| శతకములు | సుమతి శతకము |
|
| క. |
నడువకుమీ తెరువొక్కటఁ గుడువకుమీ శత్రునింటఁ గూరిమి తోడన్ ముడువకుమీ పరధనముల నుడువకుమీ యొరుల మనసు నొవ్వఁగ సుమతీ! |
61 |
| క. |
నమ్మకు సుంకరి జూదరి నమ్మకు మగసాలివాని నటు వెలయాలిన్ నమ్మకు మంగడివానిని నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ! |
62 |
| క. |
నయమునఁ బాలుం ద్రావరు భయమున విషమ్మునైన భక్షింతురుగా నయమెంత దోసకారియొ భయమే చూపంగ వలయు బాగుగ సుమతీ! |
63 |
| క. |
నరపతులు మేరఁ దప్పినఁ దిర మొప్పగ విధవ యింటఁ దీర్పరియైనన్ గరణము వైదికుఁడయినను మరణాంతకమౌను గాని మానదు సుమతీ! |
64 |
| క. |
నవరస భావాలంకృత కవితా గోష్ఠియును మధుర గానంబును దా నవివేకి కెంతఁ జెప్పినఁ జెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతీ! |
65 |
| క. |
నవ్వకుమీ సభ లోపల నవ్వకుమీ తల్లిదండ్రి నాథుల తోడన్ నవ్వకుమీ పరసతితో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ! |
66 |
| క. |
నీరే ప్రాణాధారము నోరే రసభరితమైన నుడువులకెల్లన్ నారియె నరులకు రత్నము చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ! |
67 |
| క. |
పగ వలదెవ్వరి తోడను వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్ దెగనాడవలదు సభలను మగువకు మనసీయవలదు మహిలో సుమతీ! |
68 |
| క. |
పతికడకుఁ దన్నుగూర్చిన సతికడకును వేల్పుకడకు సద్గురుకడకున్ సుతుకడకు రిత్తచేతుల మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ! |
69 |
| క. |
పనిచేయు నెడల దాసియు ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్ దన భుక్తియెడలఁ దల్లియు ననఁ దన కులకాంత యుండ నగురా సుమతీ! |
70 |