| శతకములు | సుమతి శతకము |
|
| క. |
శ్రీ రాముని దయ చేతను నారూఢిగ సకల జనులు నౌరా యనఁగా ధారాళమైన నీతులు నోరూఁరఁగ జవులు పుట్ట నుడివెద సుమతీ! |
1 |
| క. |
అక్కఱకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా నెక్కినఁ బాఱని గుఱ్ఱము గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ ! |
2 |
| క. |
అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడి గల యెద్దులఁ గట్టుక మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ! |
3 |
| క. |
అడియాస కొలువుఁ గొలువకు గుడిమణియము సేయఁబోకు, కుజనులతోడన్ విడువక కూరిమి సేయకు మడవినిఁ దోడరయ కొంటి నరుగకు సుమతీ! |
4 |
| క. |
అధరము గదలియుఁ గదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుఁడౌ నధికార రోగపూరిత బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ! |
5 |
| క. |
అప్పుగొని చేయు విభవము ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపము\న్ దప్పరయని నృపురాజ్యము దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ! |
6 |
| క. |
అప్పిచ్చు వాఁడు వైద్యుఁడు నెప్పుడు నెడతెగక పాఱు నేఱును ద్విజుఁడున్ జొప్పడిన యూర నుండుము చొప్పడ కున్నట్టి యూరుఁ జొరకుము సుమతీ! |
7 |
| క. |
అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్యవిద్య కోమలి నిజము\న్ బొల్లున దంచిన బియ్యముఁ దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ! |
8 |
| క. |
ఆఁకొన్న కూడె యమృతము తాఁకొంకక నిచ్చు వాఁడె దాత ధరిత్రి\న్ సోఁకోర్చు వాఁడె మనుజుఁడు తేఁకువ కల వాఁడె వంశతిలకుఁడు సుమతీ! |
9 |
| క. |
ఆఁకలి యుడుగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకు\న్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పాఁడియును రోఁత మేదిని సుమతీ! |
10 |