| శతకములు | సుమతి శతకము |
|
| క. |
పిలువని పనులకుఁ బోవుట కలయని సతిరతియు రాజుగానని కొలువున్ బిలువని పేరంటంబును వలవని చెలిమియును జేయవలదుర సుమతీ! |
81 |
| క. |
పురికిని బ్రాణము కోమటి వరికిని బ్రాణంబు నీరు వసుమతి లోన\న్ గరికిని బ్రాణము తొండము సిరికిని బ్రాణంబు మగువ సిద్ధము సుమతీ! |
82 |
| క. |
పులిపాలు తెచ్చి యిచ్చిన నలవడఁగ గుండెగోసి యఱచే నిడినన్ దల పొడుగు ధనముఁ బోసిన వెలయాలికిఁ గూర్మి లేదు వినురా సుమతీ! |
83 |
| క. |
పెట్టిన దినములలోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్ బెట్టని దినములఁ గనకపు గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ! |
84 |
| క. |
పొరుగునఁ బగవాఁడుండిన నిరవొందఁగ వ్రాఁతగాఁడె యేలికయైన\న్ ధరఁ గాఁపు కొండెమాడినఁ గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ! |
85 |
| క. |
బంగారు కుదువఁ బెట్టకు సంగరమునఁ బాఱిపోకు సరసుఁడవైనన్ నంగడి వెచ్చము లాడకు వెంగలితోఁ జెలిమి వలదు వినురా సుమతీ! |
86 |
| క. |
బలవంతుఁడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా? బలవంతమైన సర్పము చలి చీమల చేతఁ జిక్కి చావదె సుమతీ! |
87 |
| క. |
మండలపతి సముఖంబున మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్ గొండంత మదపుటేనుఁగు తొండము లేకుండినట్టు దోఁచుర సుమతీ! |
88 |
| క. |
మంత్రిగలవాని రాజ్యము తంత్రము చెడకుండ నిలచుఁ దఱచుగ ధరలో మంత్రివిహీనుని రాజ్యము జంత్రపుఁ గీలూడినట్లు జరుగదు సుమతీ! |
89 |
| క. |
మాటకుఁ బ్రాణము సత్యము కోటకుఁ బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్ బోటికిఁ బ్రాణము మానము చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ! |
90 |