శతకములు సుమతి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
క. ఇచ్చునదె విద్య రణమునఁ
జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్‌
మెచ్చునదె నేర్పు, వాదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ!
11
క. ఇమ్ముగఁ జదువని నోరును
'నమ్మా' యని పిలిచి యన్న మడుగని నోరు\న్‌
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
12
క. ఉడుముండదె నూఱేండ్లును
బడియుండదె పేర్మిఁ బాము పదినూఱేండ్లున్‌
మడువునఁ గొక్కెర యుండదె
కడు నిలఁ బురుషార్థపరుఁడు గావలె సుమతీ!
13
క. ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగ నేర్చు నెయ్యెడలం దా
నెత్తిచ్చి కఱఁగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!
14
క. ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్‌
మొదవు కడనున్న వృషభముఁ
జదువని యా నీచుఁ జేరఁ జనకుర సుమతీ!
15
క. ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ!
16
క. ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱకు కైవడి నేపో
నెపములు వెదకును గడపటఁ
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ!
17
క. ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్‌
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాఁడు ధన్యుడు సుమతీ!
18
క. ఎప్పుడుఁ దప్పులు వెదకెడు
నప్పురుషునిఁ గొల్వఁగూడ దది యెట్లన్నన్‌
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
19
క. ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్‌
దెప్పలుగఁ జెఱువు నిండినఁ
గప్పలు పదివేలు చేరుఁగదరా సుమతీ!
20
AndhraBharati AMdhra bhArati - shatakamulu - sumati shatakamu ( telugu andhra )