| శతకములు | సుమతి శతకము |
|
| క. |
ఏఱకుమీ కసుగాయలు దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ పాఱకుమీ రణమందున మీఱకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ! |
21 |
| క. |
ఒకయూరికి నొక కరణము నొక తీర్పరియైనఁ గాక నొగిఁ దఱచైనన్ గకవికలు గాకయుండునె సకలంబును గొట్టువడక సహజము సుమతీ! |
22 |
| క. |
ఒల్లని సతి నొల్లని పతి నొల్లని చెలికాని విడువ నొల్లని వాఁడే గొల్లండు కాక ధరలో గొల్లండును గొల్లఁడౌనె గుణమున సుమతీ! |
23 |
| క. |
ఓడల బండ్లును వచ్చును ఓడలు నాబండ్లమీఁద నొప్పుగ వచ్చు\న్ ఓడలు బండ్లును వలెనే వాడంబడుఁ గలిమి లేమి వసుధను సుమతీ! |
24 |
| క. |
కడు బలవంతుండైనను బుడమినిఁ బ్రాయంపుటాలిఁ బుట్టినయింటన్ దడవుండ నిచ్చెనేనియుఁ బడుపుగ నంగడికిఁ దానె పంపుట సుమతీ! |
25 |
| క. |
కనకపు సింహాసనమున శునకముఁ గూర్చుండఁబెట్టి శుభ లగ్నమునం దొనరఁగఁ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ! |
26 |
| క. |
కప్పకు నొరగాలైనను సర్పమునకు రోగమైన సతి తులువైనన్ ముప్పున దరిద్రుఁడైనను దప్పదు మఱి దుఃఖమగుట తథ్యము సుమతీ! |
27 |
| క. |
కమలములు నీటఁ బాసినఁ గమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్ దమ తమ నెలవులు దప్పినఁ దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ! |
28 |
| క. |
కరణముఁ గరణము నమ్మిన మరణాంతకమౌను గాని మనలేఁడు సుమీ కరణము దన సరి కరణము మఱి నమ్మక మర్మమీక మనవలె సుమతీ! |
29 |
| క. |
కరణముల ననుసరింపక విరసంబునఁ దిన్నతిండి వికటించుఁ జుమీ యిరుసునఁ గందెనఁ బెట్టక పరమేశ్వరు బండియైనఁ బాఱదు సుమతీ! |
30 |