శతకములు సుమతి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
క. కొఱగాని కొడుకు పుట్టినఁ
గొఱగామియె కాదు తండ్రి గుణములఁ జెఱచున్‌
జెఱకు తుద వెన్ను పుట్టినఁ
జెఱకునఁ దీపెల్లఁ జెఱచు సిద్ధము సుమతీ!
41
క. కోమలి విశ్వాసంబును
బాములతోఁ జెలిమి యన్యభామల వలపున్‌
వేముల తియ్యఁదనంబును
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ!
42
క. గడనగల మగనిఁ జూచిన
నడుగడుగున మడుఁగులిడుదు రతివలు తమలోఁ
గడనుడుగు మగనిఁ జూచిన
నడపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!
43
క. చింతింపకు గడచినపని
కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో
నంతఃపురకాంతలతో
మంతనములుమాను మిదియె మతముర సుమతీ!
44
క. చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుఁడు దగన్‌
హేమంబుఁ గూడఁ బెట్టిన
భూమీశుల పాలఁ జేరు భువిలో సుమతీ!
45
క. చుట్టములు గాని వారలు
చుట్టములము నీ కటంచు సొంపు దలిర్పన్‌
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!
46
క. చేతులకుఁ దొడవు దానము
భూతల నాథులకుఁ దొడవు బొంకమి ధరలో
నీతియ తొడవెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!
47
క. తడవోర్వక యొడలోర్వక
కడువేగం బడచిపడినఁ గార్యంబగునే
తడవోర్చిన నొడలోర్చినఁ
జెడిపోయిన కార్యమెల్లఁ జేకుఱు సుమతీ!
48
క. తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ
దన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!
49
క. తన యూరి తపసితనమును
దన పుత్త్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్‌
దన పెరటిచెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ!
50
AndhraBharati AMdhra bhArati - shatakamulu - sumati shatakamu ( telugu andhra )