| శతకములు | ఆంధ్రనాయక శతకము |
|
| సీ. |
భువనమోహన! కృష్ణమూర్తివి నీ వేని- ఆలీల లిచ్చట నాడవలదె? బలసముజ్జ్వల కామపాలుఁడ వీ వేని- దీపించి యాబల్మిఁ జూపవలదె? వీరనృసింహావతారుఁడ వీ వేనిఁ- దత్తేజ మింతైనఁ దాల్పవలదె సత్యవిక్రమ! రామచంద్రుఁడ వీ వేని- ఆపౌరుష మొకింత చూపవలదె? |
|
| తే. |
యెంచ దేవర దైవమో యీవె కాని-చూపఱకు నీదు మహిమను జూపవలదె? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
91 |
| సీ. |
ఆలగాపరివాఁడ వనక నిన్నఖిలవే- దాంతమార్గ విహారి వందు నేమి? హలముఁ బట్టివవాఁడ వనక న్బహువిధా- జాండనిర్వాహుఁడ వందు నేమి? యలసారివాఁడ వంచనక నిన్ను సమస్త- శాస్త్రప్రపూర్ణుఁడ వందు నేమి? యడవి ద్రిమ్మరివాఁడ వనక నిన్సకల లో- కాపన్నివారుఁడ వందు నేమి? |
|
| తే. |
పుడమి నీ దగు కొంచెపునడత లెంచ-కభినుతింతునె లోకైక విభుఁడ వనుచు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
92 |
| సీ. |
మామయింటికిఁ బోవ మంచితీర్థము పుట్ట- దతఁ డంత కారువాఁడతఁడె సుమ్ము పునుక కంచము తోలుపుట్టంబు గలమిత్రుఁ- డెందు నన్నముఁ జెట్టు నేమి గప్పు మాటమాత్రం బైన మగువ నో రాపదు- కొడుకు పెట్తునె తలగొట్లమారి యన్నది మేషాండ మున్న దిచ్చే దొక్క- తొఱ్ఱిగొ డ్డది నీకుఁ దోలు నేమి |
|
| తే. |
ఎవ్వరింటికిఁ బోయిన నేమి ఫలము-ఉన్నచో నుండి సిరులఁ బెంపొందు మయ్య చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
93 |
| సీ. |
దుర్జనభంజనోర్యుక్త సుదర్శన- ధారివే నీవు యదార్థముగను శాత్రవభయద విస్వన పాంచజన్య భూ- షిత కరాంబుజుఁడవే సిద్ధముగను మత్తారిభేదనాయత్త కౌమోదకి- నిజకరభరితమే నిశ్చయముగ ఘోరవిద్విడ్రక్త ధారార్ధ్రనందక- సంధానపాణివే సత్యముగను |
|
| తే. |
సన్నుతామోఘ బాణైకశార్ఞ్గచక్ర-శయుఁడవే నమ్మవచ్చునే స్వామి! నిన్ను? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
94 |
| సీ. |
ఇల్లు రత్నాకరం బెన్నాళ్ళకును జాలు- జీవనం బొరుల యాచింపవలెనె? ఇంట మహాలక్ష్మి యెప్పుడు దాండవం- బొనరించు నొకఁడు నీ కొసఁగవలెనె? స్థిరత లోలోన నిక్షేపించు ధనము నెం- చఁగ రాని దొకరిఁ జేఁ జాపవలెనె? పంటపైరులకాఁపు కంటఁ గాయుచునుండు- కోరికఁ బెరసొమ్ము గొనఁగవలెనె? |
|
| తే. |
ధాత్రి నెవ్వరి రక్షించఁ దలఁచినావొ-కోరువారలచేఁ బూజ గొందు వింతె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
95 |
| సీ. |
అబ్ధికన్యా వివాహ మహోత్సవము నాఁడుఁ- జూడలే దిచ్చోట జూడఁ గలిగె జానకీకల్యాణసంభ్రమం బానాఁడు- జూడలే దిచ్చోట జూడఁ గలిగె భోజసుతోద్వాహ భూరివైభవమందుఁ- జూడలే దిచ్చోటఁ జూడఁ గలిగె రేవతీపరిణయ శ్రీవిలాసంబపుడు- చూడలే దిచ్చోటఁ జూడఁ గలిగె |
|
| తే. |
ననుచు నిట రాజ్యరమఁ బెండ్లియాడ-నిన్నుఁ బ్రజలు సేవించి సంతోషభరితులైరి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
96 |
| సీ. |
అఖిలలోక స్థాపనాచార్యమణి వయ్యు- నిజభక్తగురునిచే నిలుపుకొన్న గర్భస్థితానేక కమలజాండుఁడ వయ్యు- నొండుకోవెలని జెల్వొందుచున్న బహుచరాచర భూతపరిపాలకుఁడ వయ్యు- భక్తార్పితార్థము ల్పట్టుచున్న హరచతుర్ముఖ దేవతాగోచరుఁడ వయ్యు- నెప్పుడు దర్శనం బిచ్చుచున్న |
|
| తే. |
నిన్ను సేవింప రెవ్వరో పెన్నిధాన-మెదుట నుండంగఁ గనిమూసి యేఁగువారె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
97 |
| సీ. |
కైలాస మేరు సంకాశ నాగాశన- స్కంధంబుపై రథోత్సవము గల్గఁ జందనమందార సంతానకల్పక- వనముల మృగయోత్సవమ్ము గల్గ రంగత్పయఃపయోరాశి వీచికలపై- వర్ణింప డోలోత్సవంబు గల్గ బహుఫణారత్న శుంభద్భుజంగమ భోగ- వసతిఁ బర్యంకోత్సవంబు గల్గ |
|
| తే. |
బరకృతోత్సవ మిచ్చట బ్రాఁతె నీకు-భక్త జనులకు నేత్రోత్సవంబె కాని చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
98 |
| సీ. |
కోరిక లీను వైకుంఠంబులోని- లోననగరిలో నామూల నవ్యదివ్య సౌధంబుదాపలి సరసమందారవ- నాంతరామృత సరఃప్రాంతచంద్ర కాంతోపలోత్పల కల్పితపర్యంక- సకల సౌభాగ్య లక్షణనివాస లక్ష్మీమనోజ్ఞ విలాసివశీకృత- సంభోగసామ్రాజ్యసంతతాభి |
|
| తే. |
రామమూర్తికి వాంఛేతర ప్రపంచ-మేమి గావరె లీలార్థ మింతె కాని చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
99 |
| సీ. |
గుఱుతుగ సద్భక్తకోటి కీనాఁటికి- విడరాని బహుఋణస్థుఁడవు నీవు సేవకు లెన్నెన్ని త్రోవలఁ జనుచున్న- వదలక యనుసరించెదవు నీవు నిజదాసు లాత్మేచ్ఛ నిలిపి రెచ్చో నిన్నుఁ- దొలఁగ కచ్చోటనే నిలచె దీవు శ్రితు లంబలియు నైనఁ జేఁ జూప నది యెంత- యమృతభోగంబుగా నలరె దీవు |
|
| తే. |
జగము లన్నియు నీకు వశ్యము లటంటి-వీవు నిజదాసవశ్యుఁడ వెంత ఘనత? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
100 |