శతకములు సుమతి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
క. తన కలిమి యింద్ర భోగము
తన లేమియె సర్వలోక దారిద్ర్యంబు\న్‌
దన చావు జగత్ప్రళయము
తను వలచినదియె రంభ తథ్యము సుమతీ!
51
క. తన వారు లేని చోటను
జనువించుక లేని చోట జగడము చోటన్‌
అనుమానమైన చోటను
మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ!
52
క. తమలము సేయని నోరును
విమతులతోఁ జెలిమిసేసి వెతఁబడు తెలివిన్‌
(రమణుల చనుమొనలమీఁద రాయని మేనున్‌)
గమలములు లేనికొలఁకును
హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!
53
క. తలనుండు విషము ఫణికిని
వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్‌
తల తోఁక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
54
క. తలపొడవు ధనముఁ బోసిన
వెలయాలికి నిజములేదు వివరింపఁగాఁ
దల దడవి బాసఁజేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ!
55
క. తలమాసిన నొలుమాసిన
వలువలు మాసినను బ్రాణవల్లభునైనన్‌
గులకాంతలైన రోఁతురు
తిలకింపఁగ భూమిలోనఁ దిరముగ సుమతీ!
56
క. తాననుభవింప నర్థము
మానవపతిఁ జేరుఁ గొంత మఱి భూగతమౌఁ
గానల నీఁగలు గూర్చిన
తేనియ యొరుఁజేరునట్లు తిరముగ సుమతీ!
57
క. దగ్గఱ కొండెము చెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మఱి తా
నెగ్గుఁ బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువుఁ బొడుచుట సుమతీ!
58
క. ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్ష మెత్తఁగవలసెన్‌
దనవారి కెంత కలగినఁ
దనభాగ్యమె తనకుఁగాక తథ్యము సుమతీ!
59
క. ధీరులకుఁ జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్‌
గౌరవమును మఱి మీఁదట
భూరి సుఖావహము నగును భువిలో సుమతీ!
60
AndhraBharati AMdhra bhArati - shatakamulu - sumati shatakamu ( telugu andhra )