugu andhra )